Abn logo
Sep 25 2021 @ 01:01AM

మన్యం వైసీపీలో తిరుగుబాటు

అసమ్మతి వర్గం ఎంపీపీ అభ్యర్థి బాబూరావుతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ రెబెల్స్‌ గెలుపు

చింతపల్లి, పాడేరు ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన అభ్యర్థులు ఓటమి

అరకులోయ, ముంచంగిపుట్టు, అనంతగిరి, హుకుంపేటల్లో అసంతృప్తి గళాలు

జి.మాడుగులలో టీడీపీ వ్యూహానికి వైసీపీ చిత్తు

ఎంపీపీగా స్వతంత్ర ఎంపీసీటీకి మద్దతు

మైదాన ప్రాంతంలో అత్యధికంగా ఏకగ్రీవాలు

మాడుగుల, మాకవరపాలెంలో రెండున్నరేళ్ల ‘సర్దుబాటు’

రావికమతంలో ముగ్గురు టీడీపీ సభ్యులను లాగేసుకున్న అధికార పార్టీ

కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలో నిబంధనలకు తిలోదకాలు


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): 

మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో పలుచోట్ల అధికార వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఆ పార్టీ ఎంపీటీసీలు...స్థానిక ఎమ్మెల్యేలు సూచించిన అభ్యర్థులను కాదని, తమకు నచ్చిన వారిని ఎంపీపీలుగా, వైస్‌ ఎంపీపీలుగా ఎన్నుకున్నారు. ఇటువంటి పరిస్థితి అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో అధికంగా కనిపించింది. మరికొన్నిచోట్ల ఎంపీపీ పదవికి అధికార పార్టీలోనే ఇద్దరు పోటీ పడడంతో స్థానిక ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని, సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. అభ్యర్థులు చెరో రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిని నిర్వహించేలా రాజీ కుదిర్చారు. 


పాడేరులో వైసీపీ అధికారిక అభ్యర్థిని ఓటమి

పాడేరు ఎంపీపీ పదవికి వైసీపీ అధిష్ఠానం ప్రకటించి, బీ-ఫారం జారీచేసిన చింతలవీధి ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి ఓడిపోయారు. అదే పార్టీకి చెందిన వంతాడపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సొనారి రత్నకుమారి...టీడీపీ, స్వతంత్రుల మద్దతుతో ఎంపీపీ అయ్యారు. మండలంలో మొత్తం 17 ఎంపీటీసీలకుగాను వైసీపీ 9, టీడీపీ 5, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలిచారు. ఎంపీపీ పదవికి వైసీపీ అధిష్ఠానం ఎంపిక చేసిన గిడ్డి విజయలక్ష్మికి ఆ పార్టీకి చెందిన ఆరుగురు, ఒక ఇండిపెండెంట్‌ మాత్రమే మద్దతు తెలిపారు. రత్నకుమారికి వైసీపీకి చెందిన ఒక సభ్యురాలితోపాటు టీడీపీకి చెందిన ఐదుగురు, స్వతంత్రులు ఇద్దరు..మొత్తం ఎనిమిది మంది మద్దతు తెలిపారు. దీంతో రత్నకుమారి ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ ఎంపీపీగా టీడీపీకి చెందిన పాడేరు-3 ఎంపీటీసీ సభ్యుడు గంగపూజారి శివకుమార్‌ ఎన్నికయ్యారు.


అరకులోయలో హైడ్రామా 

అరకులోయ ఎంపీపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే ఫాల్గుణ తొలుత ఎంపీపీ పదవికి సుంకరమెట్ట ఎంపీటీసీ మెంబర్‌ కొర్రా సుమాంజలి (వైసీసీ మండల అధ్యక్షుడు కొర్రా గాషి కుమార్తె), వైస్‌ ఎంపీపీకి పెదలబుడు-2 సభ్యుడు దురియా ఆనంద్‌ పేర్లను సూచించారు. కానీ సుమాంజలి పేరును దాదాపు అందరూ వ్యతిరేకించారు. దీంతో ఆయన ఎంపీపీ పదవికి ఎక్కువ మంది సభ్యులు సూచించిన మాడగడ-1 సభ్యురాలు రంజుపల్లి ఉషారాణికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ శనివారం జరిగిన ఎన్నికల్లో కొర్రా సుమాంజలి ఎంపీపీ పదవికి పోటీ పడ్డారు. ఆమె పేరును చినలబుడు సభ్యురాలు గరం గీత ప్రతిపాదించగా, ఒక్కరు కూడా మద్దతు తెలపలేదు. మరోవైపు మాడగడ-1 సభ్యురాలు రంజుపల్లి ఉషారాణి పేరును పెదలబుడు-1 సభ్యుడు ఎల్‌బీ భీమరాజు ప్రతిపాదించగా, వైసీపీకి చెందిన మరో ఎనిమిది మందితోపాటు టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. దీంతో ఉషారాణి ఎంపీపీగా ఎన్నికైనట్టు ఆర్‌ఓ శ్రీనివాసరావు ప్రకటించారు. కాగా ఉషారాణి ఎంపీపీ కావడం వెనుక కొంతమంది ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించినట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఇదిలా వుండగా వైస్‌ ఎంపీపీ పదవికి పెదలబుడు-2 సభ్యుడు దురియా ఆనంద్‌ పేరును ఎమ్మెల్యే సూచించగా, ఈ పదవికి ఏకంగా నలుగురు...పెదలబుడు-1 సభ్యుడు ఎల్‌బీ భీమరాజు, పెదలబుడు-2 సభ్యుడు దురియా ఆనంద్‌, బస్కీ సభ్యుడు రామన్న, ఇరగాయి సభ్యురాలు (టీడీపీ) జన్ని చెల్లమ్మ పోటీ పడ్డారు. బస్కీ సభ్యుడు రామన్నకు అందరికన్నా ఎక్కువగా నలుగురు సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నికైనట్టు ప్రకటించారు.


