నిజంగానే, నిజంగానే... మంచిరోజులు వస్తాయా?

ABN , First Publish Date - 2022-04-28T09:47:48+05:30 IST

ఒకచల్లటి మాట చెప్పారు ప్రధానమంత్రి మోదీ. మీ పెద్దలు పడిన కష్టాలు మీరు పడకుండా నేను చూస్తాను అని జమ్మూకశ్మీర్ యువతకు ఆయన భరోసా ఇచ్చారు. దేశమంతటికీ అటువంటి ఆశ అవసరమే కానీ, జమ్మూకశ్మీర్‌కు మరింత ఎక్కువ అవసరం...

నిజంగానే, నిజంగానే... మంచిరోజులు వస్తాయా?

ఒకచల్లటి మాట చెప్పారు ప్రధానమంత్రి మోదీ. మీ పెద్దలు పడిన కష్టాలు మీరు పడకుండా నేను చూస్తాను అని జమ్మూకశ్మీర్ యువతకు ఆయన భరోసా ఇచ్చారు. దేశమంతటికీ అటువంటి ఆశ అవసరమే కానీ, జమ్మూకశ్మీర్‌కు మరింత ఎక్కువ అవసరం, అత్యవసరం. పెద్దలు అని ఒక్క మాటలో సరిపుచ్చలేదాయన. మీ తండ్రులూ తల్లులూ తాతలూ నానమ్మలూ పడ్డ కష్టాలు అని వివరంగా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు తరలివస్తున్న అభివృద్ధిని, పెట్టుబడులను ఎంతో పరవశంతో ప్రస్తావిస్తూ, కష్టాలకు ఇక చెల్లు అని చెప్పినట్టు అనిపిస్తుంది కానీ, ఆయన ఇవ్వదలచుకున్న హామీకి అంతకు మించిన అన్వయం ఉన్నది. జమ్మూకశ్మీర్‌కు, ముఖ్యంగా కశ్మీర్‌కు ‘పెద్దలు పడిన కష్టాలు’ అన్న మాటలకు ఎంతో లోతైన, రక్తసిక్తమైన, దయనీయమైన అర్థం ఉన్నది. ఆ కష్టాలు పెద్దలు మాత్రమే పడినవి కాదు, వర్తమానంలోనూ కొనసాగుతున్నవి. మాట చల్లగా ఉంటే సరిపోదు, వెచ్చటి మానవీయ స్పర్శ లోపిస్తే ఆశ ఒక ఎండమావిగా మిగులుతుంది.


కష్టాలలో ఉన్న ప్రజలకు ఆశ కల్పించడం పాలకుల బాధ్యతలలో ఒకటి. ప్రభుత్వాలే ఆ కష్టాలకు కారణమయినా సరే, పాలకులు వాటి నివృత్తి గురించి ప్రయత్నించాలి. కనీసం మాట్లాడాలి. తాము కొందరికి చెందినవారయినా సరే, అందరి కోసం మాట్లాడాలి. లోకం కోసమయినా అట్లా వ్యవహరించాలి. అటల్ బిహారీ వాజపేయి రెండు దశాబ్దాల కిందట గుజరాత్ హింసాకాండ సందర్భంగా ప్రస్తావించిన ‘రాజధర్మం’ అంటే అదే. అప్పట్లో అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దగా ఆ హితవును పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు ప్రధాని హోదాలో జమ్మూకశ్మీర్ యువకులకు ఒక ఆశ ఇవ్వాలని, దానిని తాను నమ్మకంగా ఇవ్వగలనని నరేంద్రమోదీ అనుకోవడం ఆహ్వానించదగినది. కానీ, ఆ వాగ్దానంలో నిబద్ధత ధ్వనిస్తున్నదా? వాస్తవికత ముందు అది పరీక్షకు నిలబడుతుందా?


