కంగ్టిలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షం

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది.

కంగ్టిలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షం
కంగ్టి శివారులో సోయా పంట పొలంలో నిలిచిన వర్షపు నీరు

10 సెం.మీల వర్షపాతం నమోదు 

పంట పొలాల్లో నిలిచిన నీరు 

దెబ్బతిన్న రహదారులు


కంగ్టి, జూలై6: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వర్షానికి కంగ్టితో పాటు భీంరా, దెగుల్‌వాడి, చౌకన్‌పల్లి, తుర్కవడగాం, చాప్టా, నాగూర్‌, తదితర గ్రామాల్లో మొలక దశలో ఉన్న పెసర, సోయా, పత్తి పంటపొలాల్లో భారీ గా నీరు నిలిచింది. పలుచోట్ల పొలాల్లోకి నీరు చేరడంతో కోతకు గురయ్యాయి. కంగ్టి- బీంరా గ్రామాల మధ్య గల కల్వర్టు ఒక వైపు కొట్టుకుపోయి గండి పడడంతో ప్రమాదకరంగా మారింది. మొలకదశలోనే పొలాల్లో నీరు నిలవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. కంగ్టి- పిట్లం రూట్లో పీతర వాగుపై వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాత్రి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షంతో మండలంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. కాగా పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST