రికార్డుస్థాయిలో..!

ABN , First Publish Date - 2021-06-24T05:17:00+05:30 IST

వరిధాన్యం కొనుగోళ్లు ముగిశాయి.

రికార్డుస్థాయిలో..!
కొనుగోలు కేంద్రం వద్ద సేకరించిన ధాన్యం

  • మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీగా ధాన్యం కొనుగోళ్లు
  • 12 కేంద్రాల ద్వారా 28,623టన్నుల సేకరణ
  • ధాన్యాన్ని విక్రయించిన 5720 మంది రైతులు 
  • రూ.53.68 కోట్లకుగానూ రూ.51.98కోట్లు చెల్లింపులు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : వరిధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు రైతులు విక్రయించారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో వాతావరణ పరిస్థితులకనుగుణంగా సగటున 10వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిని సాగుచేస్తారు. వానా కాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు వరి సాగుకు ఆసక్తి చూపారు. వ్యవసాయ బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో వరి ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈసారి ప్రభుత్వం వరికి మద్దతు ధరను గ్రేడ్‌ ఏ రకానికి రూ.1,880.. సాధారణ రకానికి రూ.1,850గా నిర్ణయించింది. ధాన్యం సేకరణకు మేడ్చల్‌-మల్కాజ్‌గిరిజిల్లాలో 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో మాధారం, ఏదులాబాద్‌, ప్రతాపసింగారం, లక్ష్మాపూర్‌, కేశవరం, ఉద్దెమర్రిలో ఏర్పాటు చేశారు. పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో మేడ్చల్‌, కీసర, డబిల్‌పూర్‌.. డీఎఫ్‌ఎస్‌సీఎస్‌ల ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌, పూడూరు.. మేడ్చల్‌ వ్యవసాయ మార్కెట్‌ తరపున కండ్లకోయ వద్ద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ సారి పౌరసరఫరాల శాఖ రికార్డుస్థాయిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది.  కేంద్ర ప్రభుత్వం నుంచి ‘లేవీ’ సేకరణలో మార్పులు తీసుకొచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం గతంలో మిల్లర్లకు లేవీ లక్ష్యం 75శాతం ఉండేది. ప్రస్తుతం 25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముం దుకు రాలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ మద్దతు ధరకు వరి ధాన్యం సేకరించేందుకు ప్రణాళిక రూపొందించింది. కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 30వేల టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఈ సీజన్‌లో 28,623 టన్నుల వరి ధాన్యాన్ని 5,720 మంది రైతుల నుంచి సేకరించింది. మొత్తం రూ.53.68 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇప్పటివరకు రూ.51.98కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు చెల్లించారు. గతేడాది కొనుగోలు కేంద్రాల్లో రైతుల పాసుపుస్తకాల ఆధారంగా ధాన్యాన్ని సేకరించారు. ఈసారి ధాన్యం సేకరణ పారదర్శకంగా ఉండేందుకుగానూ జిల్లాలోని రైతుల వివరాలను ‘ఆన్‌లైన్‌’లో పొందుపరిచారు. ఏయే మండలాల్లో ఎంతమంది రైతులు ఉన్నారన్న సమాచారంతోపాటు, రైతుల భూములకు సంబంధించిన సర్వేనెంబర్లతో సహా సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సహకారంతో ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశారు. రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ధాన్యం విక్రయించే రైతుల వద్ద నుంచి ఆధార్‌కార్డు, బ్యాంకుఖాతా నెంబర్‌తోపాటు ఐఎఫ్‌సీ కోడ్‌ నెంబర్లు సేకరించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పౌరసరఫరాల శాఖ ట్యాబ్‌లతోపాటు ప్రింటర్లను కూడా పంపిణీ చేసింది. ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు సీయూజీ సౌకర్యం కూడా కల్పించారు. రైతుల వద్ద ధాన్యం సేకరించగానే రోజువారీగా వివరాలను ట్యాబ్‌లలో ఎంట్రీ (నమోదు) చేశారు. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలు పంపిన వివరాలను పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ పరిశీలించి, ఆన్‌లైన్‌లో డిజిటల్‌ సంతకంతో అప్రూవల్‌ (ఆమోదం) చేశారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విక్రయించిన ధాన్యం డబ్బులు జమ చేశారు. 



Updated Date - 2021-06-24T05:17:00+05:30 IST