కంటెయిన్‌మెంట్‌ జోన్లపై తగ్గిన శ్రద్ధ

ABN , First Publish Date - 2020-07-12T09:31:29+05:30 IST

‘మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పలుచనవుతుంది’ అనే చందంగా తయారైంది జిల్లాలో కరోనా నివారణ చర్యల పరిస్థితి. వైరస్‌ వ్యాప్తి

కంటెయిన్‌మెంట్‌ జోన్లపై తగ్గిన శ్రద్ధ

కనిపించని పోలీసు పహరా

మొదటి రోజే హైడ్రో క్లోరోక్విన్‌ పిచికారీ

యథేచ్ఛగా వ్యాపారాలు


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ‘మంది ఎక్కువైన కొద్దీ మజ్జిగ పలుచనవుతుంది’ అనే చందంగా తయారైంది జిల్లాలో కరోనా నివారణ చర్యల పరిస్థితి. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కొద్దీ కేసులు పెరిగిపోతున్నాయి. రోజూ 100కు తక్కువ లేకుండా నమోదవుతున్నాయి. జిల్లా రెండు వేల మార్కును దాటేసింది. కొత్తగా ఎక్కడ కేసు వస్తే.. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి ఆ వీధిలో రాకపోకలు లేకుండా బారికేడ్లు వేస్తున్నారు. గతంలో ప్రతి కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఈ బారికేడ్ల వద్ద షిఫ్టుల వారీగా పోలీసులు కాపలా ఉండేవారు. బయటవారు ఎవరూ రాకుండా, స్థానికులు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లకుండా చూసేవారు. ఇప్పుడు జిల్లాలో కంటెయిన్‌మెంట్‌ జోన్ల సంఖ్య 200కు మించి ఉండడంతో పోలీసుల కాపలా ఎత్తేశారు. నామమాత్రంగా రోడ్డుకు అడ్డంగా బారికేట్లు పెట్టి వెళ్లిపోతున్నారు. దాంతో ద్విచక్ర వాహన చోదకులు, ఆటో డ్రైవర్లు వాటిని పక్కకు లాగేసి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక న్యాయవాదులు, చోటా రాజకీ నాయకులు బారికేడ్లు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మద్దిలపాలెం, ఇసుకతోట, ఎంవీపీ కాలనీ ప్రాంతాల్లోకి సరకు రవాణా చేసే వ్యాన్లు, మినీ లారీలు తిరగడానికి కూడా బారికేడ్లను తీసేస్తున్నారు. 


కంటెయిన్‌మెంట్‌ జోన్లలో దుకాణాలకు ఉదయం 9 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. ఆ తరువాత మూసేయాలని పోలీసులు చెబుతున్నా... దుకాణదారులు పట్టించుకోవడం లేదు. యథా ప్రకారం రాత్రి 9 గంటల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు.


అంతంత మాత్రంగా పిచికారీ

కేసులు నమోదైన ప్రాంతంలో మొదటి రోజు మాత్రమే హై పో క్లోరోక్విన్‌ పిచికారీ చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. అలాగే వీధుల్లో కూడా బ్లీచింగ్‌ పౌడర్‌ని మొదటి రోజే చల్లుతున్నారు. మరుసటి రోజు నుంచి ఎవరూ కనిపించడం లేదు. 


ప్రజలకే వదిలేశారు

కరోనా రాకుండా ఎవరికి వారే నియంత్రణ పాటించుకోవాలని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. 


మరింత పక్కాగా అమలు చేయాలి

కరోనా నియంత్రణ చర్యలు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పక్కాగా అమలు చేయాల్సి ఉంది. ప్రతి రోజూ పారిశుధ్య పనులు చేపడుతూ బ్లీచింగ్‌ చల్లించాలి. నిర్ణీత సమయం దాటిన తరువాత దుకాణాలు తెరవకుండా చూడాలి. ప్రజలు పని లేకుండా బయట తిరగకూడదని హెచ్చరించాలి. బారికేడ్లను ఎవరూ తొలగించకుండా స్థానిక యువతకు బాధ్యత అప్పగించాలి. పిల్లలు రోడ్లపైకి వచ్చి ఆటలాడకుండా చూడాలని పెద్దలకు హెచ్చరించాలి. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఫొటోలు తీసి పంపాలని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించాలి. దీనికి ఆ ప్రాంత పోలీస్‌ అధికారి ఫోన్‌ నంబరు కేటాయించాలి.  


తలుపులు వేసుకోమంటారు.. ఎవరూ రారు

ఏదైనా అపార్ట్‌మెంట్‌లో కరోనా కేసు నమోదైతే వార్డు వలంటీర్లు వచ్చి తలుపులు వేసుకొని లోపల ఉండాలని, బయటకు రావద్దని చెబుతున్నారు. ఆ తరువాత వారు కనిపించకుండా పోతున్నారు. ఎన్నాళ్లు అలా ఉండాలో తెలియక సీనియర్‌ సిటిజన్లు ఇబ్బంది పడుతున్నారు. సరైన సమాచారం ఇవ్వడం లేదు.


కంటెయిన్‌మెంట్‌ జోన్లలో గతంలో మొబైల్‌ రైతుబజార్ల ద్వారా కూరగాయలు అమ్మేవారు. ఇప్పుడు అవి కూడా కనిపించడం లేదు. 84వ వార్డు కొత్తపాలెంలో ఓ వృద్ధ దంపతులకు కరోనా అనుమానంతో గురువారం తలుపులు వేసుకోమని చెప్పి, శనివారం వరకు సమాచారం ఇవ్వలేదు. వారింకా ఇంట్లోనే ఉన్నారు. 

Updated Date - 2020-07-12T09:31:29+05:30 IST