నాటు తుపాకీతో పట్టుబడ్డ ‘ఎర్ర’ స్మగ్లర్‌

ABN , First Publish Date - 2021-05-06T06:47:45+05:30 IST

నాటు తుపాకీతో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.

నాటు తుపాకీతో పట్టుబడ్డ ‘ఎర్ర’ స్మగ్లర్‌
పోలీసుల అదుపులో మునికృష్ణ - స్వాధీనం చేసుకున్న నాటు తుపాకి, ఎర్రచందనం దుంగలు

నాలుగు దుంగల స్వాధీనం

పరారైన వారికోసం గాలింపు


చంద్రగిరి, మే 5: నాటు తుపాకీతో ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఐలు వాసు, సురేష్‌కుమార్‌, డీఆర్వో నరసింహారావు బృందం చంద్రగిరి మండలంలోని నాగపట్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. మంగళవారం ఉదయం ఎర్రచందనం స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులు వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. కొందరు పరారయ్యారు. వీరిలో ఓ స్మగ్లర్‌ను నాటు తుపాకీతోపాటు పట్టుకున్నారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్‌ను విచారించగా.. చంద్రగిరి మండలంలోని ఐతేపల్లెకు చెందిన రంబే మునికృష్ణగా తేలింది. ఇతను పదేళ్లుగా ఎర్రచందనం ముఠాలతో సంబంధాలు పెట్టుకుని, ఐతేపల్లెలోని యువతకు నగదు ఆశచూపి వారి సహకారంతో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. అలాగే నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడేవాడు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన కోలార్‌ వద్ద బెంగళూరుకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు పట్టుబడ్డాడు. మూడేళ్ల కిందట ఇతని తండ్రి ఎర్రచందనం హైజాగ్‌ చేస్తూ తుపాకీతోపాటు పట్టుబడ్డాడు. బెయిల్‌పై వచ్చిన మునికృష్ణ 20 రోజులు కాకుండానే మళ్లీ స్మగ్లింగ్‌ చేస్తూ టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డాడు. స్మగ్లర్‌ను బుధవారం కోర్టుకు తరలించగా.. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు. 

Updated Date - 2021-05-06T06:47:45+05:30 IST