మెట్రో నగరాల్లో రియల్టీ జోరు

ABN , First Publish Date - 2022-10-05T09:14:25+05:30 IST

రియల్టీ కొవిడ్‌ కష్టాల నుంచి పూర్తిగా బయట పడింది. గత తొమ్మిది నెలల్లో (జనవరి-సెప్టెంబరు, 2022) హైదరాబాద్‌తో సహా ఏడు ప్రధాన నగరాల్లో పెరిగిన ఇళ్ల

మెట్రో నగరాల్లో రియల్టీ జోరు

 87 శాతం పెరిగిన అమ్మకాలు

అగ్రస్థానంలో హైదరాబాద్‌


న్యూఢిల్లీ : రియల్టీ కొవిడ్‌ కష్టాల నుంచి పూర్తిగా బయట పడింది. గత తొమ్మిది నెలల్లో (జనవరి-సెప్టెంబరు, 2022) హైదరాబాద్‌తో సహా ఏడు ప్రధాన నగరాల్లో పెరిగిన ఇళ్ల అమ్మకాలే ఇందుకు సాక్ష్యం. ఈ తొమ్మిది నెలల్లో ఈ నగరాల్లో 2,72,709 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 87 శాతం ఎక్కువ. కొవిడ్‌కు ముందున్న 2019 సంవత్సరం మొత్తానికి అమ్ముడైన 2,61,358 ఇళ్లతో పోల్చినా, గత తొమ్మిది నెలల్లో ఈ ఏడు ప్రధాన నగరాల్లో ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయి. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకరేజి సంస్థ అనరాక్‌ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడు ప్రధాన నగరాల్లో గత తొమ్మిది నెలల్లో ఇళ్ల ధరలు కూడా 10 శాతం పెరిగాయి. 


టాప్‌గేర్‌లో హైదరాబాద్‌ : ప్రస్తుతం హైదరాబాద్‌, కోల్‌కతా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లు మరింత జోరు మీద ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య ఈ రెండు మెట్రో నగరాల్లో ఇళ్ల అమ్మకాలు  రెట్టింపయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో 14,376 ఇళ్లు  అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరం జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో ఇది 35,980 ఇళ్లకు చేరింది. కోల్‌కతాల్లోనూ ఇదే వృద్ధిరేటు కొనసాగింది. ఈ కాలంలో అక్కడ ఇళ్ల అమ్మకాలు 7,415 నుంచి 15,743కి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణె, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాలు 57 నుంచి 81 శాతం వరకు పెరిగాయి. 


కలిసొచ్చిన అంశాలు: 

  • కొవిడ్‌ తర్వాత సొంతింతిపై పెరిగిన మక్కువ.
  • పదేళ్ల కనిష్ఠ స్థాయిలో వడ్డీ రేట్లు
  • కొన్ని రాష్ట్రాలు స్టాంప్‌ డ్యూటీ తగ్గించడం.
  • బిల్డర్ల నుంచి ఆకర్షణీయ ఆఫర్లు
  •  కొవిడ్‌తో కొనుగోళ్లను పక్కన పెట్టిన వ్యక్తులు కొనుగోళ్లకు దిగడం.

Updated Date - 2022-10-05T09:14:25+05:30 IST