అసైన్డ్‌ భూములపై రియల్టర్ల కన్ను

ABN , First Publish Date - 2022-04-27T04:30:14+05:30 IST

మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామంలో

అసైన్డ్‌ భూములపై రియల్టర్ల కన్ను
మొండిగౌరెల్లిలోని అసైన్డ్‌ భూములు

  • మొండిగౌరెల్లిలో కొనుగోలు చేసేందుకు యత్నం
  • ఎకరం భూమికి రూ.17లక్షలు
  • రిజిస్ర్టేషన్‌ సంగతి మేము చూసుకుంటామంటున్న వ్యాపారులు
  • భూములు అమ్మితే చర్యలు తీసుకుంటాం : యాచారం తహసీల్దార్‌


యాచారం, ఏప్రిల్‌ 26 : మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఉన్న అసైన్డ్‌భూములపై రియల్టర్ల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా భూములు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎకరానికి రూ.17లక్షలకు కొంటామని రైతులకు ఆశ చూపుతూ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు క్రయవిక్రయాలకు అవకాశం లేని అసైన్డ్‌ భూములను ఎందుకు కొంటున్నారో ఎవరికీ తెలియడం లేదు. అసైన్డ్‌ భూములను కొని రిజిస్ర్టేషన్‌ ఎలా చేసుకుంటారని రైతులు అడిగితే.. అదంతా మేము చూసుకుంటామని రియల్టర్లు సమాధానమిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు రాకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మొండిగౌరెల్లిలో సర్వే నెంబర్‌19లో 575ఎకరాల 30 గుంటలు, సర్వే నెంబర్‌ 68లో 788ఎకరాల 20 గుంటలు, సర్వేనెంబర్‌ 127లో 122ఎకరాల 22గుంటల అసైన్డ్‌ భూములున్నాయి. వీటిని కొనుగోలు చేయాలని నగరానికి చెందిన రియల్టర్లు చూస్తున్నారు. రైతులు ఈ భూములను రియల్టర్లకు విక్రయించడం కోసం గ్రామానికి చెం దిన కొందరు వ్యక్తులు ముందుండి వ్యవహారం నడిపిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసైన్డ్‌ భూములు క్రయవిక్రయాలకు తావులేదని ఎవరైనా రైతులు నిలదీస్తే.. వారికి అదనంగా మరో రూ.10వేలు ఇస్తున్నారు. కేవలం మీరు రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సంతకాలు పెడితే చాలు.. అంతా తామే చూసుకుంటామని రియల్టర్లు నమ్మిస్తున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులను నయానభయాన ఒప్పించి భూములను విక్రయించేలా పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంతమంది రైతులకు టోకన్‌ డబ్బు కూడా ముట్టినట్లు గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ భూముల క్రయవిక్రయాలపై ఇటీవల జరిగిన గ్రామసభలో కూడా చర్చ జరిగింది. భూములు క్రయవిక్రయాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై సర్పంచ్‌ బి.కృష్ణ వద్ద ప్రస్తావించగా..గ్రామసభలో చర్చకు వచ్చిందన్నారు. ఈ భూములు క్రయవిక్రయాలు జరగరాదన్నారు. ఒకవేళ అలా చేస్తే ప్రభుత్వం పీవోటీ కింద తీసుకుంటుందన్నారు. 


అసైన్డ్‌ భూములు అమ్మితే చర్యలు 

మొండిగౌరెల్లి గ్రామంలో అసైన్డ్‌ భూములు క్రయవిక్రయాలు జరిపితే తగు చర్యలు తీసుకుంటాం. ఈ భూములపై ప్రభుత్వానికి అన్ని హక్కులున్నాయి. అసైన్డ్‌భూములకు రిజిస్ర్టేషన్‌ చేసే అధికారం మాకు లేదు. ఈ భూములను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు ఎప్పుడైనా తీసుకునే అధికారముంటుంది. అందుకే క్రయ విక్రయాలు జరపరాదు. 

- మహమూద్‌ అలీ, యాచారం తహసీల్దారు



Updated Date - 2022-04-27T04:30:14+05:30 IST