భార్యకు తెలియకుండా ఆమె ఫోన్‌ సంభాషణను రికార్డు చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-14T03:09:52+05:30 IST

భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చెయ్యడమంటే ఆమె గోప్యతకు భంగం కలిగించడమే

భార్యకు తెలియకుండా ఆమె ఫోన్‌ సంభాషణను రికార్డు చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చండీగఢ్: భార్యకు తెలియకుండా ఆమె ఫోన్ సంభాషణను రికార్డు చెయ్యడమంటే ఆమె గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. బటిండా ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ లిసా గిల్ నేృతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ.. విడిపోయిన ఆమె భర్త మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన సీడీని, దాని కచ్చితత్వానికి లోబడి నిరూపించుకునేందుకు బటిండా కుటుంబ న్యాయస్థానం పిటిషనర్ భర్తకు అనుమతిచ్చింది.


దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భార్యకు తెలియకుండా ఆమె సంభాషణను రికార్డు చేయడమంటే స్పష్టంగా ఆమె గోప్యతను ఉల్లంఘించినట్టేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ సంభాషణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో చెప్పలేమని, నిర్ధారించలేమని పేర్కొంది.  


ఈ కేసులో దంపతులు 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. 2017లో భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త దరఖాస్తు చేసుకున్నాడు.  క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా తన వాదనను నిరూపించుకునేందుకు తనకు, భార్యకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన రికార్డును సమర్పించేందుకు కోర్టు అనుమతి కోరాడు. ఇందుకు బటిండా ఫ్యామిలీ కోర్టు అంగీకరించింది. దీంతో అతడి భార్య హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

Updated Date - 2021-12-14T03:09:52+05:30 IST