తగ్గనున్న సన్‌ఫ్లవర్‌ నూనె ధర

ABN , First Publish Date - 2022-05-25T07:50:23+05:30 IST

దేశంలో సోయా, సన్‌ఫ్లవర్‌ వంట నూనెల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. రెండేళ్ల (2022-23, 2023 -24 ఆర్థిక సంవత్సరాలు) పాటు ఏటా 20 లక్షల టన్నుల పరిమితికి లోబడి..

తగ్గనున్న సన్‌ఫ్లవర్‌ నూనె ధర

రెండేళ్ల పాటు సుంకాలు ఎత్తివేసిన ప్రభుత్వం

సోయా, సన్‌ఫ్లవర్‌  ఆయిల్‌కు వర్తింపు 

ఏటా 20 లక్షల టన్నుల దిగుమతులకు అనుమతి

న్యూఢిల్లీ: దేశంలో సోయా, సన్‌ఫ్లవర్‌ వంట నూనెల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. రెండేళ్ల (2022-23, 2023 -24 ఆర్థిక సంవత్సరాలు) పాటు ఏటా 20 లక్షల టన్నుల పరిమితికి లోబడి.. ఈ రెండు వంట నూనెలను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే దిగుమతి చేసుకునే క్రూడ్‌ (శుద్ధి చేయని) సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అగ్రికల్చర్‌ సెస్‌ పేరుతో విధిస్తున్న 5 శాతం ప్రత్యేక సెస్‌ కూడా ఈ రెండు ముడి వంట నూనెలకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శుద్ధి చేయని సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతిపై 5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.


ఈ రెండు పన్నుల ఎత్తివేతతో దేశంలో ఈ రెండు వంట నూనె ల సెగ కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. తాజా సుంకాల తగ్గింపుతో 2024 మార్చి వరకు మొత్తం 80 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌ నూనెలను ఉచితంగా దిగు మతి చేసుకునే అవకాశం లభించనుంది. సుంకాల ఎత్తివేత కారణంగా లీటర్‌ సోయాబీన్‌ ధర రూ.3 వరకు తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీవీ మెహతా తెలిపారు. కాగా వినియోగదారులకు పెరుగుతున్న ధరల నుంచి ఉపశ మనం కల్పించేందుకు సుంకాలను పూర్తిగా ఎత్తి వేసినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. మరోవైపు టారిఫ్‌ రేట్‌ కోటా (టీఆర్‌క్యూ) కింద సుంకాల ఎత్తివేతను వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. 


ఎందుకంటే ?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర భారీగా పెరిగింది. యుద్ధానికి ముందు ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ క్యాన్‌ రిటైల్‌ ధర కంపెనీని బట్టి రూ.700 నుంచి రూ.820 మధ్య ఉండేది. యుద్ధంతో ఈ రెండు దేశాల నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కె ట్లో ఐదు లీటర్ల సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ క్యాన్‌ రిటైల్‌ ధర రూ.990 నుంచి రూ.1,080 వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలతో దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా చౌకగా వచ్చే పామాయిల్‌కు మళ్లారు. మలేషియాలో పంట దిగుబడి తగ్గడం, నిన్నమొన్నటి వరకు ఇండోనేషియా నిషేధంతో పామాయిల్‌ ధరా కొండెక్కింది. యుద్ధానికి ముందు లీటర్‌ రూ.140 నుంచి రూ.150 మధ్య పలికిన పామాయిల్‌ ఇప్పుడు కిలో రూ.160 నుంచి 170 మధ్య పలుకుతోంది. దీంతో వంట నూనెలపై పన్నుల భారం మరింత తగ్గించడం ద్వారా వాటి ధరలను కొంతలో కొంతైనా తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సుంకాల తగ్గింపుతో గరిష్ట స్థాయిలకు చేరిన ద్రవ్యోల్బణం కొద్దిగా దిగొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 


చక్కెర ఎగుమతులపై ఆంక్షలు

ఈ ఏడాది అక్టోబరుతో ముగిసే 2021-22 చక్కెర సీజన్‌లో చక్కెర ఎగుమతులను కోటి టన్నులకు పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.    పండగల సీజన్‌లో దేశంలో చక్కెర ధరలు చుక్కలనంటే  ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మన దేశం నుంచి 90 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులకు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటికే 75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి అయ్యింది. బ్రెజిల్‌లో పంట దెబ్బతినడంతో అంతర్జాతీయ మార్కెట్లో  చక్కెర ధర పెరిగింది. దీంతో దేశీయ చక్కెర మిల్లులకు పెద్ద ఎత్తున ఎగుమతి అవకాశాలు ఏర్పడ్డాయి. కాగా చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించటం  ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

Updated Date - 2022-05-25T07:50:23+05:30 IST