చేనేత రంగంలో జిల్లాకు గుర్తింపు

ABN , First Publish Date - 2022-08-08T05:38:18+05:30 IST

చేనేత రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు.

చేనేత రంగంలో జిల్లాకు గుర్తింపు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

 

 ఈ రంగమే మా కుటుంబాన్ని ఆదుకుంది 

 కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

అరసవల్లి, ఆగస్టు 7: చేనేత రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోంలో ఆదివారం చేనేత, జౌళిశాఖ, సిక్కోలు వీవర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీల ఆధ్యర్యంలో   జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం అతిపెద్ద రంగమని చెప్పారు. ఈ  రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంద న్నారు. చేనేత వస్త్రాల్లో మంగళగిరి, వెంకటగిరి మాదిరిగా పొందూరుకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ ఉందన్నారు. దీనిని మరింత విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన నేతన్న పథకం చేనేత కళాకారులకు కొంత మేలు చేసిందన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన త్రిఫ్ట్‌ లోన్‌, సబ్సిడీ, రిబేట్‌ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జిల్లాలోని అధికారులందరూ ప్రతీ నెల మొదటి సోమ వారం చేనేత వస్త్రాలను ధరించేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వారికి మగ్గాలను ఇచ్చి వారిలోని నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి కూడా చేనేత రంగంలో పనిచేసి పదవీ విరమణ పొందారని, చేనేత రంగమే తమ కుటుంబాన్ని ఆదుకుందని చెప్పారు. చేనేత రంగం అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత  నాబార్డు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టర్‌ తిలకించారు. అనంతరం చేనేత రంగంలో విశేష కృషి చేసిన బొట్ట రమేష్‌, బొద్దం సత్యారావు, ముసలయ్య, జాడ కృష్ణారావు, పంది అప్పలసూరిను సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ, మునిసిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, చేనేత, జౌళిశాఖ పీడీ ఐ.ధర్మారావు, ఏడీవోలు బి.రమేష్‌, కె.ముఖర్జీ, ఎన్‌వీ రమణ, ఆప్కో మేనేజర్‌ టి.జగదీశ్వరరావు, బెజ్జిపురం యూత్‌క్లబ్‌ ఎం.ప్రసాదరావు, ఎన్‌.సన్యాసిరావు, కాసిన ప్రసాదరావు, మంచు కృష్ణారావు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.


ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయండి 

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో  ప్రతీ గృహం, కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేయాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.  ఆజాదీకా అమృత్‌  మహోత్సవంలో భాగంగా ఆదివారం డీఆర్‌డీఏ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.  



Updated Date - 2022-08-08T05:38:18+05:30 IST