Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే..

ఆంధ్రజ్యోతి(27-04-2020)

ప్రశ్న: నాకు ఇరవై ఏళ్లు. హిమోగ్లోబిన్‌ ఎప్పుడూ తక్కువగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారమేమిటి?

- హరికృష్ణ, తిరుపతి 


డాక్టర్ సమాధానం: రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడం అనేది ముఖ్యంగా మూడు రకాల కారణాల వల్ల కావచ్చు - శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్యసమస్య వల్ల ఎక్కువగా రక్తం పోవడం. ఎర్రరక్త కణాలు తగినన్ని ఉత్పత్తి కాకపోవడానికి తగినంత ఐరన్‌ లేకపోవడం; థైరాయిడ్‌, కిడ్నీలు లేదా కాలేయ సమస్య ఉండడం; బి- 12, ఫోలిక్‌ ఆసిడ్‌ లాంటి విటమిన్ల లోపం కారణాలు కావచ్చు.


ఎక్కువ ఎర్రరక్త కణాలు నశించిపోవడానికి క్లోమపు వాపు, సికిల్‌ సెల్‌ ఎనీమియా, థలసీమియా మొదలైనవి కారణం కావచ్చు. అల్సర్లు, హెమరాయిడ్స్‌ ఏదైనా దెబ్బ లేదా పుండు నుండి రక్తం పోవడం మొదలైన కారణాల వల్ల కూడా హిమోగ్లోబిన్‌ తగ్గుతుంది. ఆహారం సరిగా తీసుకున్నా హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉందంటే ముందుగా వైద్యులను సంప్రదించి సరైన కారణాన్ని నిర్ధారించుకోవాలి. ఒకవేళ సమస్య పోషకాహార లోపం వల్ల వచ్చినదైతే హిమోగ్లోబిన్‌ బాగా తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఆహార మార్పులతో పెంచడం సాధ్యం కాదు. మందులు వాడాలి. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే హిమోగ్లోబిన్‌  స్థిరపడేలా చూసుకోవచ్చు. దీని కోసం ఐరన్‌ అధికంగా ఉండే ఆహారం మంచిది. కోడి, చేప లాంటివి వారానికి మూడు సార్లు తీసుకుంటే తగినంత ఐరన్‌ లభిస్తుంది. శాకాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్‌, చిక్కుళ్లు మొదలైన గింజలను తీసుకోవాలి. ఇంకా ప్రతి పూటా తోటకూర, పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు తప్పనిసరి. విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లను లేదా పండ్ల రసాలను తీసుకోవాలి.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

 [email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...