రియల్టర్‌ భూ కబ్జా

ABN , First Publish Date - 2022-05-19T06:31:31+05:30 IST

మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దర్జాగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు.

రియల్టర్‌ భూ కబ్జా
గెడ్డ వాగును కబ్జా చేసి మట్టితో కప్పేసిన దృశ్యం

గెడ్డవాగులో అర ఎకరాకుపైగా ఆక్రమణ

యంత్రాలతో తుప్పలు తొలగించి, మట్టితో కప్పివేత 

రెవెన్యూ ఉద్యోగి అండదండలు

ఆక్రమించిన భూమి విలువ రూ.50 లక్షలకుపైమాటే

హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకున్న సిబ్బంది


పరవాడ, మే 18: మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దర్జాగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. చివరకు గెడ్డలు, వాగులను సైతం ఆక్రమించేస్తున్నారు. తాజాగా భరణికం రెవెన్యూ పరిధిలోని పెదమొల్లేటి గెడ్డలో సుమారు అర ఎకరా భూమిని ఓ రియల్టర్‌ ఆక్రమించుకుని యంత్రాలతో చదును చేశాడు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

భరణికం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 64లో 2.41 ఎకరాల విస్తీర్ణంలో గెడ్డవాగు ఉంది. దీనిని స్థానికులు పెదమొల్లేటి గెడ్డగా పిలుస్తుంటారు. దీనికి ఆనుకొని ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జిరాయితీ భూమిని కొనుగోలు చేశాడు. ఇటీవల ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాడు. ఈ సమయంలో ప్రహరీ గోడకు ఆనుకుని వున్న గెడ్డపై అతని కళ్లు పడ్డాయి. అనుకున్నదే తడవుగా వాగులో ఉన్న చెట్లు, ముళ్లపొదలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించి, అర ఎకరా మేర ఎత్తు పల్లాలను సరిచేయించి, మట్టితో కప్పివేయించాడు. ప్రస్తుతం ఇక్కడ వున్న మార్కెట్‌ విలువ ప్రకారం కబ్జా చేసిన స్థలం రూ.50 లక్షలకుపైగా వుంటుందని స్థానికులు చెబుతున్నారు. గెడ్డ ఆక్రమణ కారణంగా పెదచెరువులోకి నీరు వచ్చే అవకాశం వుండదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అండదండలతోనే రియల్టర్‌ భూకబ్జాకు పాల్పడినట్టు తెలిసింది.  

మొక్కుబడి చర్యలు

గెడ్డను రియల్టర్‌ కబ్జా చేసిన విషయాన్ని స్థానిక విలేఖరులు బుధవారం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వీఆర్వో, సిబ్బంది సాయంత్రం అక్కడకు వెళ్లి పరిశీలించారు. రియల్టర్‌ చదును చేసిన స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప గెడ్డను యథాస్థితికి తీసుకొచ్చే చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని ఆర్‌ఐ శ్రీలేఖ వద్ద ప్రస్తావించగా..గురువారం గెడ్డ స్థలాన్ని పరిశీలించి సర్వే చేస్తామని, సరిహద్దులు గుర్తించి అవసరమైతే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 


Updated Date - 2022-05-19T06:31:31+05:30 IST