శాంతికి కారణాలు..

ABN , First Publish Date - 2020-09-04T09:09:25+05:30 IST

మనిషికి ఉండాల్సిన మంచి గుణాల్లో.. శాంతి అత్యుత్తమమైనది.

శాంతికి కారణాలు..

మనిషికి ఉండాల్సిన మంచి గుణాల్లో.. శాంతి అత్యుత్తమమైనది. అది కోపాన్ని అణచివేసి మనసును అదుపులో ఉంచుతుంది. బద్ధ శత్రువులవల్ల వచ్చే ఉపద్రవాలను నిర్మూలిస్తుంది. సంఘంలో గౌరవాన్ని ప్రసాదిస్తుంది. దురాలోచనకు దూరంచేసి సన్మార్గంలో నడిచే శక్తినిస్తుంది. అటువంటి మహా ఉత్తమమైన శాంతి గుణాన్ని ఎలా సాధించాలో విదురుడు ధృతరాష్ట్రునికి ఇలా తెలియజేశాడు..


నియత తపమును నింద్రియనిగ్రహంబు

భూరి విద్యయు శాంతికిగారణములు

వాని యన్నింటి కంటె మేలైనశాంతి

కారణము లోభముడుగుట కౌరవేంద్ర!


నిశ్చలమైన మనసుతో చేసే తపస్సు, ఇంద్రియాలను అదుపులో పెట్టడం, గొప్ప విద్య, శాంతికి కారణాలని..  ఆ మూడింటి కన్నా మించింది.. లోభగుణాన్ని పోగొట్టుకోవడమేనని విదుర మహాశయుడు అన్నాడు. ఉన్నతమైన ఫలితం కోసం చిత్తశుద్ధితో చేసే ప్రగాఢమైన ప్రయత్నం తపస్సు.


తపోసాధనలో ప్రగతి సాధించినవారు తమను తాము ఉద్ధరించుకొంటూ ప్రపంచ శాంతిసౌఖ్యాలకు పాటుపడ్తారు. లోకకంటకులను నిర్మూలించడానికి తమ తపః ఫలితాన్ని ప్రయోగిస్తారు. ధర్మసంస్థాపనకు వారి కృషి సాటిలేనిది. విశ్వామిత్రుడు, కపిలుడు, కణ్వుడు,  మతంగుడు, అగస్త్యుడు ఆదిగా గల ఋషిపుంగవులు ఈ కోవకు చెందినవారు.


ఇక, శాంతి సాధనకు మరో ఉత్తమ మార్గం ఇంద్రియనిగ్రహం. భగవంతుడు ప్రసాదించిన ఇంద్రియాలను సదాలోచనకు సదాచరణకు తగిన విధంగా ఉపయోగించాలి. నవవిధ భక్తి మార్గాల సాఫల్యానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకు ఇంద్రియాల ఉపయోగం వెలకట్టరానిది. వాటివల్ల కోరికలు నశించి శాంతి కలుగుతుంది.


విద్‌ అనే ధాతువు నుండి పుట్టింది విద్య. అది లౌకిక, అలౌకికాలని రెండు విధాలుగా విభజింపబడింది. మొదట్లో లోక జ్ఞానం కోసం, జీవన విధాన సౌలభ్యం కోసం లౌకిక విద్యాభ్యాసం చేయాలి. అనంతరం లౌకిక విద్య ఆధారంగా అలౌకిక విద్యనభ్యసించాలి. అలౌకికవిద్యనే ఆత్మజ్ఞాన విద్య అంటారు.


లౌకిక ప్రపంచంలోని అనుభవాలన్నీ ఎండమావులలోని నీటితో సమానమని, అవి మనిషిని అజ్ఞానాంధకారంలో ముంచివేసి మానవత్వాన్ని అథోగతిపాలు చేస్తాయనే నిత్య సత్యాన్ని తెలియజేసేది ఆత్మవిద్య. అలాంటి పరతత్వ విద్యామృతం శాంతిగుణపోషణకు మిక్కిలిదోహదికారి అవుతుంది. ఇక, లోభగుణం.. దురితానికి ఆలవాలమైన దుర్గుణం. అందుకే అది మానవునిలో అంతరించిపోవాలని విశాలహృదయుడైన విదురుడు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాడు.




లోభగుణం సంకుచితత్వానికి ప్రతీక. దానికి బానిసైనవాడు తాను సంపాదించిన విభవాన్ని అనుభవించడు. ఇతరులకు దానం చేయడు, నికృష్టమైన జీవితాన్ని కొనితెచ్చుకొంటాడు. దయాగుణాన్ని దరిజేరనీయడు. తమ సంపద ఎప్పుడు ఎవరు కాజేస్తారోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతుంది. కాబట్టి వారు నిత్య అసంతృప్తులు. శాంతి అన్న మాటే వారి దరిజేరదు. వారికి శాంతి కలగాలంటే.. లోభాన్ని వదులుకోవడమే మార్గం. అదే విదురుడు చెప్పింది.


- విద్వాన్‌ వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-09-04T09:09:25+05:30 IST