Oct 8 2021 @ 18:39PM

‘జీ 5’ ఫిల్మ్ ‘హెడ్స్ అండ్ టేల్స్’ ఫ‌స్ట్‌లుక్‌ వదిలిన రెజీనా

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’ ఓటీటీ‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ రెజీనా విడుదల చేసి.. ఈ లుక్ చాలా బాగుందని, తనకు నచ్చిందని పేర్కొన్నారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుందని.. ‘గాళ్ ఫార్ములా’ ఫేమ్ శ్రీవిద్య-దివ్య ద్వయం ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారని చిత్రయూనిట్ పేర్కొంది.


ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ.. అని తెలపగా.. దర్శకుడు సాయికృష్ణ ఎన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఒక్క రాత్రిలో జరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. జీవితంలో వివిధ దశల్లో ఉన్న మహిళలు సమస్యలను పరిష్కరించే విధానం వేరుగా ఉంటుంది. మహిళల కథతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి మహిళకు స్ఫూర్తినిస్తుంది. తమ కోసం, తమ హక్కుల కోసం నిలబడాలని చెబుతుంది. ఇందులో జీవిత తత్వమూ ఉంది. మనం ఆలోచించే దానికంటే విధితో మన జీవితాలు ఎక్కువ ముడిపడి ఉన్నాయని చెప్పే చిత్రమిది..’’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి.