కొంచంఊరట..ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు తగ్గేలా సర్కారు తాజా జీవో

ABN , First Publish Date - 2020-09-18T06:30:22+05:30 IST

అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించినట్లుగానే గురువారం ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఔటమ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) సవరణ జీవో జారీ అయింది...

కొంచంఊరట..ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు తగ్గేలా సర్కారు తాజా జీవో

2015 నాటి జీవోలోని నిబంధనలే అమలు

ప్లాట్‌ కొన్నప్పటి ధర ప్రకారమే క్రమబద్దీకరణ రుసుము

4 నుంచి 7కు పెరిగిన స్లాబ్‌లు


ఆంధ్రజ్యోతి, హన్మకొండ

అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించినట్లుగానే గురువారం ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఔటమ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) సవరణ జీవో జారీ అయింది. ఎల్‌ఆర్‌ఎ్‌సకు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుము నిర్ణయిస్తూ ఇటీవల జారీ చేసిన జీవో నెం.131ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.  2015 సంవత్సరం జీవో 151లోని మార్గదర్శకాలు సవరించిన జీవోలో యథాతథంగా ఉన్నాయి. 


అసెంబ్లీలో బుధవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ఓవైసితో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, సభ్యులు జగ్గారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద తదితరులు ఎల్‌ఆర్‌ఎస్‌ అంశంపై చర్చించారు. ప్లాటు కొన్నప్పటి రిజిస్ర్టేషన్‌ ధర ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ జీవో నెం.131 సవరిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. స్థలం రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్నప్పటి ధరకే  క్రమబద్ధీకరణ చార్జీ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు సుమారు 50శాతం భారం తగ్గుతుందని పేర్కొన్నారు.


పాత జీవో ప్రకారమే..

రుసుము చెల్లింపు గడువు వచ్చే మార్చి వరకు ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దగా భారం పడబోదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 2015లో జారీ చేసిన జీవోనే యథాతథంగా అమల్లోకి తెచ్చారు. అలాగే గతంలో ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన 58, 59జీవో ప్రకారం దాఖలైన అపరిష్కృత దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తామని, నోటరీ ద్వారా జరిగిన ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన అంశాన్ని కూడా సమీక్షిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడం ఊరటనిచ్చే అంశం. ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ ఉత్తర్వులు (జీవో నెం 135 ) జారీ అయ్యాయి. 


పెరిగిన స్లాబులు

ఈనెల ఒకటిన జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణ జీవో నెం.131లో 2020 ఆగస్టు 28 కట్‌ఆఫ్‌ తేదీతో ప్లాట్ల మార్కెట్‌ విలువ(చ.మీ.కు)పై క్రమబద్ధీకరణ రుసుముల పర్సంటేజీ చెల్లించేందుకు నాలుగు స్లాబ్‌లను నిర్ణయించగా,  సవరించిన ఉత్తర్వుల్లో 2015 నాటి జీవో నెం.151లో మాదిరిగానే ఏడు స్లాబ్‌లను చేశారు. మార్కెట్‌ విలువ రూ.3వేల కన్నా తక్కువ ఉంటే 20శాతం, రూ.3001 నుంచి రూ.5వేల వరకు  30శాతం, రూ.5001 నుంచి రూ.10వేల వరకు 40 శాతం, రూ. 10001 నుంచి రూ.20వేల వరకు 50శాతం, రూ.20001 నుంచి రూ. 30వేల వరకు 60శాతం, రూ.30001 నుంచి రూ. 50వేల వరకు 80శాతం, రూ. 50,001 ఆపైన 100శాతం మూల క్రమబద్ధీకరణ రుసుములుగా చెల్లించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుంలో నాలా రుసుము కూడా కలిసే ఉంటుంది.  


తగ్గనున్న భారం

తాజా సవరణతో క్రమబద్ధీకరణ రుసుము తగ్గి పేదలు, మధ్యతరగతి వారికి ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. స్థల వైశాల్యం, మార్కెట్‌ విలువను బట్టి యజమానులకు రూ.25వేల నుంచి రూ.50వేలకు తగ్గే అవకాశముంది. గురువారం జారీ అయిన సవరణ ఉత్తర్వులతో 2013కన్నా ముందు స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారికే ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు మార్కెట్‌ విలువ తక్కువగా ఉంది. ఫలితంగా క్రమబద్ధీకరణ చార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. 2013లో మార్కెట్‌ విలువలను ప్రభుత్వం భారీగా 30నుంచి 40శాతం పెంచింది. దీంతో 2013 తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారు కాస్త ఎక్కువ చార్జీలే చెల్లించాల్సి వస్తుంది.


పల్లెల్లో నిరాసక్తత

ఎల్‌ఆర్‌ఎ్‌సపై గ్రామాల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు తక్కువ సంఖ్యలో దాఖలవుతుండడమే ఇందుకు ఉదాహరణ. క్రమబద్ధీకరణ చార్జీలు భారీగా ఉండడం ఇందుకు కారణమని భావిస్తున్నారు.  క్రమబద్ధీకరణకు ఎంత లేదన్నా మార్కెట్‌ విలువ, స్థల విస్తీర్ణం బట్టి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుకానున్నది. పేద, మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా రైతులు ప్రస్తుతం ఇంత మొత్తం చెల్లించే స్థితిలో లేరు. అసలే కరోనా కష్టకాలం.. పైగా పంటల సీజన్‌. ఇప్పటికే వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి ఉన్నారు. పంటలు కూడా ఇంకా చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.


