అయినా నిర్లక్ష్యమే!

ABN , First Publish Date - 2022-01-24T04:52:06+05:30 IST

కొవిడ్‌ ఉధృతిని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు రెండేళ్లుగా పదే, పదే చెప్తున్నా మాటలు ఎవరికీ పట్టడం లేదు. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ విజృంభిస్తున్న వేళ కూడా అటు ప్రజల్లోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ తీవ్ర నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత మేర జాగ్రత్తలు కనిపిస్తున్నా ఇతర చోట్ల నామమాత్రమే. కరోనా అంటే అసలు భయం లేకుండా పోయిందో, రెండు డోసుల టీకాలు వేయించుకున్నాం... పాజిటివ్‌ వచ్చినా ఏం కాదన్న పరిస్థితో.. తెలియదుకానీ అత్యధికశాతం జనాభాలో గత రెండు విడతల అప్రమత్తత ప్రస్తుతం కనిపించడం లేదు.

అయినా నిర్లక్ష్యమే!
మాస్క్‌లు లేకుండా రోడ్డుపై ఓ వ్యాపారి వద్ద కొనుగోలు చేస్తున్న ప్రజలు

మహమ్మరి విజృంభిస్తున్న వేళ..

భౌతిక దూరం, మాస్క్‌లు పట్టించుకోని జనం

మొక్కుబడిగా యంత్రాంగం పర్యవేక్షణ

రద్దీగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా రంగం

పాఠశాలలు, ఇతర పని ప్రదేశాల్లోనూ అదే పరిస్థితి

వైరస్‌వ్యాప్తికి అవే ప్రదాన కారణం

వారంలో 3404 పాజిటివ్‌ కేసులు నమోదు

ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ ఉధృతిని తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు రెండేళ్లుగా పదే, పదే చెప్తున్నా మాటలు ఎవరికీ పట్టడం లేదు. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ విజృంభిస్తున్న వేళ కూడా అటు ప్రజల్లోనూ, ఇటు అధికార యంత్రాంగంలోనూ తీవ్ర నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎంతో కొంత మేర జాగ్రత్తలు కనిపిస్తున్నా ఇతర చోట్ల నామమాత్రమే. కరోనా అంటే అసలు భయం లేకుండా పోయిందో, రెండు డోసుల టీకాలు వేయించుకున్నాం... పాజిటివ్‌ వచ్చినా ఏం కాదన్న పరిస్థితో.. తెలియదుకానీ అత్యధికశాతం జనాభాలో గత రెండు విడతల అప్రమత్తత ప్రస్తుతం కనిపించడం లేదు. అధికశాతం మంది మాస్కులు పెట్టుకోవడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. ప్రజలంతా నిద్రపోయే సమయంలో రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించి ప్రభుత్వం చేతులు దులుపుకోంది. జిల్లాలోని పలు ప్రధాన పట్ణణాలు, చిన్న పట్టణాలుగా ఉండే మండల కేంద్రాల్లో పరిస్థితిని ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించగా అత్యధిక చోట్ల ప్రజల్లో నిర్లక్ష్యం, అధికారుల్లో ఆలసత్వం కనిపించింది.

భౌతికదూరం ఎక్కడా..?

ప్రధానంగా జనం రాకపోకలు అధికంగా ఉండే బస్టాండ్లు, ఆటోలు ఇతర వాహనాలు ఎక్కే కూడలి ప్రాంతాలు, మార్కెట్లు, వాణిజ్య దుకాణాలు, బ్యాంకులు ఇతరత్రా కార్యాలయాలు, సంస్థలు, హోటళ్ళు, వీధి వ్యాపారాలు వంటి చోట్ల భౌతిక దూరం అన్నది మచ్చుకైనా కనిపించలేదు. పాఠశాలల్లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితితోనే జిల్లాలో రోజువారీ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పల్లెలకు భారీగా జనం బస్సులు, ఆటోలు ఇతరత్రా ప్రైవేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తుండగా వాటిలో మాస్కులు వాడకం, భౌతికదూరం అంతంతమాత్రమే. వైరస్‌ వ్యాప్తిఇంత తీవ్రంగా పెరుగుతున్న అటు ప్రజల్లోనూ, ఇటు అధికారుల్లోనూ నిర్లక్ష్యం కొనసాగుతుండటం ప్రమాదకరమే. ఈ వేవ్‌లో కొవిడ్‌ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే నిబంధనలు పాటించాల్సిందే.  

Updated Date - 2022-01-24T04:52:06+05:30 IST