అనంతగిరిలో ఉత్కంఠ

అనంతగిరి ఎంపీపీగా శెట్టి నీలవేణి ఎన్నిక విషయంలో వైసీపీ నేతల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఆ పార్టీకి చెందిన చిలకలగెడ్డ ఎంపీటీసీ తడబారికి మితుల, లుంగపర్తి ఎంపీటీసీ దూరు జయవర్దిని పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ, మరో స్వతంత్య్ర సభ్యుడు కలిసి మొత్తం ఆరుగురు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. శెట్టి నీలవేణికి ఏడుగురు మద్దతుదారులు ఉన్నారు. కాశీపట్నం ఎంపీటీసీ (స్వతంత్ర) మూతిబోయిన సన్యాసి కీలకంగా మారరు. చివరి నిమిషంలో ఆయన నీలవేణికి మద్దతు తెలపడంతో ఈమె బలం ఎనిమిదికి చేరింది. ఎంపీపీ పదవికి నీలవేణి, మితుల పోటీ పడడంతో ఆర్‌వో ఓటింగ్‌ నిర్వహించారు. నీలవేణికి ఏడుగురు, మితులకు ఐదుగురు మద్దతు తెలిపారు. దీంతో నీలవేణి ఎన్నికైనట్టు ప్రకటించారు. కాగా వైస్‌ ఎంపీపీ పదవికి ఆరుగురు పోటీ పడడంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. ముంచంగిపుట్టు ఎంపీపీ పదవికి వైసీపీ అధికారిక అభ్యర్థిని కిలగాడ ఎంపీటీసీ అరిసెల సీతమ్మతోపాటు అదే పార్టీకి చెందిన రెబల్‌ సభ్యురాలు (సుజనకోట ఎంపీటీసీ) ఎం.సుబ్బలక్ష్మి పోటీపడ్డారు. దీంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. మొత్తం 14 మంది సభ్యులలో సీతమ్మకు తొమ్మిది మంది మద్దతు తెలపడంతో ఆమె ఎన్నికైనట్టు ఆర్‌వో ప్రటించారు.


హుకుంపేటలో ఇద్దరు పోటీ

హుకుంపేట ఎంపీపీగా కూడా రాజుబాబు (వైసీపీ), వైస్‌ ఎంపీపీగా సుడిపల్లి కొండలరావు (సీపీఎం) ఎన్నికయ్యారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీకి 8, స్వతంత్రులు 3, టీడీపీ 2, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కటి చొప్పున ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే ఎంపీపీ స్థానానికి శోభకోట ఎంపీటీసీ సభ్యుడు కూడా రాజబాబు (వైసీపీ), గూడ ఎంపీటీసీ సభ్యురాలు బి.ప్రియాంక పోటీ పడ్డారు. మిగిలిన 13 మందిలో రాజుబాబుకు ఐదుగురు వైసీపీ సభ్యులతోపాటు సీపీఎం, బీజేపీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన ఎంపీపీ అయ్యారు. ప్రియాంకకు టీడీపీ, స్వతంత్రులు మాత్రమే మద్దతు తెలిపారు. 


మాడుగుల ఎంపీపీ పదవికి ఇద్దరు పోటీ

మాడుగుల ఎంపీపీ పదవికి వైసీపీకి చెందిన ఇద్దరు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. వేమవరపు రామధర్మజ (మాడుగుల-4 ఎంపీటీసీ) తొలుత 2 సంవత్సరాల మూడు నెలలు ఎంపీపీగా ఉంటారు. తరువాత కాలం తాళ్లపురెడ్డి రాజారామ్‌ (జమ్మాదేవిపేట ఎంపీటీసీ) ఎంపీపీగా వుంటారు.


