Abn logo
Dec 12 2020 @ 00:19AM

బతుకుభారం తగ్గించండి

కరోనా దెబ్బకు ఉపాధి, ఆదాయం కోల్పోయి సామాన్య ప్రజానీకం వీధిన పడుతుంటే ఆదుకోవలసిన ప్రభుత్వాలు పన్నుపోట్లతో ఇంకా కడగండ్లపాలు చేస్తున్నాయి. ఇదే అదనంగా ప్రైవేట్‌రంగ సంస్థలు, వ్యాపారులు, ఇతర వృత్తులవారు తమ ఉత్పత్తుల ధరలను, సేవాచార్జీలను ఇష్టానుసారం పెంచుతున్నారు. ప్రైవేట్‌సంస్థలోని చిరుద్యోగులు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, రిటైరై కనీస పెన్షన్‌ సౌకర్యంలేని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల ఉద్యోగులు పెరుగుతున్న జీవన వ్యయంతో, ధరలతో అనేక ఇక్కట్లు పడుతున్నారు. కేంద్రప్రభుత్వం డీజీల్‌, పెట్రోల్‌ ధరలను సహేతుకంగా తగ్గించడం ద్వారా నిత్యవసరాల ధరలను నియంత్రించడం, పోస్టాఫీసుల్లో సామాన్యులు పొదుపు చేసుకున్న చిన్న డిపాజిట్లపై కొంతవరకైనా వడ్డీలను పెంచడం వగైరా చర్యల ద్వారా ఉపశమనం కలిగించాలి. రాష్ట్రప్రభుత్వం ఒకవైపు అడగని వరాల వర్షం కురిపిస్తూ మరోవైపు పెట్రో పన్నులు, విద్యుత్‌, రిజిస్టేషన్‌, బస్‌చార్జీలను భారీగా పెంచి ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తోంది. తాజాగా ఇంటిపన్ను కూడా పెంచింది. అనవసర రాయితీలను, పెంచిన చార్జీలను తగ్గించి సామాన్య ప్రజానీకానికి ఊరట కలిగించాలి.

తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సారావుపేట

Advertisement
Advertisement