బూస్టర్ వ్యవధి 6 నెలలకు తగ్గించండి: కేంద్రాన్ని కోరిన సీరమ్

ABN , First Publish Date - 2022-04-13T00:30:06+05:30 IST

ప్రజలు కోవిడ్ వేరియంట్ల బారిన పడకుండా ప్రస్తుతం రెండో డోసుకు, బూస్టర్ డోస్‌కు మధ్య అమలు చేస్తున్న..

బూస్టర్ వ్యవధి 6 నెలలకు తగ్గించండి: కేంద్రాన్ని కోరిన సీరమ్

న్యూఢిల్లీ: ప్రజలు కోవిడ్ వేరియంట్ల బారిన పడకుండా ప్రస్తుతం రెండో డోసుకు, బూస్టర్ డోస్‌కు మధ్య అమలు చేస్తున్న 9 నెలల గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించాలని వ్యాక్సిన్ దిగ్గజం సెరుమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని కోరింది. మంగళవారంనాడిక్కడ జరిగిన ఏఐఎంఏ ఈవెంట్‌లో ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతూ, ప్రస్తుతం రెండో డోసుకు, మూడో డోసుకు మధ్య తొమ్మిది నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉన్నందున ప్రికాషన్ డోస్ తీసుకోవడం ఒకింత మందకొడిగా ఉందని చెప్పారు. దీనిని 6 నెలల వ్యవధికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ విషయమై చర్చలు సాగిస్తున్న నిపుణులకు తాము విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.


బూస్టర్ డోస్‌కు వ్యవధిని తగ్గించడం వల్ల విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారికి నిజమైన ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఆగస్టులో డోస్ తీసుకుంటేనే ఇప్పుడు బూస్టర్ వేయించుకునేందుకు అర్హులవుతారని, అదే ఆరు నెలలకు తగ్గిస్తే చాలా మంది బూస్టర్ వేయించుకునే వీలుంటుందని చెప్పారు. ఇందువల్ల భవిష్యత్ కోవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ కలగడంతో పాటు, లాక్‌డౌన్లు, ఇతర అవాంతరాలను కూడా తగ్గించగలుగుతామని కేంద్రానికి తెలియజేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెకెండ్ డోస్‌కు, బూస్టర్‌కు మధ్య వ్యవధి 6 నెలలు, లేదా అంతకంటే తక్కువ ఉందని కూడా పూనావాలా వివరించారు.

Updated Date - 2022-04-13T00:30:06+05:30 IST