ఎర్రకాల్వ.. కన్నీళ్లు

ABN , First Publish Date - 2022-05-22T05:56:10+05:30 IST

జంగారెడ్డిగూడెం మండలంలో కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయం మెట్ట ప్రాంతంలో సాగు, తాగునీరందిస్తొన్న ప్రధాయిని.

ఎర్రకాల్వ.. కన్నీళ్లు

లక్ష్యం చేరని సాగునీరు 

నల్లజర్ల మండలంలో 10వేల ఎకరాలకు నీరు లేదు

రూ.25 కోట్లు మంజూరైనా టెండర్లకు వచ్చే వారే కరువు

 పంట సాగు లేక కష్టాల్లో రైతులు


ఎర్రకాల్వ జలాశయం లక్ష్యం చేరడం లేదు. పూర్తి స్థాయిలో ఆధునికీకరణ పనులే జరగడం లేదు. పక్కనే ప్రాజెక్ట్‌ ఉన్నా రైతులు లబ్ధిపొంజంజందలేకపోతున్నారు. జలాశయానికి మెయిన్‌ కాల్వ ఉన్నప్పటికీ సబ్‌ కెనాల్స్‌, చానల్స్‌ లేకపోవడంతో పొలాలకు జలాశయ నీరు అందడం లేదు. వర్షాకాలంలో గండ్లు, పంట పొలాలు మునక తప్పడం లేదు.  ఎర్రకాల్వ ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న నల్లజర్ల మండలంలోనే దాదాపు 10వేల ఎకరాలకు నీరు చేరని పరిస్థితి ఉన్నది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో వేలాది ఎకరాలకు ఈ జలాశయమే నీరందించాల్సి ఉండగా నేటికీ ఈ కాల్వ కింద రైతులు వర్షాలు, బోరులపైనే ఆధారపడి సాగు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. 


జంగారెడ్డిగూడెం, మే 21 : జంగారెడ్డిగూడెం మండలంలో కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయం మెట్ట ప్రాంతంలో సాగు, తాగునీరందిస్తొన్న ప్రధాయిని. ఎర్రకాల్వ జలాశయం విస్తీర్ణం 5,212 ఎకరాలు. జలాశయ గరిష్ట నీటి మట్టం 83.50 మీటర్లు,  ప్రతీ సీజన్‌లో రబీకి 15వేల ఎకరాలకు డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు, ఖరీఫ్‌ సీజన్‌లో జూలై నుంచి నవంబర్‌ నెలాఖరు వరకు సాగునీరు అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, ఉంగుటూరులోని కొంత భాగంలో మొత్తం ఆరు మండలాల పరిధిలో 24,700 ఎకరాల సాగు లక్ష్యం ఉంది. కుడికాల్వ 46.5 కిలోమీటర్ల మేర నల్లజర్ల మండలం వరకు ఉంది. కుడికాల్వ ద్వారా 19700 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. ఈ కాల్వ నుంచి జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని పొలాలకు  నీరందుతున్నా, కామవరపుకోట, కొయ్యలగూడెం లో ఒక మోస్తరుగా నీరు అందుతున్నది. ఇక నల్లజర్ల మండలంలో మెయిన్‌ కాల్వ తవ్వి ఉన్నప్పటికీ నీరు పారే పరిస్థితులు లేవు. దీంతో దాదాపు నల్లజర్ల మండలంలోని 10వేల ఎకరాలకు జలాశయ నీరందడం లేదు. అయితే ఇక్కడ భూసమస్యలు, చానల్స్‌ తవ్వకాలు తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. కోర్టు గుమ్మాలెక్కిన భూసమస్యల కారణంగానేటికీ సాగునీరు అందడం లేదు. ఇక ఎడమ కాల్వ 7.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. సుమారు 5వేల ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందించాల్సి ఉండగా పూర్తిస్థాయిలో నీరు అందుతుందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. కానీ జంగారెడ్డిగూడెం మండలంలోని తిరుమలాపురం, కేతవరం, పంగిడిగూడెం తదితర గ్రామాల పరిధిలో ఉన్న 3వేల ఎకరాల ఆయకట్టుకు అక్కడ నిర్మించిన బైనేరు ఆక్విడెక్టు నిర్మాణం 2018లో కూలిపోవడంతో నీరందడం లేదు. అప్పటి నుంచి ఈ ప్రాంత రైతులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. రూ.5.70 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్టు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వీటి మెయింటినెన్స్‌కు పైసా ఖర్చు పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కుడి కాల్వపై ఉన్న ఆరు గేట్లు, ఎడమ కాల్వపై ఉన్న 2 గేట్లకు సంబంధించి మెయింటినెన్స్‌ కొరవడినట్టు చెబుతున్నారు. దీని కారణంగానే నీరందడం లేదని, అలాగే ప్రధానంగా రైతుల పంట పొలాలకు వెళ్లే విధంగా సబ్‌ చానల్స్‌ లేకపోవడం ప్రధాన సమస్యగా కన్పిస్తొంది.

నిధులు మంజూరైనా వెనుకడుగు

కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి సంబంధించి కుడి, ఎడవ కాల్వల లైనింగ్‌, మరమ్మతులు, కాలువలు తవ్వడం తదితర వాటికి కేంద్ర బడ్జెట్‌గా రూ.25కోట్లు మంజూరయ్యాయి. అయితే ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయి. కనీసం టెండర్‌ వేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాకపోవడం విడ్డూరం. దీంతో కాలువల ఆధునీకరణ పనులే లేకుండా పోతున్నాయి. 

మరమ్మతులతో నీరందడం లేదు

జి.రామకృష్ణారెడ్డి, రైతు, జంగారెడ్డిగూడెం మండలం

జలాశయం ఎడమ కెనాల్‌ ద్వారా రెండు పంటలకు నీరందాల్సి ఉండగా, మరమ్మతులు, చిన్నచిన్న సమస్యలతో పంట పొలాలకు నీరందడం లేదు. వర్షాకాలాల్లో కాలువలకు గండ్లు పడిపోవడంతో పైవరకు సాగు నీరు చేరడం లేదు. దీంతో వేలాది సంఖ్యలో రైతులు నష్టపోతున్నారు. 

నిధులు మంజూరయ్యాయి : ఏఈ భాస్కరరావు

జలాశయానికి కేంద్ర నిధులు రూ.25కోట్లు మంజూరయ్యాయి. ఎడమ, కుడి కాల్వల మైనర్‌ రిపేర్‌లు, లైనింగ్‌లు, కాల్వలు తవ్వడం తదితర వాటికి ఈ నిధులు మంజూరయ్యాయి. కానీ టెండర్‌ల దశలోనే ప్రస్తుతం ఈ నిధులు ఉన్నాయి. అలాగే కుడి కెనాల్‌పై ఉన్న ఆరు చిన్నగేట్లు, లెప్ట్‌ కెనాల్‌పై ఉన్న రెండు చిన్నగేట్ల మరమ్మతులకు ఇటీవల రూ.36లక్షలు మంజూరయ్యాయి. అలాగే మెయిన్‌ గేట్‌ లీకేజీలు, గ్రీజులు, పెయింటింగ్‌ తదితర మెయింటినెన్స్‌కు పది రోజుల క్రితం మరో రూ.21లక్షలు మంజూరయ్యాయి.


Updated Date - 2022-05-22T05:56:10+05:30 IST