దిద్దుబాటు మంచిదే!

ABN , First Publish Date - 2021-06-08T06:12:50+05:30 IST

సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పొరపాటును అంగీకరించకపోయినా, దిద్దుబాటుకు ఉపక్రమించడం ఉన్నది...

దిద్దుబాటు మంచిదే!

సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పొరపాటును అంగీకరించకపోయినా, దిద్దుబాటుకు ఉపక్రమించడం ఉన్నది. ఇప్పటికే దెబ్బతిన్న ప్రతిష్ఠ దానివల్ల ఎంత వరకు మెరుగుపడగలదో ఇప్పుడే చెప్పలేము కానీ, చేసినంత మేరకు విధాన సవరణను స్వాగతించవచ్చు. ప్రభుత్వరంగంలో టీకాకరణ కార్యక్రమం పూర్తిగా కేంద్రప్రభుత్వం ఖర్చుతోనే జరుగుతుంది, ప్రజలకు అది ఉచితంగా అందుతుంది. పాతిక శాతం టీకాలను రాష్ట్రాలు నేరుగా కంపెనీలనుంచి కొనుక్కోవాలని సుమారు నెలరోజుల కింద చేసిన నిర్ణయాన్ని ఇప్పుడు వెనక్కు తీసుకుంటున్నారు. టీకాకరణ కార్యక్రమ భారాన్ని రాష్ట్రాల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టుగా ప్రధాని మాటలు సూచిస్తున్నాయి కానీ, ఆర్థిక భారం మాత్రమే తప్పుతుందని గ్రహించాలి.


కేంద్రప్రభుత్వానికి సొంతంగా ఉద్యోగ యంత్రాంగమేదీ ఉండదు కాబట్టి, రాష్ట్రాల వైద్య ఆరోగ్య సిబ్బంది ద్వారానే కేంద్రప్రభుత్వ విధానాల అమలు జరుగుతుంది. కేంద్రానికి అమ్మిన ధర కంటె హెచ్చు ధరలకు టీకాలను కంపెనీలు రాష్ట్రాలకు అమ్మాలని చూస్తుండడంతో, పాతిక శాతం కొనవలసి వస్తే రాష్ట్రప్రభుత్వాలకు అది పెనుభారమయ్యేది. నరేంద్రమోదీ దిద్దుబాటు ప్రకటనపై టీకాకంపెనీల స్పందన ఇంకా తెలియదు. కేంద్రానికి మునుపు ఏ ధరకు ఇచ్చారో మొత్తం 75 శాతం డోసులను కూడా అదే ధరకు వాళ్లు అమ్మవలసి వస్తుంది. 


మే నెల చివరలో టీకా విధానం పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. విధాన నిర్ణయాలలో సుప్రీంకోర్టు జోక్యం కూడదనే వాదనను తోసిపుచ్చి, కార్యనిర్వాహక వర్గ నిర్ణయాలు ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే ప్రేక్షకులుగా ఉండలేమని స్పష్టం చేసింది. టీకాలలో ఈ శాతాల గొడవ ఏమిటి, రాష్ట్రాలకు, కేంద్రానికి టీకాధరలు వేరువేరుగా ఉండడం ఏమిటి? రెండో దశలో కరోనా వ్యాప్తి 18--–45 మధ్య వయస్కులలో అధికంగా ఉండగా, 45 ఏళ్లు పైబడినవారికి కేంద్రం ఉచితంగా టీకా ఇవ్వడం, ఆ లోపు వారికి రాష్ట్రప్రభుత్వాలు హెచ్చు ధరకు కొని ఇవ్వవలసిరావడం, ఇదంతా ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిజానికి 45 ఏళ్ల వయస్సు దాటినవారి సంఖ్య జనాభాలో 20 శాతానికి లోపే. మరి యాభై శాతం టీకాలను కేంద్రం ఏమి చేసుకుంటుంది? 18--–45 మధ్య వయస్కులే జనాభాలో అధికశాతం ఉంటారు. కేవలం 25 శాతం టీకాలను సేకరించి రాష్ట్రాలు ఎట్లా పంపిణీ చేస్తాయి? కేంద్రం విధానం అంతా గందరగోళంగా ఉండింది. మొత్తంగా టీకా విధానాన్ని సమీక్షించి, దేశజనాభాకు అందరికీ డిసెంబర్ 31లోపు టీకా అందడానికి తగిన కార్యక్రమణికను రూపొందించాలని సుప్రీంకోర్టు పదిరోజుల కిందట కేంద్రానికి స్పష్టం చేసింది. 


సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన ఫలితమే సోమవారం నాటి సందేశం. గత విధానానికి ఇది పాక్షికంగా మాత్రమే దిద్దుబాటు. ధరల విధానం గురించిన స్పష్టీకరణ ఏదీ లేదు. మొత్తంగా సమీక్షించుకుని, కొత్త విధానం ప్రకారం 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాను అందించే కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. మోదీకి నాటకీయత అంటే ఎంతో ఇష్టం కాబట్టి, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునే రోజున సార్వత్రక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. గతంలో కూడా 18–-45 మధ్యవయస్కులకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ప్రకటించి, టీకాల కొరత కారణంగా విఫలం కావలసి వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలలో ఆర్భాటం, అతిశయం కంటె వాస్తవికతకు అనుగుణంగా ఆచరణాత్మకతను ప్రదర్శించడం మంచిది. దేశంలోని అందరూ టీకా పొందాలన్న ఆకాంక్ష మనకెంత ఉన్నా, టీకాల ఉత్పత్తికి పరిమితులున్నాయి. దేశీయమైన టీకాల ఉత్పత్తి తీరు, బయటి నుంచి వచ్చే టీకాల పరిమాణం, అవి అందుబాటులోకి వచ్చే సమయాలు- వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని ప్రకటించడం శ్రేయస్కరం. 


అత్యున్నత న్యాయస్థానం మందలింపునకు, తన దిద్దుబాటుకు ఏమీ సంబంధం లేనట్టు ప్రధాని ప్రసంగం సాగింది. మొదట్లో తాము అనుసరించిన విధానాన్ని రాష్ట్రాలు తప్పు పట్టాయని, వికేంద్రీకరణ కావాలని కోరాయని, అందువల్లనే వారు 25 శాతం టీకాలు కంపెనీల నుంచి నేరుగా కొనుక్కోవచ్చునని అనుమతించామని, అది ఫలితం ఇవ్వకపోవడంతో పాత పద్ధతే బాగుందని రాష్ట్రాలు అనేకం భావిస్తుండడంతో కేంద్రమే మొత్తాన్ని చేపడుతోందని ప్రధాని అన్నారు. కొవిడ్ నిర్వహణలోను, టీకాకరణ కార్యక్రమంలోనూ తమకు స్వేచ్ఛ లేదని అనేక రాష్ట్రాలు భావించిన మాట నిజం. అట్లాగే, కొవిడ్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ వంటి పరిస్థితుల వల్ల వాటిల్లిన ఆర్థిక నష్టాన్ని కేంద్రం భరించకపోగా, టీకాకరణకు కేటాయించిన 35 వేల కోట్ల డబ్బును, పిఎం కేర్స్ నిధులను ఏమి చేశారో చెప్పడం లేదని ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు ఘాటుగానే విమర్శించాయి. తాజాగా తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ కేంద్ర టీకా విధానాన్ని కడిగిపారేశారు. మొత్తానికి అవకతవక కంగాళీగా తయారైన విధానానికి ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని ప్రధానికి కూడా తెలిసివచ్చినట్టుంది. దేశీయ టీకా గురించి, కొవిన్ యాప్ గురించి గొప్పలు చెప్పడం ద్వారా ప్రజలను సంతృప్తిపరచాలని ప్రయత్నిస్తే ఉపయోగం లేదు. దేశీయ టీకాలు విదేశాలకు ఎందుకు ఎగుమతి అయ్యాయన్న విమర్శను ఈ ప్రభుత్వం ఎదుర్కొంటూనే ఉండాలి. అట్లాగే, కొవిన్ యాప్ ఏ మాత్రం సమర్థంగా పనిచేయడం లేదు, దాని ద్వారా టీకా సమయాల బుకింగ్ పెద్ద ప్రయాసగా మారింది. 

కరోనా మహమ్మారి చేస్తున్న బీభత్సంతో పాటు, ప్రభుత్వ విధానాల గందరగోళం ప్రజలను తీవ్రంగా బాధిస్తున్నది. ఇకనైనా ప్రధాని మోదీ ప్రస్తుత విధానాలన్నిటిని సమీక్షించి, ఎటువంటి భేషజాలకు పోకుండా, సమ్మిశ్రిత పద్ధతిలో సంప్రదింపులు జరిపి, విధానాలను రూపొందించుకుంటారని ఆశిద్దాం.

Updated Date - 2021-06-08T06:12:50+05:30 IST