ఎగుమతుల్లో రికార్డు పతనం

ABN , First Publish Date - 2020-05-16T05:46:50+05:30 IST

కొవిడ్‌-19 ప్రభావానికి ప్రపంచవ్యాప్తంగా సరిహద్దుల మూసివేత, రవా ణా స్తంభన నేపథ్యంలో భారత ఎగుమతుల రంగం కనీవినీ ఎరుగని సంక్షోభంలో పడింది. శుక్రవారంనాడు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో...

ఎగుమతుల్లో రికార్డు పతనం

  • ఏప్రిల్‌లో 60 శాతం పైగా క్షీణత 
  • దిగుమతులదీ అదే దారి

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ప్రభావానికి ప్రపంచవ్యాప్తంగా సరిహద్దుల మూసివేత, రవా ణా స్తంభన నేపథ్యంలో భారత ఎగుమతుల రంగం కనీవినీ ఎరుగని సంక్షోభంలో పడింది. శుక్రవారంనాడు విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో భారత ఎగుమతులు ఏకంగా 60.28 శాతం, దిగుమతులు 58.65 శాతం క్షీణించాయి. దేశచరిత్రలో ఎన్నడు లేని పతనం ఇది. 2011-12 నుంచి భారత ఎగుమతులు ప్రతీ నెలా 30 వేల కోట్ల డాలర్లకు అటూఇటూగా ఉంటున్నాయి. ఏప్రిల్‌ నెల ఎగుమతుల విలువ 1,036 కోట్ల డాలర్లు (రూ.77,700 కోట్లు) కాగా దిగుమతుల విలువ 1,712 కోట్ల డాలర్లు (రూ.1.28 లక్షల కోట్ల్లు). వాణిజ్య లోటు గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 1,533 కోట్ల డాలర్ల (రూ.1.15 లక్ష ల కోట్లు) నుంచి 676 కోట్ల డాలర్లకు (రూ.50,700 కోట్లు) తగ్గింది. 2016 మే నెల తర్వాత వాణిజ్య లోటు మరో కనిష్ఠ స్థాయి ఇదే. ఎగుమతులు భారీ క్షీణత నమోదు చేయడం వరుసగా ఇది రెండో నెల. మార్చిలో ఎగుమతులు 34.57 శాతం తగ్గాయి.   


ఒకపక్క ప్రపంచవ్యాప్తంగా డిమాండు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో కరోనా సంక్షోభం అతలాకుతలం చేయడం భారత ఎగుమతులకు అశనిపాతంగా మారింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కార ణంగాసరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, డిమాం డు పతనం ఎదుర్కొంటూ ఉండడంతో భారీ ఎగుమతి ఆర్డర్లు రద్దయిపోయినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇనుప ఖనిజం, ఫార్మా విభాగాలు తప్పితే మిగతా 28 రంగాలు ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధినే నమోదు చేశాయి. 


  1. విభాగాల వారీగా చూస్తే రత్నాభరణాలు (-98.74 శాతం), తోలు ఉత్పత్తులు (93.28 శాతం), పెట్రోలియం ఉత్పత్తులు (-66.22 శాతం), ఇంజనీరింగ్‌ వస్తువులు (-64.76 శాతం) భారీ క్షీణతను నమోదు చేశాయి.
  2. దిగుమతుల విభాగంలో మొత్తం 30 కీలక రంగాలు ఏప్రిల్‌ నెలలో ప్రతికూల వృద్ధినే నమోదు చేశాయి. పెట్రో ఉత్పత్తులకు డిమాండు తగ్గడం వల్ల ఆయిల్‌ దిగుమతులు 59.03 శాతం క్షీణించి 466 కోట్ల డాలర్లకు (రూ.34,950 కోట్లు) దిగజారాయి. 
  3. నాన్‌ ఆయిల్‌ దిగుమతులు 58.5 శాతం తగ్గి 1246 కోట్ల డాలర్లకు (రూ.93,450 కోట్లు) క్షీణించాయి. డిమాండు లేకపోవడం వల్ల బంగారం దిగుమతులు గత ఏప్రిల్‌తో పోల్చితే 400 కోట్ల డాలర్ల (రూ.30 వేల కోట్లు) నుంచి 283 కోట్ల డాలర్లకు (రూ.21,225 కోట్లు) పడిపోయాయి.


ఆదుకోకపోతే మా పని అంతే

ఒక నెలలో ఎగుమతులు ఇంత భారీగా క్షీణించడం చరిత్రలో ఇదే ప్రథమమని, సరైన ప్రోత్సాహకాలతో ప్రభుత్వం ఆదుకోవాలని భారత ఎగుమతిదారుల సంఘాల సమాఖ్య (ఫియో) ప్రెసిడెంట్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు మెరుగుపడడాన్ని బట్టి మూడో త్రైమాసికం నుంచి ఎగుమతులు పుంజుకుంటాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. 70- 80 శాతం మేరకు ఆర్డర్లు రద్దు కావడం వల్ల ఎగుమతి యూనిట్లలో ఉపాధి నష్టం, ఎన్‌పీఏలు గణనీయంగా పెరిగిపోయాయన్నారు.


Updated Date - 2020-05-16T05:46:50+05:30 IST