వైసీపీకి రెబెల్స్‌?

ABN , First Publish Date - 2021-02-28T06:51:02+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌..

వైసీపీకి రెబెల్స్‌?
బొండా మాధవి. కవగాపు సుశీల, ప్రగడ విజయలక్ష్మి

అభ్యర్థిత్వం ఆశించి భంగపడిన వారంతా ఇండిపెండెంట్లుగా కొనసాగుతామంటూ ప్రకటనలు

పదో వార్డులో అభ్యర్థిని మార్పు..

బొండా మాధవి స్థానంలో జగ్గుపల్లి జయ..

పోటీలో ఉంటామంటూ మాధవి వర్గం ప్రకటన..

13వ వార్డులో కూడా అభ్యర్థి మార్పు..

ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసిన కవనాపు సుశీల..

87వ వార్డులో కూడా సేమ్‌ సీన్‌..

ప్రగడ విజయలక్ష్మి స్థానంలో కోమటి శ్రీనివాసరావు..

8, 24, 66 76 తదితర వార్డుల్లో తిరుగుబాటు అభ్యర్థులు..

అభ్యర్థుల్లో ఆందోళన..

అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ పెద్దల యత్నం 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో రెబెల్స్‌ బెడదపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒకింత ఆందోళనగా ఉన్నారు. పార్టీ టిక్కెట్‌ దక్కని పలువురు ఇండిపెండెంట్లుగా కొనసాగేందుకు సిద్ధం కావడం, తమ సత్తా చూపుతామంటూ ప్రకటనలు ఇస్తుండడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే రెబెల్స్‌ పోటీలో కొనసాగుతారా? లేక వైదొలుగుతారా? అనే విషయం వచ్చే నెల మూడో తేదీ సాయంత్రానికి గానీ తేలదు.


జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను వైసీపీ శుక్రవారం విడుదల చేసింది. దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లోని 20 వార్డులు మినహాయించి మిగిలిన 78 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే పలు వార్డుల్లో టిక్కెట్లు ఆశించిన కొందరు తాము గతంలో దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీకి దిగి సత్తా చాటుతామంటూ బహిరంగంగానే పేర్కొంటున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని పదో వార్డు వైసీపీ అభ్యర్థినిగా గతంలో బొండా మాధవిని ఖరారుచేశారు. ఈ మేరకు ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంతోపాటు బీఫారం కూడా సమర్పించారు. ఇటీవల జీవీఎంసీ ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ కావడంతో వార్డులో ప్రచారం ప్రారంభించారు.


అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో బొండా మాధవి పేరు కనిపించలేదు. ఆమె స్థానంలో జగ్గుపల్లి జయ పేరు ప్రకటించారు. దీంతో షాక్‌కు గురైన మాధవి వర్గం ఇండిపెండెంట్‌గా పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే 13వ వార్డు గతంలో కవగాపు సుశీలకు కేటాయించగా, శుక్రవారం విడుదల చేసిన జాబితాలో కెల్ల సునీత  పేరును ప్రకటించారు. దీంతో సుశీల అనుచరులు శనివారం వార్డులో ఆందోళనకు దిగారు. బహిరంగ సభ ఏర్పాటుచేసి గత ఏడాదికాలంగా వార్డులో పెద్దఎత్తున ప్రచారం చేసిన తనను తప్పించి, కొత్తవారికి టిక్కెట్‌ ఇవ్వడం దారుణమని, తాను ఇండిపెండెంట్‌గా పోటీలో కొనసాగుతానని సుశీల ప్రకటించారు. మూడో తేదీ వరకూ వేచిచూసి తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్టు చెప్పడం పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేసింది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఎనిమిదో వార్డు అభ్యర్థిగా లొడగల అప్పారావు పేరును ప్రకటించారు. కానీ అక్కడ గుడ్ల పోలిరెడ్డి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు పార్టీ బీఫారం ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చూపుతానని స్పష్టంచేయడమే కాకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.


ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 24వ వార్డు అభ్యర్థినిగా సాది పద్మారెడ్డి పేరు ప్రకటించారు. అయితే అక్కడ నుంచి టిక్కెట్‌ ఆశించిన మజ్జి దుర్గాప్రసన్న లక్ష్మి ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని 66వ వార్డును ఇమ్రాన్‌ఖాన్‌కు కేటాయించారు. దీంతో అక్కడ సౌకత్‌ అలీ తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. 76వ వార్డును మంత్రి శంకర్‌నారాయణ ఆశించారు. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఆ వార్డును దొడ్డి రమణకు కేటాయించడంతో శంకరనారాయణ తాను కూడా పోటీలో కొనసాగాలని నిర్ణయించారు. 87వ వార్డును గతంలో ప్రగడ విజయలక్ష్మికి ఇచ్చారు. దీంతో ఆమె గత ఏడాదికాలంగా వార్డులో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కానీ శుక్రవారం ప్రకటించిన జాబితాలో ఆ వార్డును కోమటి శ్రీనివాసరావుకు కేటాయించడంతో విజయలక్ష్మి పోటీలో కొనసాగుతున్నట్టు ప్రకటించారు. అసంతృప్తులు, రెబెల్స్‌ను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు అభ్యర్థిత్వం ఖరారైనవారు చెబుతున్నారు.

Updated Date - 2021-02-28T06:51:02+05:30 IST