రికార్డులు అప్పగించండి!

ABN , First Publish Date - 2022-01-08T07:28:06+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పంజాబ్‌ పర్యటనలో చేసిన భద్రత ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రికార్డులను తెప్పించాలని సుప్రీంకోర్టు పంజాబ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌..

రికార్డులు  అప్పగించండి!

ప్రధాని టూర్‌ ఏర్పాట్ల వివరాలన్నీ తెప్పించండి

పంజాబ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశం

కేంద్ర, రాష్ట్ర కమిటీల దర్యాప్తు నిలిపివేత

దర్యాప్తు కొనసాగింపుపై ఎల్లుండి నిర్ణయం

జాతికి తలవంపులు తెచ్చేంతటి ఘటన

ప్రధాని మార్గంలో ధర్నా ఉందని చెప్పలేదు

సుప్రీంలో కేంద్ర ప్రభుత్వ వాదనలు

స్వతంత్ర కమిటీ దర్యాప్తునకుపంజాబ్‌ సిద్ధం

ప్రధానిని డ్రోన్‌తో చంపేసే ముప్పు: మంత్రి

పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనకు కుట్ర: ఛన్నీ

ప్రధానికి ప్రమాదం లేదనడం సరికాదు 

ఛన్నీ వ్యాఖ్యల్ని ఖండించిన మనీశ్‌ తివారీ

ప్రధానికి దగ్గరగా వచ్చింది బీజేపీ కార్యకర్తలే?


న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పంజాబ్‌ పర్యటనలో చేసిన భద్రత ఏర్పాట్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రికార్డులను తెప్పించాలని సుప్రీంకోర్టు పంజాబ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఏర్పాటు చేసిన కమిటీలను సోమవారం వరకు విచారణ మొదలు పెట్టరాదని ఆదేశించింది. కమిటీలు ఏం చేయాలో సోమవారం తదుపరి వాయిదాలో చెబుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. సంబంధిత రికార్డులను రిజిస్ట్రార్‌ జనరల్‌కు తక్షణమే అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు, ఇతర కేంద్ర, రాష్ట్ర విభాగాలు సహకరించాలని కోరింది. డీజీపీ, ఎన్‌ఐఏకు సంబంధించిన ఒక అధికారి కలిసి మొత్తం రికార్డుల సమీకరణను పర్యవేక్షించాలని చెప్పింది. ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యంపై లోతుగా దర్యాప్తు జరిగేట్లు చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కానివ్వరాదని కోరుతూ లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిగింది. ప్రధానమంత్రి కారు ఫ్లైఓవర్‌ మీద 20 నిమిషాల పాటు నిలిచిపోయిన పరిస్థితి వెనుక జాతీయ అత్యవసర పరిస్థితి కల్పించే కుట్ర ఉందని పిటిషనర్లు ఆరోపించారు.


ప్రధానమంత్రికే పంజాబ్‌లో కోరుకున్న చోటుకు వెళ్లి ప్రసంగించలేని పరిస్థితి ఏర్పడితే ఆ రాష్ట్రంలో సామాన్యుడి ప్రాథమిక హక్కుల పరిస్థితి ఏమిటని పిటిషనర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ, బుధవారం నాటి ఘటన అంతర్జాతీయంగా భారత్‌కు తలవంపులు తెచ్చేంత తీవ్రత కలిగినదని అన్నారు. పంజాబ్‌ డీజీపీ రోడ్డుపై ఆందోళనకారులు మోహరించిన విషయం కేంద్రానికి చెప్పలేదని వెల్లడించారు. రోడ్డుపై ఎలాంటి అవాంతరాలు లేవని డీజీపీ చెప్పిన తర్వాతే ప్రధాని వాహన శ్రేణి బయలుదేరిందని  తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని వాహన శ్రేణిలో ముందున్న వాహనానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని అప్‌డేట్‌ చేయాల్సిన స్థానిక ఎస్పీ ఆ సమయంలో ఆందోళనకారులతో కూర్చొని టీ తాగుతున్నారని వెల్లడించారు. నిషిద్ధ ఖలిస్థానీ సంస్థ సిఖ్‌స్‌ ఫర్‌ జస్టిస్‌ ప్రధానిపై ప్రత్యక్ష చర్యకు బహిరంగంగా పిలుపునిచ్చిందని ప్రస్తావించారు.


బుధవారం నాటి ఘటన అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడిన అంశం అయి ఉండే అవకాశం ఉందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు జరగరాదని న్యాయస్థానాన్ని కోరారు. ప్రధాని భద్రత వైఫల్యాన్ని తాము తేలిగ్గా తీసుకోలేదని పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. ఎస్పీజీ ఐజీ కూడా బుధవారం నాటి పరిణామాలకు బాధ్యుడని, నిజానిజాలను తేల్చే కమిటీలో ఆయన్ని వేయడం అర్థ రహితమని వ్యాఖ్యానించారు. కేంద్రం స్వతంత్ర కమిటీని వేయాలని అన్నారు. ఎస్పీజీ ఐజీ స్థానంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శిని నియమించడానికి సిద్ధంగా ఉన్నామని తుషార్‌ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.


