పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీవర్షాలు...ఐఎండీ Red alert జారీ

ABN , First Publish Date - 2022-07-08T13:24:55+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది....

పలు రాష్ట్రాల్లో నేడు అతి భారీవర్షాలు...ఐఎండీ Red alert జారీ

ముంబయి: దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఐఎండీ రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. ముంబయి నగరంతోపాటు మహారాష్ట్రలోని పలు గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ముంబై, థానే, పాల్‌ఘర్‌లలో శుక్రవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దక్షిణ కన్నడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జులై 8-9 తేదీల్లో అన్ని విద్యాసంస్థలకు అధికార యంత్రాంగం సెలవు ప్రకటించింది.భారీ వర్షపాతం హెచ్చరికల జారీతో ప్రజలు బీచ్‌లను సందర్శించడాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది.


కేరళలో పెరిగిన నదుల నీటిమట్టం... ఎల్లో అలర్ట్ జారీ

కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల పలు నదుల నీటిమట్టం పెరిగింది. కదలుండి (మలాపురం), భరతపూజ (పాలకాడ్), షిరియా (కాసర్‌గోడ్), కరవన్నూరు (త్రిసూర్), గాయత్రి (త్రిసూర్) నదుల నీటిమట్టం పెరిగింది. దక్షిణ కేరళలోని వామనపురం (తిరువనంతపురం), నెయ్యర్ (తిరువనంతపురం), కరమన (తిరువనంతపురం), కల్లడ (కొల్లం), మణిమాల (ఇడుక్కి), మీనాచిల్ (కొట్టయం), కోతమంగళం (ఎరనాకులం) నదుల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదనీరు చేరి నీటిమట్టం పెరుగుతోంది. రాబోయే ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.కేరళలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.భారత వాతావరణ శాఖ (IMD) వచ్చే మూడు రోజుల పాటు కేరళలోని చాలా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.



హిమాచల్ ప్రదేశ్‌లో ఆరెంజ్ అలర్ట్

హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.రాబోయే రెండు రోజుల పాటు కాంగ్రా, మండి, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో ఐఎండీ (IMD) ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సిమ్లా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉనా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఎస్‌కే శర్మ తెలిపారు. 


Updated Date - 2022-07-08T13:24:55+05:30 IST