నీట్‌కు తగ్గిన పోటీ!

ABN , First Publish Date - 2022-02-10T06:59:30+05:30 IST

వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ

నీట్‌కు తగ్గిన పోటీ!

  • రాష్ట్రంలో ఒక్కో ఎంబీబీఎస్‌ సీటుకు ఆరుగురు
  • భవిష్యత్తులో నలుగురికి తగ్గే అవకాశం 
  • ప్రస్తుతం 34 కాలేజీల్లో 5,265 సీట్లు 
  • వచ్చే విద్యా సంవత్సరం నాటికి 12 కొత్త మెడికల్‌ కాలేజీలు 
  • ఆపై విద్యా సంవత్సరానికి మరో 4
  • వీటిలో సర్కారువి 12.. ప్రైవేటులో 4  
  • అందుబాటులోకి రానున్న 7500 సీట్లు
  • నిఽధుల సేకరణకు ప్రత్యేక కార్పొరేషన్‌?
  • ఈ దిశగా యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంఽధ్రజ్యోతి) : వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)కు రాష్ట్రం నుంచి పోటీ గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలల సంఖ్య పెరగడంతో పోటీ పడే వారి సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34 కాలేజీల్లో 5,265 ఎంబీబీఎస్‌ సీట్లుండగా ఒక్కో సీటుకు ఆరుగురు విద్యార్ధులు పోటీ పడుతున్నారు. గతంలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఒక్కో ఎంబీబీఎస్‌ సీటుకు 40 మంది విద్యార్ధులు పోటీ పడే వారు. 2005 నాటికి ఆ సంఖ్య 32కు తగ్గింది. ప్రస్తుతం అది ఆరుకు చేరింది.


రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నాటికి 12 కొత్త వైద్య విద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ పై విద్యా సంవత్సరానికి (2023-24) మరో నాలుగు కాలేజీలు ఏర్పాటవుతాయి. తద్వారా మరో 7500కు పైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఒక్కో సీటుకు పోటీ పడే వారి సంఖ్య 4కు తగ్గనుంది. ప్రభుత్వం ఇప్పటికే 8 కాలేజీలను శరవేగంతో నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది మరో నాలుగు కాలేజీలను ఏర్పాటు చేయనుంది. ఇక ప్రైవేటులో మరో నాలుగు కాలేజీలు రానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 34 కాలేజీలుండగా, ఈ సంఖ్య 50కు చేరబోతోంది.


ఇక దేశంలో అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 43,237, ప్రైవేటులో 41,190 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. రెండింటా కలిపి 84649 సీట్లున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా వైద్య విద్య, వైద్య సేవలను వికేంద్రీకరించాలనుకుంటోంది. అన్ని జిల్లాల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సేవలను ప్రజలకు అందించాలనుకుంటోంది. అందుకే కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తోంది.  


ఒక్కో కాలేజీకి రూ. 520 కోట్లు 

ప్రభుత్వం నిర్మించే ఒక్కో కాలేజీకి రూ.520 కోట్ల చొప్పున మొత్తం 8 కాలేజీలకు రూ.4,160 కోట్లు వ్యయం అవుతుంది. వీటికి దశలవారీగా నిధులు కావాల్సివుంటుంది. ఈ కాలేజీలకు తోడు వరంగల్‌లో హెల్త్‌సిటీకి రూ.1100 కోట్లు, హైదరాబాద్‌లో 4 టిమ్స్‌ల ఏర్పాటుకు రూ.4 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ తరుణంలో నిర్మాణానికి, నిర్వహణకు నిధుల కొరత రాకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. తద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 


దేశంలో మెడికల్‌ కాలేజీల పరిస్థితి ఇదీ 

ఇండియాలో మొత్తం 562 మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇందులో 286 ప్రభుత్వ, 276 ప్రైవేటు వైద్య విద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మహారాష్ట్రలో 26, కర్నాటకలో 19, తమిళనాడులో 26, ఉత్తరప్రదేశ్‌లో 26, పశ్చిమ బెంగాల్‌లో 20, గుజరాత్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, బీహార్‌లో 11, కేరళలో 10, మధ్యప్రదేశ్‌లో 14, తెలంగాణలో 11 ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పదిలోపే ఉన్నాయి. కాగా, సిక్కిం, నాగాలాండ్‌లో ఒక్కటీ కూడా సర్కారీ వైద్య విద్య కళాశాల లేదు.


అలాగే అన్ని రాష్ట్రాల్లో కలిపి 276 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్నాయి. ఇందులో అత్యధికంగా కర్నాటకలో 42, మహారాష్ట్రలో 34, ఉత్తరప్రదేశ్‌లో 31, తమిళనాడులో 27, తెలంగాణలో 23, ఏపీలో 18, కేరళలో 21, గుజరాత్‌లో 13 ఉన్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు రెండింటినీ కలిపి దేశంలో అత్యధిక కాలేజీలున్న రాష్ట్రాల్లో కర్నాటక (61), మహారాష్ట్ర (60), యూపీ (57), తమిళనాడు (53), తెలంగాణ (34) వరుస స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం మెడికల్‌ కాలేజీల్లో తెలంగాణ దేశంలో ఐదోస్థానంలో ఉంది. 




కాలేజీలకు అనుబంధంగా ఆస్పత్రులు 

వైద్య విద్య కళాశాలల ఏర్పాటుతో వాటికి అనుబంధంగా ప్రతీచోటా 650 పడకల ఆస్పత్రులు వస్తాయి. వాటిల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు లభ్యమవుతాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందుతుంది. అలాగే ఎక్కువ మంది వైద్యవిద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మూడేళ్ల తర్వాత పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు కూడా పెరుగుతాయి. 

- డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు 




కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగవంతం చేయాలి


 మంత్రి హరీశ్‌రావు ఆదేశం  

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంఽధ్రజ్యోతి) ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొత్త వైద్య, విద్య కళాశాలలపై ఉన్నతాధికారులు, అయా జిల్లాల కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాళ్లతో మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేేసందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అందులో భాగంగానే కొత్తగా 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. జాతీయ వైద్య మండలి నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.


మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనుల పురోగతి గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తయిన చోట మెడికల్‌ కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.  నిర్మాణ పనులలో వేగాన్ని పెంచేందుకు ప్రతి కాలేజీకి ఒక ఇంజనీరింగ్‌ అధికారిని ఏర్పాటు చేయాలని టీఎ్‌సఐఐసీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఈఎన్సీ గణపతిరెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఇ రమే్‌షరెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బి అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-10T06:59:30+05:30 IST