తగ్గిన ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-06-29T05:30:00+05:30 IST

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

తగ్గిన ఉత్తీర్ణత


  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అంతంత మాత్రమే పాస్‌
  • ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 2,067మంది విద్యార్థులు ఫెయిల్‌!
  • మెరుగుపడని అధ్యాపకుల పనితీరు
  • బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపమూ కారణమే
  • అడ్మిషన్లపై చూపుతున్న ప్రభావం
  • భవిష్యత్తులో కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. దీంతో మున్ముందు సర్కారు కాలేజీల మనుగడే ప్రశ్నార్థంగా మారే పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో 17 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో చదివే విద్యార్థులు మొన్న ప్రకటించిన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్‌లో 28శాతం, సెకండియర్‌లో 41శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అధ్యాపకుల బోధన సరిగా లేకపోవడం, కొన్నిచోట్ల ఒంటిపూట కాలేజీల నిర్వహణ, ఇంటర్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పడిపోవడానికి కారణమవుతోంది.

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 29: గతంలో ప్రభుత్వ కళాశాలలంటే ఉత్తీర్ణతపై నమ్మకం ఉండేది. అక్కడ చదివిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న భరోసా తల్లిదండ్రుల్లో ఉండేది. రానురాను ఆ పరిస్థితి మారుతోంది. ఇందుకు ఈ నెల 28న విడుదలైన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్ష ఫలితాలే నిదర్శనం. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివిన జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు చాలా మంది ఫెయిల్‌ అయ్యారు. ఈ ప్రభావం కొత్త అడ్మిషన్లపై పడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఇంటర్మీడియట్‌ కళాశాలల పనితీరుపై పర్యవేక్షణ లోపించడంతోనే పరిస్థితి దారుణంగా ఉందనే వాదనా ఉంది. జిల్లాలో ఈ సారి ఇంటర్‌ పరీక్ష ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఎన్నడూ లేనివిధంగా ఉత్తీర్ణత పడిపోయింది. దీంతో పదో తరగతి పాసైన చాలా మంది విద్యార్థులు ప్రైవేట్‌లో చేరాలనుకుంటున్నారు. ఏ కాలేజీ అయినా దాని ప్రతిభ రికార్డు చూసే చేరుతారు. కాలేజీల్లో బోధన తీరు బాగుంటేనే పాస్‌ పర్సెంటేజీ ఎక్కువగా ఉంటుందనేది అందరూ నమ్మే మాట. దీంతో ఫలితాల శాతం తక్కువ ఉన్న కాలేజీల్లో కొత్త అడ్మిషన్లు నామమాత్రమే నమోదయ్యే ఆస్కారం ఉంది. జిల్లాలో 17ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్‌లో 3,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 995 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 28గా నమోదైంది. సెకండియర్‌లో 2,607 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,072 మంది విద్యార్థులు పాసయ్యారు. 41శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

అట్టడుగున ఇబ్రహీంపట్నం, యాచారం కాలేజీలు

ఇంటర్‌ ఫరీక్షల ఫలితాల్లో ఇబ్రహీంపట్నం, యాచారం జూనియర్‌ కశాశాలలు అట్టడుగున నిలిచాయి. ఫస్టియర్‌లో ఇబ్రహీంపట్నం కాలేజీలో 153మంది పరీక్షలు రాయగా 22 మంది మాత్రమే పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 14.38గా ఉంది. యాచారం ప్రభుత్వ కాలేజీలో 78మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13మంది పాసయ్యారు. 16.67శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో యాచారం కళాశాల విద్యార్థులు 89 మంది పరీక్షలు రాయగా 18మందే పాసయ్యారు. 20.22శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇబ్రహీంపట్నం కాలేజీ సెకండియర్‌ విద్యార్థులు 128మందికి 32మంది పాసయ్యారు. 25శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