కలెక్టర్‌ లేక అప్పిలేట్‌ అథారిటీ అభిప్రాయం ప్రకారం ఒక దస్తావేజులోని ఆస్తి.. ఆ దస్తావేజు రాసిన తేదీ నాడు బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుందో అది ఆ ఆస్తి మార్కెట్‌ విలువగా పరిగణిస్తారు. మార్కెట్‌ విలువల పథకం అమల్లోకి రాక ముందు క్రయదస్తావేజు, దానం, సెటిల్‌మెంట్‌, పరివర్తన మొదలైన దస్తావేజుల్లో పార్టీలు పేర్కొన్న ప్రతిఫలం లేక విలువపై స్టాంపు సుంకం విధించేవారు. అప్పట్లో వాస్తవ ప్రతిఫలాన్ని లేక విలువను రాబట్టడానికి ఎటువంటి విధానం లేదు. కొందరు కక్షిదారులు ఉద్దేశపూర్వకంగా ఆస్తి విలువను లేక ప్రతిఫలాన్ని దస్తావేజుల్లో తక్కువగా పేర్కొనటం వల్ల ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపేణ  వాస్తవంగా రావల్సిన అదాయానికి గండిపడేది. దీనిని అరికట్టేందుకు భారత స్టాంపు చట్టం, 1899ని సవరిస్తూ ఒక కొత్త సెక్షన్‌ 47-ఎను, ఆంధ్రప్రదేశ్‌ చట్టం-22/1971 ద్వారా చేర్చారు.


ఒక దస్తావేజులో పొందుపరిచిన విలువ సరైందా కాదా అన్నది తెలుసుకునేందుకు ఒక ఆధారం కావల్సిన అవసరం ఏర్పడింది. ఇందు కోసం ప్రత్యేక సిబ్బందితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సర్వే చేయించి, స్థానికంగా విచారణలు జరిపించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను నిర్ణయించి ఆ విలువలతో కూడిన బేసిక్‌ రిజిస్టర్లను తయారు చేసి రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్లకు  అందజేశారు. అలాగే భవనాలు, ఇతర నిర్మాణాల రేట్లను పబ్లిక్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పొంది వాటిని కూడా బేసిక్‌ రిజిస్టర్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రుసుమును నిర్ణయించే మార్కెట్‌ విలువలు ఈ రిజిస్టర్లలో  పొందుపరిచినవే. మార్కెట్‌ విలువలతో కూడిన బేసిక్‌ రిజిస్టర్ల విధానం 1975 నుంచి అమలులోకి వచ్చింది. మార్కెట్‌ విలువల సవరణ చివరిసారి 2013లో జరిగింది. గత ఏడేళ్లుగా ఈ విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంతకు ముందు 2009లో జరిగింది.


మార్కెట్‌ విలువ అంటే?

కలెక్టర్‌ లేక అప్పిలేట్‌ అథారిటీ అభిప్రాయం ప్రకారం ఒక దస్తావేజులోని ఆస్తి.. ఆ దస్తావేజు రాసిన తేదీ నాడు బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుందో అది ఆ ఆస్తి మార్కెట్‌ విలువగా పరిగణిస్తారు. మార్కెట్‌ విలువల పథకం అమల్లోకి రాక ముందు క్రయదస్తావేజు, దానం, సెటిల్‌మెంట్‌, పరివర్తన మొదలైన దస్తావేజుల్లో పార్టీలు పేర్కొన్న ప్రతిఫలం లేక విలువపై స్టాంపు సుంకం విధించేవారు. అప్పట్లో వాస్తవ ప్రతిఫలాన్ని లేక విలువను రాబట్టడానికి ఎటువంటి విధానం లేదు. కొందరు కక్షిదారులు ఉద్దేశపూర్వకంగా ఆస్తి విలువను లేక ప్రతిఫలాన్ని దస్తావేజుల్లో తక్కువగా పేర్కొనటం వల్ల ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ రూపేణ  వాస్తవంగా రావల్సిన అదాయానికి గండిపడేది. దీనిని అరికట్టేందుకు భారత స్టాంపు చట్టం, 1899ని సవరిస్తూ ఒక కొత్త సెక్షన్‌ 47-ఎను, ఆంధ్రప్రదేశ్‌ చట్టం-22/1971 ద్వారా చేర్చారు. ఒక దస్తావేజులో పొందుపరిచిన విలువ సరైందా కాదా అన్నది తెలుసుకునేందుకు ఒక ఆధారం కావల్సిన అవసరం ఏర్పడింది.


ఇందు కోసం ప్రత్యేక సిబ్బందితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సర్వే చేయించి, స్థానికంగా విచారణలు జరిపించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలను నిర్ణయించి ఆ విలువలతో కూడిన బేసిక్‌ రిజిస్టర్లను తయారు చేసి రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్లకు  అందజేశారు. అలాగే భవనాలు, ఇతర నిర్మాణాల రేట్లను పబ్లిక్‌వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి పొంది వాటిని కూడా బేసిక్‌ రిజిస్టర్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రుసుమును నిర్ణయించే మార్కెట్‌ విలువలు ఈ రిజిస్టర్లలో  పొందుపరిచినవే. మార్కెట్‌ విలువలతో కూడిన బేసిక్‌ రిజిస్టర్ల విధానం 1975 నుంచి అమలులోకి వచ్చింది. మార్కెట్‌ విలువల సవరణ చివరిసారి 2013లో జరిగింది. గత ఏడేళ్లుగా ఈ విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంతకు ముందు 2009లో జరిగింది.

Updated Date - 2020-09-18T06:30:22+05:30 IST