మాకవరపాలెంలో చెరో రెండున్నరేళ్లు

మాకవరపాలెం ఎంపీపీ పదవికి అధికార పార్టీలో ఇద్దరు పోటీ పడడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని, చెరో రెండున్నరేళ్లపాటు అధికారంలో వుండాలని సర్దుబాటు చేశారు. తొలి రెండున్నరేళ్లు  పైల భవానీ (పాపాయ్యపాలెం ఎంపీటీసీ), చివరి రెండున్నరేళ్లు  రుత్తల సర్వేశ్వరరావు (మాకవరపాలెం ఎంపీటీసీ) ఎంపీపీగా ఉంటారు.


నర్సీపట్నంలో టీడీపీ సభ్యురాలికి వైస్‌ ఎంపీపీ

నర్సీపట్నం మండలంలో వైసీపీకి 5, టీడీపీకి 4 ఎంపీటీసీలు వచ్చాయి. ఎంపీపీ పదవికి వైసీపీ నుంచి సుర్ల రాజేశ్వరి, బోళెం వెంకటేశ్‌ పోటీ పడ్డారు. సుర్ల రాజేశ్వరికి ఎమ్మెల్యే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో వెంకటేశ్‌ ఎంపీపీ ఎన్నికలకు గైర్హాజరవుతారేమోనన్న అనుమానంతో టీడీపీకి చెందిన చెట్టుపల్లి ఎంపీటీసీ ఇన్నం రత్నంను తమ వైపు తిప్పుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఆమెకు వైస్‌ ఎంపీపీ పదవిని కట్టబెట్టారు. కాగా తెలుగుదేశం పార్టీ బి-ఫారంతో గెలిచి, వైసీపీకి మద్దతు తెలిపిన చెట్టుపల్లి-1 ఎంపీటీసీ రత్నంపై అనర్హత వేయాలని రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు టీడీపీ మండల అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి తెలిపారు.


రావికమతంలో టీడీపీ సభ్యుడిని లాగేసుకున్న అధికార పార్టీ

రావికమతం మండలంలో వైసీపీ, టీడీపీలకు చెరి సగం (10 చొప్పున) ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. దీంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అధికార పార్టీ నాయకులు పావులు కదిపి, టీడీపీకి చెందిన తట్టబంద ఎంపీటీసీ సభ్యుడు పిల్లా శేషుబాబుని తమ వైపునకు తిప్పుకున్నారు. మరో ఇద్దరు టీడీపీ సభ్యులు ఎంపీపీ ఎన్నికకు గైర్హాజరయ్యేలా చేశారు. అధికార పార్టీ నేతల తీరుని నిరసిస్తూ మిగిలిన టీడీపీ సభ్యులు ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించారు.


జి.మాడుగులలో ఫలించిన టీడీపీ వ్యూహం!

స్వతంత్ర అభ్యర్థినికి మద్దతు...ఎంపీపీ పీఠం కైవసం

వైసీపీలో వర్గ విభేదాలు


పాడేరు (జి.మాడుగుల), సెప్టెంబరు 24: తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, జి.మాడుగుల ఎంపీపీ పదవి వైసీపీకి దక్కకుండా చేశారు. స్వతంత్ర సభ్యురాలు కొర్రా పద్మకు మద్దతు తెలిపి, ఆమెను ఎంపీపీని చేశారు. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీకి ఏడు, టీడీపీకి ఏడు రాగా, ఒకచోట (గడుతూరు) స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని ఇరు పార్టీ నేతలు భావించారు. ఈ విషయంలో టీడీపీ ఐక్యతగా వుండగా, వైసీపీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయినప్పటికీ స్వతంత్ర ఎంపీటీసీ సభ్యురాలు కొర్రా పద్మ..వైసీపీకే మద్దతు తెలిపేందుకు ముందుకువచ్చారు. కానీ ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీ నేతలు ఏకతాటిపైకి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మత్స్యరాస వరహాలరాజు, సోమెలి చిట్టిబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కొర్రా పద్మతో మాట్లాడి, ఎంపీపీ పదవి ఆఫర్‌ చేశారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన వంజరి ఎంపీటీసీ సభ్యుడు కె.మధు కూడా పద్మకు మద్దతు ఇస్తానన్నారు. ఎంపీపీ పదవికి కొర్రా పద్మ ఒక్కరే పోటీ చేయడంతో ఆమె ఎన్నికైనట్టు ఆర్‌వో ప్రకటించారు. వైస్‌ ఎంపీపీగా వంతాల ఎంపీటీసీ సభ్యురాలు వంతాల కల్యాణి (టీడీపీ) ఎన్నికయ్యారు.