సుమారు రెండున్నరేండ్ల కిందట ప్రతిపత్తిని మార్చివేసిన తరువాత, విభజితమైన, కేంద్రపాలిత రాష్ట్రంగా మారిన జమ్మూకశ్మీర్‌లో ప్రధానమంత్రి అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా ఆయన ఒకరోజు పర్యటన జమ్మూలోనే ఎందుకు జరిగింది, కశ్మీర్‌కు ఎందుకు వెళ్లలేకపోయారు వంటి ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉంటాయి. అక్కడ ‘సాధారణ’ పరిస్థితులు లేవని ప్రభుత్వ పెద్దలూ, అధికారులే రోజూ ఏదో ఒక సందర్భంలో చెబుతూ ఉంటారు. జమ్మూలోనే ప్రధాని సభ జరిగిన చోటుకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక పోలీసు అధికారి హత్య జరిగింది. ఆ మరునాడు ఇద్దరు మిలిటెంట్ల ఎన్‌కౌంటరూ జరిగింది. జమ్మూలోనే పరిస్థితి ఇలా ఉండగా, కశ్మీర్ లోయలో వలసకార్మికులపై మిలిటెంట్ల దాడులు, భద్రతాదళాల ఎన్‌కౌంటర్లు సాగుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 370ను మార్చివేయడంతో పాటే, కశ్మీర్ లోయలోని పార్లమెంటరీ రాజకీయశక్తులన్నిటిని నిర్బంధానికి లోనుచేయడం తెలిసిందే. ప్రజలకు ప్రభుత్వానికి కనీస సంబంధం కూడా లేకుండా చేసిన ఆ చర్య ప్రభావం ఇంకా కొనసాగుతోంది. పూర్వ ప్రతిపత్తిని సాధించడం అన్న డిమాండ్‌తో ఏర్పడిన కూటమి ఇటీవలి జిల్లామండలుల ఎన్నికలలో విజయం సాధించింది కానీ, త్వరలో ఆమోదం పొందనున్న డీలిమిటేషన్ ప్రక్రియ జమ్మూకశ్మీర్‌లో జనాభా ఆధారిత అధికార పొందికను తలకిందులు చేయబోతుండడంతో కశ్మీర్ లోయలో నిస్పృహ వాతావరణం అలముకుని ఉన్నది. జమ్మూకశ్మీర్‌కు ఇంతకు మునుపు ఉన్న ప్రతిపత్తి కారణంగా ఉన్న అనేక రక్షణలు కూడా ముగిసిపోవడంతో, అక్కడి వనరులన్నీ బహిరంగ మార్కెట్లో అమ్మకానికి నిలబడ్డాయి. ఆ పెట్టుబడుల క్రమం మరింత ఉధృతం కావడానికి కావలసిన రహదారులు, విద్యుదుత్పత్తి వంటి మౌలిక వ్యవస్థల కల్పనలో ప్రభుత్వం తలమునకలై ఉన్నది. ఈ క్రమంలో ఎక్కడా స్థానిక ప్రజల ప్రమేయం లేదు. పెద్దల కష్టాలు పిల్లలకు ఉండవని నమ్మడానికి ఈ వాతావరణం అనుకూలిస్తుందా?


జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉదారంగా కల్పించిన సదుపాయం కాదని, భారతదేశంతో అనుసంధానం అయ్యే క్రమంలో ఏర్పడిన రక్షణ అని చరిత్ర చెబుతుంది. ఆ ప్రత్యేక ప్రతిపత్తి చాలదని, ప్రజాభిప్రాయం ద్వారా వ్యక్తమయ్యే అభీష్టం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తు ఉండాలని కశ్మీర్ రాజకీయవర్గాలు భావించాయి. భారతదేశంతో కొనసాగడమే మంచిదని, కాకపోతే, మరిన్ని అధికారాలు కావాలని మరి కొందరు భావించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సవ్యంగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించాయని చెప్పలేము. నెహ్రూ, ఇందిర, రాజీవ్, వి.పి.సింగ్, పి.వి ప్రభుత్వాలు అన్నీ అక్కడి ప్రజలలో అవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలే తీసుకున్నాయి. సాయుధ పోరాటవాదులు, ప్రభుత్వాలు, ఎన్నికల రాజకీయవాదులు, వేర్పాటువాదులు, స్వతంత్రవాదులు, స్వతంత్రప్రతిపత్తి వాదులు, విలీనవాదులు.. ఎవరి రాజకీయ లక్ష్యాల కోసం వారు ప్రయత్నాలు చేశారు. పోరాటాలు చేశారు. వీరితో పెద్దగా నిమిత్తం లేని సాధారణ ప్రజానీకం కూడా ఆ క్రమంలో బాధితులయ్యారు. సమాజ జీవితమే సంక్షుభితమయ్యింది. భారతీయ విలువలు, సంస్కారం తలదించుకోవలసిన పరిణామాలనేకం అక్కడ జరిగాయి. జాతీయోద్యమ ఆదర్శాలనేకం అక్కడ అవనతం అయ్యాయి. 


చారిత్రక వివాదాలతో, సంఘర్షణలతో బాధితురాలైన జమ్మూకశ్మీర్‌ది ఒక మానవీయ విషాదం. డెబ్బైఏండ్ల చరిత్ర పక్కనబెట్టినా, మూడు దశాబ్దాలుగా అక్కడి నేల లక్ష అసహజ మరణాలను చూసింది. ఆరేడువేలమంది భద్రతాదళాలు, పోలీసులు, పాతిక ముప్పైవేల మంది మిలిటెంట్లు, వేలాది మంది సాధారణ పౌరులు కశ్మీర్ హింసాకాండలో మరణించారు. ఇక, లెక్కతేలని మరణాలు, అదృశ్యాలు, అత్యాచారాలు అసంఖ్యాకం. రకరకాల ప్రభుత్వాలు వివిధ దశలలో ఒక్కోసారి పూర్తి సైనికవాద పరిష్కారాన్ని, ఒక్కోసారి పాక్షిక ప్రజాస్వామిక మార్గాలను ప్రయత్నించాయి. అణచివేత విధానాలను కొనసాగించినప్పటికీ, ప్రజలకు భాగస్వామ్యం ఉండే రాజకీయ ప్రక్రియలోనే అంతిమ పరిష్కారం అన్నది ప్రభుత్వాలు అప్పుడప్పుడు చెబుతుండేవి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా ప్రతిపత్తిహీనం చేయగలిగింది. ఆర్టికల్ 370 రద్దు అన్నది భారతీయ జనతాపార్టీ ఎప్పటినుంచో ప్రకటించుకున్న లక్ష్యం అయినప్పటికీ, ఆ పార్టీ ప్రభుత్వం అంత సాహసం చేయగలుగుతుందని ఎవరూ ఊహించలేదు. జమ్మూకశ్మీర్‌ను పూర్తిగా ‘అదుపు’లోకి తీసుకోవడానికి ఉద్దేశించిన వ్యూహం, భవిష్యత్ పర్యవసానాలు ఎట్లా ఉన్నప్పటికీ, తక్కిన దేశంలో పెరుగుతున్న తీవ్రజాతీయవాదం నేపథ్యంలో ప్రభుత్వ ‘ప్రతిష్ఠ’ పెరగడానికి ఉపయోగపడింది. కనీసం కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్రానికి ప్రతిపత్తిని మార్చండి, రాజకీయ ప్రక్రియ ప్రారంభించండి అని ప్రాధేయపడే పరిస్థితిలో అక్కడి రాజకీయవాదులు ఉన్నారు. ఇక సాధారణ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు. తమ స్వేచ్ఛలు మునుపెన్నడూ లేనంతగా అణగారిపోయి ఉన్నవేళ, ప్రధాని భరోసాను పరిహాసం అనుకుంటున్నారా? తమ రాజకీయ ఆలోచనలను, ఆకాంక్షలను అన్నిటిని విరమించుకుని, పూర్తి విధేయతలోకి వస్తే, మోదీ ప్రభుత్వం అందించే అభివృద్ధిని అందుకుని సుఖంగా సాధారణ జీవితం గడపవచ్చునని అనుకుంటారా? లేదా నిస్పృహలో పడి పూర్తి నిష్క్రియలోకి లేక మరింత మిలిటెన్సీలోకి వెడతారా? ఇటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఆశించే ఫలితాలను సాధించడం కష్టమని చారిత్రక అనుభవాలు చెబుతున్నాయి.


కశ్మీరీ ముస్లిములు, కశ్మీరీ పండిట్‌లు పరస్పరం శత్రువులు కారు. పరిస్థితులు వారిని వేర్వేరు పద్ధతులలో బాధితులను చేశాయి. ప్రజలలో భిన్నవర్గాలను పరస్పర శత్రువులుగా చిత్రించి, దాని ద్వారా లబ్ధిపొందాలనుకోవడం రాజకీయ నాయకులే కాదు, సినిమా నిర్మాతలూ మొదలుపెట్టారు. కశ్మీరీ పండిట్‌లు తిరిగి స్వప్రాంతాలకు వెళ్లడానికి ఏ దోహదమూ చేయని నాయకులు, ఒకరినొకరు శత్రువులుగా చూపించే సినిమాలకు ప్రచారకులుగా మారిపోయారు. కశ్మీర్లో మాత్రమే కాదు, దేశమంతటిలోనూ ఒక ప్రజావర్గంపై మరొక వర్గాన్ని ఉసికొల్పడం, ఒకరికొకరు హానికారకులన్నట్టుగా భావప్రచారం చేయడం పెరిగిపోయింది. అంతర్యుద్ధ ప్రమాదానికి దారితీసే ఈ ధోరణిని పాలకులు ప్రోత్సహించవచ్చునా? ప్రజల మధ్య వైరుధ్యాలు ఏర్పడినప్పుడు బాధ్యతాయుతమైన పాలకులు, తటస్థ స్థానంలో నిలబడి, ఉపశమనం కోసం సామరస్యం కోసం ప్రయత్నించాలి. అంతే తప్ప ఒకరి తరఫున ఒకరిపై ఆయుధాలనో వాహనాలనో ఝళిపించకూడదు. కశ్మీర్ వాస్తవికతపై ఒక అవాస్తవమైన, ప్రమాదకరమైన అవగాహన కలిగించడానికి ప్రోత్సాహం ఇస్తూ, అక్కడి ప్రజలకు ఆశ ఎట్లా కలిగించగలరు? కశ్మీర్ పండిట్లకు అయినా, ముస్లిమ్‌లకు అయినా వారి పెద్దలు పడిన కష్టాలు పిల్లలకు సంక్రమించకూడదంటే, అక్కడ ఒక సయోధ్య వాతావరణం ఉండాలి. వారి రాజకీయ ఎంపికలు వారి చేతిలో ఉండాలి. అభివృద్ధి అయినా, ప్రజాస్వామిక ప్రక్రియలయినా బుల్‌డోజర్ల మాదిరి ఉండకూడదు, ప్రజలను కలుపుకుని పోయేదిగా ఉండాలి.


ఇచ్చిన వారు నెరవేరుస్తారో లేదో, జనం నమ్ముతారో లేదో కానీ, ఆశ అంటూ ఒకటుండాలి. ఆశారాహిత్యం కంటె ఆశాభంగం మేలు.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-04-28T09:47:48+05:30 IST