అధికారుల చేతులకు YSRCP నేతల సంకెళ్లు..!

ABN , First Publish Date - 2021-10-28T06:18:01+05:30 IST

విశాఖపట్నంలో అధికారుల చేతులకు అధికార పార్టీ నేతలు సంకెళ్లు వేస్తున్నారు.

అధికారుల చేతులకు YSRCP నేతల సంకెళ్లు..!

  • సిఫార్సు!
  • అన్నింటికీ అడ్డం పడుతున్న వైనం
  • రైతుబజార్లలో డ్వాక్రా సంఘాల రొటేషన్‌ ప్రక్రియకు మోకాలడ్డు
  • గతంలో ఉన్నవారినే కొనసాగించాల్సిందిగా లేఖ
  • దేవదాయ శాఖ వ్యవహారంలోనూ అదే తీరు
  • ఇలాగైతే ముందుకు వెళ్లేదెలాగని అధికారుల అంతర్మథనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో అధికారుల చేతులకు అధికార పార్టీ నేతలు సంకెళ్లు వేస్తున్నారు. తమ దగ్గరకు వచ్చి సలామ్‌ చేస్తే ఏ పనైనా చేయించగలమని నిరూపించుకోవడానికి తప్పో, ఒప్పో తెలుసుకోకుండా సిఫారసు లేఖలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఇలాగైతే తాము ఏమి చేయగలుగుతామంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నగరంలో కొద్దిరోజులుగా నలుగుతున్న సమస్యలపైనే ఇలా వ్యవహరిస్తే...తెర వెనుక తెలియని అంశాలపై ఇంకెన్ని ఇలాంటి సిఫారసులు చేస్తున్నారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తొలగించిన వారిని తీసుకోవాలట!!

నగరంలోని రైతుబజార్లలో డ్వాక్రా సంఘాలు దశాబ్దకాలంగా ఎంతలా పాతుకుపోయాయో అందరికీ తెలిసిందే. కొందరు సభ్యులు...వినియోగదారులతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు కేటాయించిన స్టాళ్లను అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ఇంకొందరు గ్రూపులో ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వకుండా అంతా తామై వ్యవహరిస్తూ లక్షాధికారులుగా ఎదిగారు. వీరిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం, అవకాశం ఇవ్వాలని మిగిలిన గ్రూపులు చాలాకాలంగా కోరుతుండడంతో జీఓ నంబరు 29 ప్రకారం మూడేళ్లకు పైబడి బజార్లలో వున్నవారిని ఖాళీ చేయించడానికి అధికార యంత్రాంగం నడుం కట్టింది. జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి దీనిపై దృష్టిసారించి ఆరు నెలల క్రితం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దశల వారీగా డ్వాక్రా సంఘాలకు పరిస్థితిని తెలియజేస్తూ, గడువు దాటిన వారు వెళ్లిపోవాలని సూచించారు. కావలసినంత సమయం ఇచ్చారు. మధ్యలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే...అక్కడ వారికి చుక్కెదురైంది. ఎట్టకేలకు గడువు దాటిన వారిని బయటకు పంపించారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి ప్రకటన కూడా ఇచ్చారు. ఇంతలో దళారులు రంగప్రవేశం చేశారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత వద్దకు 13 సంఘాల ప్రతినిధులను తీసుకువెళ్లి...కట్టుకథలు వినిపించారు. అర్ధంతరంగా తమను తొలగిస్తే...తమ పిల్లల చదువులు ఆగిపోతాయని, హోల్‌సేల్‌ మార్కెట్‌లో బకాయిలు కట్టలేమన్నారు. అంతే...క్షణాల్లో మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న పేరిట సిఫారసు లేఖ తయారైపోయింది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఖాళీ చేయుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, తిరిగి ఆ 13 గ్రూపులకు స్టాళ్లు కేటాయించాలని కోరారు. పనిలో పనిగా ఆ శాఖ చూసే వ్యవసాయ శాఖా మంత్రికి కూడా మరో కాపీ పంపారు. ఇది చూసి అధికారులు తలలు పట్టుకున్నారు. దశాబ్దకాలం పైగా వ్యాపారులు చేసుకొని బాగా స్థిరపడిన వారినే ఇంకా కొనసాగిస్తే...మిగిలిన గ్రూపులకు ఇక అవకాశం ఎప్పుడు లభిస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మాకు ఉపాధి కల్పించండి’ అంటూ ఏళ్ల తరబడి తిరుగుతున్న వారికి తాము ఏమి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు విధానాలతో వెళుతున్న వారిని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తే...సహకరించకుండా ఇలా చేయడం ఏమిటని అధికారులు చర్చించుకుంటున్నారు.


దేవుడు సొమ్ములు తిన్నవారికి అండ

జిల్లాలో దేవదాయ శాఖ గతంలో ఎన్నడూ లేనంత చెడ్డపేరు మూటగట్టుకుంది. దేవుడి హుండీ డబ్బులను సిబ్బందే పక్కదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలు బయటకు వస్తాయని ఒకరిపై మరికొరు బురద జల్లుకుంటున్నారు. తప్పులు చేశారని ఉన్నతాధికారులు స్పష్టమైన నివేదిక ఇచ్చినా వారిపై చర్యలు లేకుండా ఇక్కడే కొనసాగిస్తున్నారు. అనేక ఆరోపణలపై ఓ ఉద్యోగిని అధికారులు సస్పెండ్‌ చేస్తే...ఆయన అదురుబెదురు లేకుండా జిల్లా అధికారి కార్యాలయంలోనే తిరుగుతూ అన్నీ చక్కబెడుతున్నారు. మొసలి కన్నీరు కారుస్తూ తల్లిని వెంటబెట్టుకుని వెళ్లి..తనకు విశాఖలోనే ఉద్యోగం కావాలని అధికార పార్టీ నేతను కోరితే...కన్నెర్ర చేయాల్సింది పోయి..ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తే..అక్కడే చేసుకో అంటూ అభయం ఇచ్చి పంపించారు. తప్పు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పే నేతలు...దేవదాయ శాఖ పరువు రోడ్డున పడితే...చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కావడం లేదని జిల్లా అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. డిపార్ట్‌మెంట్‌ సస్పెండ్‌ చేసిన వ్యక్తికి, కోర్టు స్టే ఇవ్వడం కుదరదని చెప్పిన ఉద్యోగికి రాజకీయంగా అండగా నిలవడం ఏ విధంగా న్యాయమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెడ్డపేరు మూటగట్టుకున్నవారిని వెనకేసుకు వస్తే...అసలుకే మోసం వస్తుందని గ్రహించడం లేదంటూ అధికార పార్టీలోను గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-28T06:18:01+05:30 IST