కారుణ్య నియామకాలపై దరఖాస్తు అందిన

ABN , First Publish Date - 2022-05-25T09:02:32+05:30 IST

కారుణ్య నియామకాల విషయంలో దరఖాస్తు వచ్చిన 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కారుణ్య నియామకాలపై దరఖాస్తు అందిన

ఆర్నెల్లలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే: సుప్రీం

న్యూఢిల్లీ, మే 24: కారుణ్య నియామకాల విషయంలో దరఖాస్తు వచ్చిన 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నియామకాలు తప్పనిసరిగా కాలవ్యవధికి లోబడి ఉండాలని, ఆ వ్యవధి 6 నెలలకు మించకూడదని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో కారుణ్య నియామకాల ప్రయోజనమే నెరవేరదని అభిప్రాయపడింది. ‘‘ఒక ఉద్యోగి అకాల మరణం అతడి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. అలాంటి స్థితిలో ఉన్న కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించడమే ఈ విధానానికి మూలం. కాబట్టి కారుణ్య నియామకం కోరుతూ వచ్చే దరఖాస్తులను అధికారులు వెంటనే పరిగణనలోకి తీసుకుని, 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి’’ అని కోర్టు పేర్కొంది.


ఒడిశా ఎక్సైజ్‌ విభాగంలో ఏఎస్సైగా సర్వీసులో ఉండగానే చనిపోయిన ఒక ఉద్యోగి కుమారుడి పిటిషన్‌పై విచారణ సంద ర్భంగా జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కక్షిదారు పేరు మలయనందా సేథీ. 2010 జనవరి 2న ఆయన తండ్రి మరణించారు. సర్వీసులో ఉండగానే తన తండ్రి మరణించారని, తనను జూనియర్‌ క్లర్క్‌గా నియమించాలని కోరుతూ 2010 జూలైలో మలయనందా దరఖాస్తు చేసుకున్నారు. అతడి దరఖాస్తు ఐదేళ్ల తర్వాత ముందుకు కదిలింది. ఆ కుటుంబం కారుణ్య నియామకానికి అర్హమైనదేనని అధికారులు తేల్చినా అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇంతలో ఒడిసా సివిల్‌ సర్వీసెస్‌ (రీహాబిలిటేషన్‌ అసిస్టెన్స్‌) రూల్స్‌ 1990 స్థానంలో 2020 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 2021లో అధికారులు మళ్లీ అతడి దరఖాస్తును బయటకు తీసి కొత్త నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు పంపారు. దీని ప్రకారం కారుణ్య నియామకాల కింద క్లాస్‌ 4 ఉద్యోగం మాత్రమే ఇస్తారు. దీంతో మలయనందా తనకు పాత నిబంధనల ప్రకారం క్లర్క్‌ పోస్టు ఇవ్వాలని కోరుతూ ఒడిశా హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కొత్త నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2022-05-25T09:02:32+05:30 IST