ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడానికి కారణం ఇదేనా...

ABN , First Publish Date - 2022-02-24T18:36:34+05:30 IST

ఉక్రెయిన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకున్నంత పనిచేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడానికి కారణం ఇదేనా...

ఉక్రెయిన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకున్నంత పనిచేశారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా  ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దూకుడు పెంచారు. గురువారం ఉదయం సైనిక చర్యలకు ఆదేశాలిస్తూ ప్రకటన చేయడంతో యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్ తూర్పు భాగంలో ఇప్పటివరకు రెండు భూభాగాలను స్వతంత్ర్య భూభాగాలుగా ప్రకటించిన రష్యా.. అక్కడినుంచే ఉక్రెయిన్ రాజధానిపై దాడులు చేయడానికి సన్నద్ధమవుతోంది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లో ఉన్న తిరుగుబాటుదారుల సాయంతో, రష్యా సానుభూతిపరుల ద్వారా సైనిక చర్యను ముందుకు తీసుకువెళ్లాలని రష్యా భావిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం క్రిమియాను ఏ విధంగా స్వాధీనం చేసుకుందో.. ఇప్పుడు ఉక్రెయిన్‌ కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. యూరోపియన్ భూభాగంలో రష్యా తన ప్రాబల్యం పెంచుకోవడం.. అలాగే నల్ల సముద్రం, అదే విధంగా చమురుపై ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు రష్యా ఈ చర్యలకు పూనుకుంది.


అంతేకాకుండా ఉక్రెయిన్ నాటోలో చేరకుండా చేయడం.. ఉక్రెయిన్ నాటోలో చేరితే దాని ప్రభావం రష్యాలో పడుతుంది. అందుకే ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యా మొదటి నుంచి భావిస్తోంది. అయితే ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడంలేదు. రష్యా దాడులను దీటుగా తిప్పికొట్టాలని భావిస్తోంది. ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించింది. తూర్పు ప్రాంతంలో రష్యా దళాలు, తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమైంది. కాగా ఐక్యరాజ్య సమితి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పుతిన్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. 

Updated Date - 2022-02-24T18:36:34+05:30 IST