మాడ్గుల, కేశంపేట కాలేజీల విద్యార్థులు ప్రతిభ

ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో మాడ్గుల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్టియర్‌లో 75మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 71మంది పాసయ్యారు. 94.67శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 87మంది విద్యార్థులకు 78మంది పాసయ్యారు. 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మాడ్గుల తర్వాత కేశంపేట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభను చూపారు. ఫస్టియర్‌లో 96మంది విద్యార్థులకు 69మంది పాసయ్యారు. 71.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 100 విద్యార్థులకు 80మంది పాసయ్యారు. 80శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో మంచాల జూనియర్‌ కళాశాల విద్యార్థుల ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయి. 39 మంది విద్యార్థులకు 27 మంది పాసయ్యారు. 69.23శాతం ఉత్తీర్ణత సాధించారు. కందుకూరు జూనియర్‌ కళాశాలలో 93మంది విద్యార్థులకు 50మంది పాసయ్యారు. 53.76శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ఉదయం ఇంటర్‌.. మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థులకు బోధన

కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు షిఫ్టింగ్‌ పద్ధతిన కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్‌, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. డిగ్రీ కళాశాలల కొత్త భవన నిర్మాణాలు ఏళ్లుగా కొనసాగతున్నాయి. నిధుల్లేక నిర్మాణాలు నిదానంగా జరుగుతున్నాయి. దీంతో ఇంటర్‌, డిగ్రీ కళాశాలలను ఒకే భవనంలో నెట్టుకొస్తున్నారు. ఇలా జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. సగం పూట తరగతులతో విద్యార్థులకు విద్యాబోధన సరిగ్గా సాగడం లేదు.

50శాతం పైగానే గురుకులాల బాలికల ఉత్తీర్ణత

కస్తూర్బాగాంధీ గురుకులాల బాలికలు ఇంటర్‌, సెకండియర్‌లలో 50శాతంపైగానే పాసయ్యారు. ఫస్టియర్‌లో కొందుర్గు కేజీబీవీ బాలికలు 81.25శాతం మంది, మహేశ్వరంలో 80శాతం, కందుకూరులో 84.62 శాతం, శంకర్‌పల్లిలో 76.06శాతం, ఫరూక్‌నగర్‌లో 92.42శాతం, శంషాబాద్‌లో 68.89శాతం, ఇబ్రహీంపట్నంలో 68శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో కందుకూరులో 87.65శాతం, శంకర్‌పల్లిలో 80శాతం, ఫరూక్‌నగర్‌లో 91.11శాతం, శంషాబాద్‌లో 80.85శాతం, ఇబ్రహీంపట్నంలో 61శాతం మంది బాలికలు పాసయ్యారు.

కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు

కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఫస్టియర్‌లో 456మంది బాలికలు పరీక్షలు రాయగా 375 మంది పాసయ్యారు. 82.23శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 354 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 301మంది పాసయ్యారు. 85శాతం ఉత్తీర్ణత సాధించారు. 

ఫలితాల ప్రభావం.. పడిపోతున్న అడ్మిషన్ల సంఖ్య

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏటేటా అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఒక కాలేజీలో ఉత్తీర్ణత బాగుంటేనే తల్లిదండ్రులు వారి పిల్లలను ఆ కాలేజీలో చేర్పిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత బాగా పడిపోతుండడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇప్పటికైనా ఇంటర్‌ బోర్డు అధికారులు స్పందించి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగేలా, విద్యార్థులకు మెరుగైన విద్యను అందిచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ కళాశాలలు మూతపడే ఆస్కారం ఉందని విద్యారంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఒకేషనల్‌ కోర్సుల పరిస్థితి అంతే..

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఒకేషనల్‌ పరీక్షా ఫలితాల్లో కూడా అంతంత మాత్రంగానే పాసయ్యారు. రెండు మూడు కళాశాలల్లో మినహా మిగతా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెద్దగా లేదు. ఫస్టియర్‌లో 931 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 344మంది పాసయ్యారు. 37శాతం ఉత్తీర్ణత సాధించారు. అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైన కాలేజీల్లో రాజేంద్రనగర్‌ 17.95శాతం, శంషాబాద్‌ 18.18శాతం ఉన్నాయి. సెకండియర్‌లో 777 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 458మంది పాసయ్యారు. 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యల్పంగా రాజేంద్రగనర్‌ కాలేజీల్లో 32.14శాతం ఉత్తీర్ణత నమోదైంది.  

ముందంజలో కేశంపేట కేజీబీవీ

కేశంపేట కేజీబీవీ ఇంటర్‌ విద్యార్థినులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఫస్టియర్‌లో 78మందికి గాను 77మంది పాసయ్యారు. 98.72 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 72మంది విద్యార్థినుల్లో 98.61 శాతం మంది పాసయ్యారు.

Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST