నెల దాటినా నేటికీ అందని పునర్‌ నియామక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-04-24T03:49:41+05:30 IST

ఉపాధి హామీఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగాలపై వారిలో ఆశలు చిగురించాయి. సమస్యలను పరిష్కరించాలని రెండేళ్ల క్రితం సమ్మెకు వెళ్లిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

నెల దాటినా నేటికీ అందని పునర్‌ నియామక ఉత్తర్వులు
దీక్షలో కూర్చున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు(ఫైల్‌)

- అసెంబ్లీసాక్షిగా విధుల్లోకి తీసుకుంటామని సీఎం హామీ

- జిల్లాలో 175 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 23: ఉపాధి హామీఫీల్డ్‌ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగాలపై వారిలో ఆశలు చిగురించాయి. సమస్యలను పరిష్కరించాలని రెండేళ్ల క్రితం సమ్మెకు వెళ్లిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నో పోరాటాలు, విజ్ఞప్తుల అనంతరం నెలన్నర క్రితం సీఎం మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం పునర్‌ నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. 

2020 మార్చి నెలలో జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 40రోజులు తగ్గకుండా పని కల్పించాలని ప్రభుత్వం 4779 జీవోను జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ జీతభత్యా లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఫీల్డ్‌అసిస్టెంట్లు అప్పట్లో సమ్మెకు దిగారు. అదే సమయంలో కరోనావైరస్‌ వ్యాప్తి పెరగడంతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాత్కాలికంగా సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధపడగా వారిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవనోపాధి కోల్పోయిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు పలు దఫాలుగా మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్‌ అధికారులకు వినతిప త్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నాగార్జున సాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యుర్థులుగా నామినేషన్లు సైతం దాఖలు చేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డున పడ్డ ఫీల్డ్‌ అసిస్టెంట్లను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఇటీవల విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే సీఎం ప్రకటించి నెల దాటినా ప్రభుత్వం నుంచి ఇంకా నియామక ఉత్తర్వులు వెలువడ లేదు. 

నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

- బోయిరే రమేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

సీఎం కేసీఆర్‌ మమ్మల్ని గుర్తించి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించడంతో కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు దినసరి కూలీలుగా పని చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన మాకు చాలా ఊరటనిచ్చింది. ప్రభుత్వం స్పందించి త్వరగా విధుల్లోకి తీసుకోవాలి.

వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

- చౌదరి శ్రీనివాస్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దీంతో మేమంతా సంతోష పడ్డాం. కానీ నెల రోజులు దాటినా నియామక పత్రాలు అందక పోవడంతో కొంత గందరగోళానికి గురి కావాల్సి వస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

Updated Date - 2022-04-24T03:49:41+05:30 IST