‘సాధికార మహిళ ’ తోనే విముక్తి!

ABN , First Publish Date - 2021-03-07T05:29:53+05:30 IST

మహిళ జీవితం కష్టాలమయం. కొవిడ్ విపత్తు వర్తమాన జీవన ప్రస్థానాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ విపత్కర కాలంలో నైనా ఆమె సహనశీలత...

‘సాధికార మహిళ ’ తోనే విముక్తి!

మహిళ జీవితం కష్టాలమయం. కొవిడ్ విపత్తు వర్తమాన జీవన ప్రస్థానాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ విపత్కర కాలంలో నైనా ఆమె సహనశీలత, త్యాగశీలతను గుర్తించని పక్షంలో మన (పురుషుల) మానవత సార్థకమవుతుందా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆసన్నమైన సందర్భమిది. కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న గత సంవత్సరకాలంగా గృహిణి ఎదుర్కొన్నది కనీవినీ ఎరుగని గడ్డు కాలమే కాదూ? మరి తక్షణ భవిష్యత్తులో జీవితం ఆమెకు ప్రసాదించేదేమిటి? 


కొవిడ్ ఉపద్రవంతో కుటుంబం ఇంటిపట్టునే ఉండిపోవలసివచ్చింది. ఆదాయం తగ్గిపోయింది. ఖర్చులు తగ్గవు కదా. బిడ్డల తుళ్ళింతలు, కేరింతలకు ఆకలిదప్పులు అవరోధమయ్యాయి. నిస్సహాయంగా చలించిపోయారు తల్లిదండ్రులు, ముఖ్యంగా కన్నతల్లి. ఈ పరిస్థితిలో నైరాశ్యంలో మునిగిపోని తల్లిదండ్రులు ఎవరు ఉంటారు? భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ నిరుత్సాహానికి లోనయి, తన విసుగు, ఆగ్రహాన్ని జీవిత భాగస్వామిపై చూపి ఉంటారనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదాయాన్ని కోల్పోయి, చేతిలో డబ్బుల్లేక, కుటుంబ నిర్వహణ భారమై పోయి కష్టాలు తీరే దారీ తెన్నూ కానరాని భర్త అసహనం, ఆగ్రహానికి గురవ్వడం కద్దు. ఆ ఆగ్రహాన్ని అసహనాన్ని భార్యపై హింసాత్మకంగా చూపుతున్నా (ఏడాదికాలంగా సగటు గృహిణి ఎన్నిమార్లు ఈ క్రూరత్వాన్ని చవి చూసి ఉంటుందో చెప్పేందుకు నేను సాహసించను) ఆమె సహనంతో భరిస్తూ వస్తోంది. 


ఇక భర్త ఆల్కహాలికుడు అయితే గృహిణి వ్యథలకు విడుపే ఉండదు కదా. ఇంటి పట్టున ఉండిపోయిన మద్యపాన ప్రియుడైన భర్త ప్రవర్తన మరింత దుస్సహంగా ఉంటుంది. అన్నిరకాల వస్తువుల విక్రయాలపై నిషేధం విధించిన ప్రభుత్వం కించిత్ సానుకూల పరిస్థితులు ఏర్పడీ ఏర్పడక ముందే నిషేధం ఎత్తివేసిన తొలి సరుకు మద్యమే! గృహిణి, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలకు చెందిన గౌరవనీయురాలు అసలే కుటుంబ బాధ్యతలతో సతమతమవుతూ ఉండే సహనశీలి భర్త తాగుబోతుతనాన్ని భరించవలసివస్తోంది. లాక్‌డౌన్ ఉన్నా, లేకపోయినా ఆమె కష్టాలు ఒకటే, సందేహం లేదు. వాటిలో తేడా ఉండదు. ఆమె విసుగు చెందినా లేదా నైరాశ్యానికి లోనయినా ఫలితమేమీ ఉండదు. 


