యానిమేటర్ల తగ్గింపు?

ABN , First Publish Date - 2021-07-21T05:16:05+05:30 IST

డ్వాక్రా సంఘాలను నడిపించి లాభాల బాటలో తీసుకొచ్చేందుకు నియమించిన యానిమేటర్ల తగ్గింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

యానిమేటర్ల తగ్గింపు?

సచివాలయానికి ఇద్దరే

6411 సర్క్యులర్‌ విడుదల 

వందల మంది ఇంటిదారేనా? 


కడప (నాగరాజుపేట), జూలై 20: డ్వాక్రా సంఘాలను నడిపించి లాభాల బాటలో తీసుకొచ్చేందుకు నియమించిన యానిమేటర్ల తగ్గింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. యానిమేటర్లకు 40 సంవత్సరాల వయస్సు మించకూడదని, కనీస విద్యార్హత, 30 సంఘాలకు ఒక్కరే, సచివాలయానికి ఇద్దరు మాత్రమే ఉండాలన్న నిబంధనలతో ప్రభుత్వం 6411 సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఈ సర్క్యులర్‌తో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని యానిమేటర్లు (వీవోఏలు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేయవద్దని తమకు ఇలాగే కొనసాగించాలని సీఎంకు వారు వినతిపత్రాలు కూడా పంపారు. జిల్లాలో 39,474 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 1639 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందల మంది ఇంటిదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 636, పట్టణ ప్రాంతాల్లో 266 సచివాలయాలు ఉన్నాయి. సచివాలయానికి ఇద్దరు, 30 సంఘాలకు పైబడి ఒకరు చొప్పున యానిమేటర్లను తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని, పనితీరును బట్టి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కొనసాగించడమా, తీసివేయడమా జరుగుతుందని అధికారులు తెలిపారు.


జీతాల్లో కోత

యానిమేటర్లు ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.8 వేలు ఇస్తోంది. మిగిలిన 2 వేలు గ్రామ సంఘాల ద్వారా తీసుకునేలా చేసింది. గ్రామ సంఘాలు లాభాల్లో ఉంటేనే 2 వేలు తీసుకోండి అని చెప్పడంతో దాదాపు జిల్లాలో 80 శాతం సంఘాలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో ఆ 2 వేలు కూడా రావడం లేదు. తమకు వచ్చే ఆ 8 వేలు కూడా నాలుగు నెలలుగా ఇవ్వలేదని యానిమేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


30 సంఘాలకు ఒకే యానిమేటర్‌ 

- మురళీ మనోహర్‌, పీడీ, డీఆర్‌డీఏ

ప్రతి 30 సంఘాలకు ఒక యానిమేటర్‌ ఉండాలి. తక్కువ సంఘాలు ఉంటే జీతాలు నిలిపివేయాలని సర్క్యులర్‌ వచ్చింది. సర్క్యులర్‌ నియమ నిబంధనలు అమలు చేయాల్సిందే. వారిని తొలగిస్తున్నట్లు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సంఘాలు తక్కువగా ఉన్నప్పుడు పక్క సంఘాలను కలుపుకోవాలని ఉత్తర్వుల్లో ఉంది. 


ఉద్యోగ భద్రత కల్పించాలి 

- గంగాదేవి, కార్యవర్గ సభ్యురాలు, యానిమేటర్ల సంఘం జిల్లా కమిటీ

జిల్లాలో పనిచేస్తున్న యానిమేటర్లు (వీవోఏ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గ్రేడింగ్‌ విధానంతో తొలగింపులు అనేవి జరగకూడదు. బీమా సౌకర్యం కల్పించాలి. జిల్లాలో ఉన్న అందరినీ యదావిధిగా కొనసాగించి ప్రతినెలా జీతాలు ఇవ్వాలి.

Updated Date - 2021-07-21T05:16:05+05:30 IST