చిత్తూరులో మూడు కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-06-05T10:51:02+05:30 IST

చిత్తూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే పాజిటివ్‌ వచ్చిన వారంతా బయటి ప్రాంతాల నుంచి..

చిత్తూరులో మూడు కేసుల నమోదు

చిత్తూరు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే పాజిటివ్‌ వచ్చిన వారంతా బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.గురువారం మరో మూడు కేసులు నమోదు కావడంతో పాజిటివ్ల సంఖ్య 13కు చేరింది. వీరిలోలో అజ్మీర్‌ నుంచి వచ్చిన ఆరుగురికి బయటే కరోనా వచ్చింది.. బయటే నయమైపోయింది. గురువారం నమోదైన కేసులతో కలిపి ఆరు యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.తాజా కేసుల విషయానికొస్తే.. మంగసముద్రం హౌసింగ్‌ కాలనీకి చెందిన ఓ కుటుంబం ఇటీవల తిరుత్తణి నుంచి వచ్చింది. కుటుంబ యజమానికి పరీక్షలు నిర్వహించగా.. బుధవారం పాజిటివ్‌ వచ్చింది. దీంతో వెంటనే భార్య, ఇద్దరు కుమార్తెలకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారిలో భార్యకు నెగటివ్‌ రాగా... ఇద్దరు అమ్మాయిలకు పాజిటివ్‌ వచ్చింది. తమిళనాడులోని తిరుచందూరుకు చెందిన ఇద్దరు సోదరులు నగరంలోని రాములవారిగుడి వీధిలో బంగారు ఆభరణాల దుకాణాలను నిర్వహిస్తున్నారు.


వీరి కుటుంబాలు అక్కడే ఉన్నాయి. ఈ అన్నదమ్ముల్లో ఒకరికి గురువారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతని సోదరుడు, వంట మనిషిని క్వారంటైన్‌కు తరలించారు. గురువారం రాత్రి నుంచే రాములవారిగుడిని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో వైఎస్సార్‌ నగర్‌, చెన్నమ్మగుడిపల్లె, మంగసముద్రం హౌసింగ్‌ కాలనీ, రాములవారిగుడి వీధి ప్రాంతాలు కంటైన్మెంట్‌ జోన్లుగా ఉన్నాయి.


గుంటూరులోని కోఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కట్టమంచి మైదా ఫ్యాక్టరీకి చెందిన వ్యక్తి ఇటీవల చిత్తూరుకు వచ్చారు. ఆయనకు బుధవారం ప్రిమెటివ్‌ పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో వివిధ మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. గురువారం మళ్లీ వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా అతనికి నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-05T10:51:02+05:30 IST