మా హక్కులు మాకు దక్కాలి

ABN , First Publish Date - 2022-07-25T09:02:34+05:30 IST

గిరిజనులంటే.. కొండ కోనల్లో ఉన్నా.. మైదాన ప్రాంతాల్లో ఉన్నా ఒకటే!.. అందరికీ ఒకేతరహా ఫలాలు అందాలి!.. ప్రభుత్వాలు ఏజెన్సీ, మైదాన.. అని తేడా లేకుండా

మా హక్కులు మాకు దక్కాలి

మైదాన ప్రాంత గిరిజనుల ఉద్యమబాట

5 లక్షల మందితో భారీ సభకు నిర్ణయం.. రాజకీయ ప్రాతినిధ్యమే లక్ష్యం

13 లక్షల మంది గిరిజనులతో ఎస్టీ నియోజకవర్గాల కోసం పోరు

విజయవాడ రౌండ్‌టేబుల్‌లో గిరిజనుల సమస్యలపై పలు తీర్మానాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గిరిజనులంటే.. కొండ కోనల్లో ఉన్నా.. మైదాన ప్రాంతాల్లో ఉన్నా ఒకటే!.. అందరికీ ఒకేతరహా ఫలాలు అందాలి!.. ప్రభుత్వాలు ఏజెన్సీ, మైదాన.. అని తేడా లేకుండా పథకాలు అమలు చేయాలి! అయితే ఏజెన్సీ లో మాదిరి దక్కాల్సిన అన్ని ప్రయోజనాలూ మైదాన ప్రాంతాల గిరిజనులకు దక్కకపోవడంతో వారిప్పుడు పోరుబాట ఎంచుకున్నారు. చట్టప్రకారం తమకు రావాల్సిన హక్కుల కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా మైదాన ప్రాంత గిరిజనుల పరిస్థితిని పట్టించుకోకపోవడంపై రగిలిపోతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే తప్ప మైదాన గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందవన్న నిర్ణయానికి 13లక్షల మంది మైదానప్రాంత గిరిజనులు వచ్చారు. ఇప్పటికే ఆర్సీ హిల్స్‌లో ఓ దఫా సమావేశమయ్యారు. ఆదివారం విజయవాడలో 51 గిరిజన సంఘాలు సమావేశమై చర్చించాయి. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబును ఆహ్వానించారు. 5లక్షల మంది గిరిజనులతో సమావేశం ఏర్పాటుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. 2026 లోపు మైదాన ప్రాంతాల్లో ఎస్టీ నియోజకవర్గాల రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.


తీర్మానాలివీ...

మైదాన ప్రాంతాల్లో ఎస్టీ నియోజకవర్గాలను కేటాయించాలి. మైదాన ప్రాంత గిరిజనులకు శాసనమండలిలో స్థానం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మైదాన ప్రాంతంలో గిరిజన సంక్షేమశాఖ, రెవెన్యూశాఖ ద్వారా ప్రత్యేక జనాభా లెక్కల కార్యక్రమాన్ని మరోసారి చేపట్టాలి. మైదాన ప్రాంత నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. మైదానప్రాంత గిరిజనుల కోసం జిల్లాకో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యమివ్వాలి. కులవృత్తులను చేసుకునేవారికి తోడ్పాటునందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే పథకాలు తీసుకురావాలి.


నేతలు ఏమన్నారంటే...

రాష్ట్రంలో ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలుంటే ఒక్కరికి కూడా మైదాన ప్రాంత ఎస్టీల ప్రయోజనాలు పట్టవా? అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మైదాన ప్రాంతాల్లో గిరిజనులకు సీట్లు ఇచ్చేందుకు బీఎస్పీ సుముఖంగా ఉందన్నారు. అఖిల భారత గిరిజన సంఘం జాతీయ అధ్యక్షుడు దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైదాన ప్రాంత గిరిజనులకు ఎస్టీ సీట్లు కేటాయించడమనేది న్యాయమైన కోర్కె అని, గిరిజనులకు 11-12 ఎస్టీ నియోజకవర్గాలు కేటాయించాలని కోరారు. ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు మాట్లాడుతూ 32 లక్షల ఆదివాసీ ప్రజలు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ప్రతి గిరిజనుడు, ప్రతి గూడెంలో మైదాన ప్రాంత రిజర్వేషన్లపై చైతన్యం రావాలని, ఆ చైతన్యం ఢిల్లీకి తాకాలన్నారు. గిరిజన సంఘాల నేతలు దివాకర్‌, రవి, శంకర్‌, రాజు తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 51 గిరిజన సంఘాలు పాల్గొన్నాయి. 


సబ్‌ప్లాన్‌ నిధులు గిరిజన ప్రాంతాలకే 

గిరిజన గురుకులాల్లో నాణ్యమైన విద్య లేకపోవడం, సరిపడా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ గిరిజన సంక్షేమ సంఘం పేర్కొంది. ఆదివారం ఆ సంఘం మైదాన ప్రాంత రాష్ట్ర సమావేశం బాలాజీనాయక్‌ అధ్యక్షతన విజయవాడ లో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.గోపిరాజు మాట్లాడుతూ రద్దు చేసిన గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు గిరిజన ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం కార్యదర్శి రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-25T09:02:34+05:30 IST