కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయి.. ఎందుకలా?

ABN , First Publish Date - 2022-02-17T17:57:08+05:30 IST

నా వయసు నలభై సంవత్సరాలు. కొవిడ్‌ సోకి తగ్గింది. అయితే ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఇంకా నన్ను బాధిస్తూనే ఉన్నాయి.. కొవిడ్‌ వస్తేనే ఇలాంటి

కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు బాధిస్తున్నాయి.. ఎందుకలా?

ఆంధ్రజ్యోతి(17-02-2022)

ప్రశ్న: నా వయసు నలభై సంవత్సరాలు. కొవిడ్‌ సోకి తగ్గింది. అయితే ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఇంకా నన్ను బాధిస్తూనే ఉన్నాయి.. కొవిడ్‌ వస్తేనే ఇలాంటి నొప్పులు వస్తాయా? లేదా మరేదైనా కారణముంటుందా? అలాగే అరికాళ్లలో ఉన్నట్లుండి మంటలు పుడుతున్నాయి. ఏం చేయమంటారు?


- రేవతి, నిజామాబాద్‌


డాక్టర్ సమాధానం: కొవిడ్‌ సోకిన చాలా మందిలో దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. వాటిలో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు కనిపిస్తున్నాయి. కొంత మంది బాధితులకు బాగా అలసట కనిపిస్తోంది. ఈ లక్షణాలన్నీ కొద్ది రోజులు లేదా కొన్ని వారాల వరకూ ఉంటాయి. కొందరికి మూడునెలల తర్వాత ఈ సమస్యలు తగ్గిపోతాయి. బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చినపుడు కూడా కొంతమందిలో ఇలా కీళ్ల నొప్పులు, వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నొప్పులు తగ్గిపోవటానికి రెండు, మూడు నెలలు కూడా పట్టవచ్చు. అలసట ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవాలి. దీంతో పాటు నొప్పులు బాగా ఉంటే పారాసిటమాల్‌ లాంటి పెయిన్‌కిల్లర్స్‌ తీసుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా తాగాలి. వ్యాయామం తక్కువ చేయండి. యోగా, ధ్యానం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. తినే ఆహారపదార్థాల్లో విటమిన్‌-సి, మినరల్స్‌ ఉండేట్లు చూసుకోవాలి. ప్రొటీన్లు ఉండాలి. సమతులాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ నడవడం వల్ల శరీరానికి వ్యాయామం ఫలం దక్కుతుంది. ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాట్లుండే వాళ్లు.. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అరికాళ్లలో అసజహ లక్షణాలు ఉంటే విటమిన్‌ బి-12 లోపం ఉన్నట్టుగా భావించాలి. చెక్‌ చేసుకోండి. దానికి కూడా సప్లిమెంట్స్‌ తీసుకోవాలి. ఇవన్నీ చేసినా నొప్పులు తగ్గకపోతే.. దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. 


- డాక్టర్‌ మలిపెద్ది అరుణ శ్రీ,

రుమటాలజిస్ట్‌ కన్సల్టెంట్‌,

కాన్‌టినెంటల్‌ హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌

Updated Date - 2022-02-17T17:57:08+05:30 IST