గృహహింసకు మించిన క్రూర నేరం మరేముంటుంది? కొవిడ్ విపత్కర కాలంలో ఇది సంఖ్యానేక కుటుంబాలలో మరింత భయానకంగా పదే పదే సంభవించి ఉంటుందనడంలో సందేహం లేదు. భర్త కాఠిన్యాన్ని ఎదుర్కోవడంతో పాటు పిల్లల ఆలనపాలనపై ప్రతి గృహిణి అనివార్యంగా శ్రద్ధ చూపవలసి ఉంటుంది. ఆమె కాకపోతే పిల్లలను పట్టించుకునేదెవరు? మరి పాపం పుణ్యం ఎరుగని పిల్లలు సదా చురుగ్గా, క్రియాశీలంగా ఉంటారు. వారిని నియంత్రించి, క్రమశిక్షణలో పెట్టవలసిన బాధ్యత తల్లిపైనే ఉంటుంది. సాధారణంగా పిల్లలు ఉదయం పాఠశాలకు వెళ్ళి, సాయంత్రం తిరిగివచ్చే లోపు మాత్రమే ఆమెకు కించిత్ విశ్రాంతి లభిస్తుంది. మహమ్మారితో ఆ గడుగ్గాయిలు నెలల తరబడి రోజూ రేయింబవళ్ళు ఇంటిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఇంటి వద్దనే ఉండడమంటే ఏ పిల్లలకు అయినా సెలవులు, ఆటల పాటల సమయమే కదా. మరి చదువులు చట్టుబండలు కాకుండా ఉండాలంటే వారి వైఖరిని మార్చితీరాలి. పాఠశాలలో మాదిరిగా చదువుపై శ్రద్ధ చూపేలా చేయవలసి ఉంటుంది. ఇది ముఖ్యంగా తల్లి బాధ్యతే అవుతుంది. ఆ తల్లి విద్యావతి అయితే పిల్లలకు పాఠాలు చెప్పగలుగుతుంది. సందేహాలు తీరుస్తుంది ఈ కొవిడ్ కాలంలో పిల్లలను చదువుకు కూర్చునేలా చేయడంలో తాము ఎదుర్కొన్న ఒత్తిడిని మరే విషయంలోనూ ఎదుర్కోలేదని చెప్పని తల్లిదండులు ఎవరూ నాకు తటస్థించలేదు. ఇక ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో, ఆదుర్దా పడ్డారో మరి చెప్పనవసరం లేదు. 


కథ ఇంతటితో కంచికి చేరదు సుమా! ఇంటి పట్టునే ఉండిపోయిన పురుష పుంగవుడు ‘కాలక్షేపానికి’ లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ఆతురపడడం కద్దు. నైరాశ్యంలో మునిగిపోయిన పురుషుడిలో లైంగిక వాంఛలు విపరీతమవుతాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. నిరాశానిస్పృహల్లో ఉన్న పురుషులు తమ లైంగిక జీవితంలో మరింత హింసాత్మకంగా ప్రవర్తించడమూ పరిపాటి. మద్యం వారికి అందుబాటులో ఉందన్న వాస్తవాన్ని మరచిపోకూడదు. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించే అవకాశాలు ఉండవు. ఉన్నా పరిమితమే. ఈ పరిస్థితుల్లో అసలే అలవికాని పనుల భారంతో సతమతమవుతున్న గృహిణి, భర్త అతి లాలసత్వాన్ని కూడా భరించవలసివస్తుంది. ఫలితం మళ్ళీ మాతృత్వం. కొవిడ్ సంవత్సరకాలంలో గర్భం దాల్చిన మహిళల సంఖ్య అమితంగా పెరిగిందని అధ్యయనాలు వెల్లడించాయి.