యానిమేషన్‌ వీడియో

రైతులంతా కలిసి ప్రధాని కాన్వాయ్‌ను చుట్టుముట్టి, పరుగులు తీస్తున్న మోదీని పట్టుకొని దాడి చేస్తున్నట్లుగా ఢిల్లీ నిరసనల సమయంలో(2020) రూపొందించిన యానిమేషన్‌ వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ప్రధాని భద్రత వైఫల్యంపై విచారణకు కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ రంగంలోకి దిగింది. ప్రధాని కాన్వాయ్‌ 20 నిమిషాలు ఆగిన ప్యారాయణ వంతెనను పరిశీలించింది. ిడీజీపీ సహా ప్రధాని పర్యటనతో సంబంధం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ప్రధాని ప్రాణాలతో బయటపడ్డానని చేసిన వ్యాఖ్యలను రైతు సంఘాల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఆయన ఉద్యమం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ ఛన్నీ ఆరోపించారు. ప్రధానమంత్రి వాహనాన్ని 20 నిమిషాలపాటు వంతెనపై నిలిపివేయడం వల్ల ఆయనపై డ్రోన్‌ ద్వారానో, టెలిస్కోపిక్‌ గన్‌ ద్వారానో దాడి చేసి ప్రాణాలు తీసే ప్రమాదం ఉండిందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. ప్రధానికి ఎలాంటి ప్రమాదం లేదని ఛన్నీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ముఖ్యనేత మనీశ్‌ తివారీ ఖండించారు. ప్రధాని భద్రతను ఇతరుల భద్రతతో పోల్చడానికి వీల్లేదన్నారు. ప్రధాని కాన్వాయ్‌ ఆపిన చోటు పాకిస్థాన్‌ ఆర్టిలరీ గన్‌లకు అందుబాటు రేంజ్‌లోనే ఉందని చెప్పారు. 


నిఘా వర్గాలు 

ముందే చెప్పాయి

ప్రధాని కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకొనే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ నిఘా వ ర్గాలు మూడు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాయి. పలు ఉగ్రవాద సంస్థలు ప్రధానిని ల క్ష్యంగా చేసుకున్న విషయాన్ని, ఖలిస్థానీ సంస్థలు ప్రధానిపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని, ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని బహిరంగ సభ వేదిక పాకిస్థాన్‌ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూ రంలో ఉన్న విషయాన్ని నిఘా వర్గాలు రాష్ట్ర ప్ర భుత్వానికి పంపిన లేఖలో పేర్కొన్నాయి. 


దగ్గరగా వచ్చింది ఎవరు?

ప్రధాని కాన్వాయ్‌కు అతి సమీపంలోకి వచ్చిన వ్యక్తులెవరు? అనే చర్చ జరుగుతోంది. వారు జాతీయ రహదారి పక్కన రెయిలింగ్‌ బయట బీజేపీ జెండాలు పట్టుకొని ఉన్నారు. బీజేపీ జిందాబాద్‌ నినాదాలు కూడా చేశారు. వారంతా ప్రధాని సభ కోసం వచ్చిన వారు అయి ఉంటారని భావిస్తున్నారు. వారు రోడ్డు దాటి దగ్గరకు వస్తుండటంతో ఎస్పీజీ కమాండోలు ప్రధాని వాహనాన్ని చుట్టు ముట్టారు. వెనక్కితిప్పి బఠిండా వైపు తీసుకెళ్లారు. దాంతో నినాదాలు చేస్తున్న వ్యక్తులు కాసేపు కాన్వాయ్‌ వెంట పరుగులు తీశారు. 


సమన్వయ లోపమే

వీవీఐపీ భద్రత చూసే వ్యవస్థల మధ్య సమన్వయ లోపమే బుధవారం నాటి పరిస్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. భద్రతాలోపానికి బాధ్యులైన వారిపై తీసుకోదగిన చట్టపరమైన చర్యలన్నీ సిఫార్సులుగానే ఉన్నాయని ప్రస్తావించారు. ప్రధానికి అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులదేనని ఎన్‌ఎ్‌సజీ మాజీ డీజీపీ సుదీప్‌ లక్తాకియా అన్నారు. ఇలాంటివన్నీ పరస్పర విశ్వాసంతో జరిగిపోతాయని చెప్పారు. 

Updated Date - 2022-01-08T07:28:06+05:30 IST