కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సిద్ధూ మధ్య సయోధ్య కుదిరింది?

ABN , First Publish Date - 2021-07-23T00:33:51+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర

కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సిద్ధూ మధ్య సయోధ్య కుదిరింది?

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్,  ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపిస్తోంది. సిద్ధూ శుక్రవారం పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో కెప్టెన్ సింగ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలకు తేనీటి విందు ఇవ్వబోతున్నారు. ఈ విందు అనంతరం అందరూ కలిసి పీసీసీ టీమ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారు. సిద్ధూతో సయోధ్య కుదుర్చుకోవాలని కెప్టెన్ సింగ్‌పై ఒత్తిళ్ళు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 


చండీగఢ్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే నూతన పీసీసీ బృందం బాధ్యతల స్వీకరణకార్యక్రమానికి హాజరుకావాలని కెప్టెన్ సింగ్‌కు ఆ పార్టీ పంజాబ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్‌జిత్ నగ్రా ఆహ్వానం పంపించారు. ఈ ఆహ్వానాన్ని కెప్టెన్ సింగ్ అంగీకరించారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రవీన్ ఠుర్కల్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్‌లో తేనీటి విందుకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలను కెప్టెన్ సింగ్ ఆహ్వానించారని పేర్కొన్నారు. అక్కడి నుంచి వారంతా కలిసి కాంగ్రెస్ భవన్‌లో జరిగే నూతన పీసీసీ బృందం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ఈ తేనీటి విందుకు నవజోత్ సింగ్ సిద్ధూ కూడా హాజరవుతారని తెలుస్తోంది. 


Updated Date - 2021-07-23T00:33:51+05:30 IST