శ్రామిక మహిళలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళల అవస్థల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్య భద్రతా సిబ్బంది, ఇతరత్రా ఆ మహమ్మారిని కట్టడి చేసే విధులు నిర్వర్తిస్తున్న వారిలో మహిళలే అధికం. వారిలో అత్యధికులు పేద కుటుంబాలకు కిందిస్థాయి సామాజిక వర్గాలకు చెందిన వారై ఉంటారనడంలో సందేహం లేదు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న ఈ ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’లో అత్యధికులు ఎక్కడ పని చేసేవారైనప్పటికీ నిరుపేద, బలహీన వర్గాలకు చెందినవారేనన్నది స్పష్టం. రోడ్లు శుభ్రం చేసే, చెత్తా చెదారాన్ని ఎత్తి పారవేసే మునిసిపల్ కార్పొరేషన్ల పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆస్పత్రులలో పనిచేసే నర్సులు, ఎఎన్‌ఎమ్‌లు, అంబులెన్స్ డ్రైవర్లు, పేషెంట్ హ్యాండ్లెర్స్, వార్డ్ బాయ్స్, స్వీపర్లు, టాయిలెట్స్ శుభ్రం చేసే దురదృష్టవంతులు, కానిస్టేబుల్ స్థాయి పోలీసులు అందరూ వెనుకబడిన కులాలు, దళితవర్గాలు, ఆదివాసుల నుంచి వచ్చిన వారై ఉంటారు. వీరిపై ఉద్యోగులు, అధికారులు మాత్రం సామాజికంగా ఉన్నతస్థాయి కులాల నుంచి వచ్చిన వారై ఉంటారని విడమరచి చెప్పనవసరం లేదు. ఒకే రంగంలో ఒకే విధమైన విధులు నిర్వర్తిస్తున్నా మహిళలు వేతనభత్యాల విషయంలో తమ పురుష సహచరుల కంటే తీవ్ర వివక్షకు గురవుతున్నారు. చేసే పని ఒకటే అయినా వారికి తక్కువ వేతనభత్యాలు ఎందుకు చెల్లిస్తున్నట్టు? కొవిడ్ కాలంలో ఉద్యోగులను తగ్గించాలని భావించిన సంస్థలు ముందుగా మహిళా ఉద్యోగులనే తమ లక్ష్యం చేసుకున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


దేశ ఆర్థికాభివృద్ధిని కొవిడ్ తీవ్రంగా దెబ్బతీసింది. అభివృద్ధి కార్యకలాపాలలో మహిళలను భాగస్వాములను చేయడం కాకుండా వాటి నుంచి గణనీయంగా మినహాయించేందుకే కొవిడ్ దారితీసింది. మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుంటాము. మహిళలు విద్యావంతులు అయితే అనేకానేక సమస్యలు వాటికవే పరిష్కారమవుతాయననేది పలువురి నిశ్చితాభిప్రాయం. అయితే ఆర్థికంగా, సామాజికంగా కిందిస్థాయి కుటుంబాలలో బాలికలను విద్యాపరంగా ప్రోత్సహించడం తక్కువే అన్నది ఒక కఠోర వాస్తవం. మరి కరోనా ఆపత్కాలంలో వారు పూర్తిగా ఇంటి వద్దనే ఉండిపోయారు. దీంతో వారి చదువును తల్లిదండ్రులు పూర్తిగా ఉపేక్షించే పరిస్థితి నెలకొన్నది. కుమార్తెలకు వివాహం చేసి, తమ బాధ్యతల నుంచి బయటపడేందుకే పలువురు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనంతరం క్రాంతిజ్యోతి సావిత్రీ బాయి ఫూలే వర్ధంతి (మార్చి 10) సందర్భంగా ఆమెను సంస్మరించుకోనున్నాం. 1897లో ప్లేగ్ రోగులకు ఉపశమన సేవలు అందించే క్రమంలోనే ఆ మహాత్మురాలు అంతిమ శ్వాస విడిచింది. 


మహిళా సాధికారత ఏమిటి? ఈ విషయమై మనమంతా మరింత వివేకవంతంగా పునరాలోచన చేయవలసిఉంది. మహిళా సాధికారత ఒక డిన్నర్ పార్టీ కాదని, అదొక రాజ్యాంగసమ్మత యథార్థమనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఆ వాస్తవం క్రమానుగతంగా సమాజ జీవితంలో కార్యరూపం దాల్చాలి. ఇది ఎవరి ఉదారతతో నిమిత్తం లేకుండా జరిగితీరాలి. నిత్య జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్య గురించి మహిళలకు మాత్రమే బాగా తెలుస్తుంది. మహిళలు అధికారంలో ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి ప్రభావశీల, పటిష్ఠ శాసనాలను తీసుకురావడం సాధ్యమవుతుంది. నిజం చెప్పాలంటే మహిళల సమస్యలు మహిళలు తీసుకువచ్చే చట్టాలతోనే పరిష్కారమవుతాయి. తద్వారా మాత్రమే నిజమైన మహిళా సాధికారత సుసాధ్యమవుతుంది. అంతేకాదు మహిళల, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ఆడపడుచుల జీవితాలకు విముక్తి, రక్షణ సమకూరుతాయి.

డాక్టర్ పుంజాల వినయ్ కుమార్

(రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Updated Date - 2021-03-07T05:29:53+05:30 IST