రిలీజ్‌ డేటు.. ఇంకా డౌటు!

ABN , First Publish Date - 2022-01-23T07:11:31+05:30 IST

ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో... సరైన సమయంలో విడుదల చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో తప్పు చేస్తే - ఎంత కష్టపడి సినిమా తీసినా ప్రయోజనం ఉండదు. ఈ విషయం దర్శక నిర్మాతలకు బాగా తెలుసు...

రిలీజ్‌ డేటు.. ఇంకా డౌటు!

 గందరగోళంలో టాలీవుడ్‌

ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో... సరైన సమయంలో విడుదల చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో తప్పు చేస్తే - ఎంత కష్టపడి సినిమా తీసినా ప్రయోజనం ఉండదు. ఈ విషయం దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే రిలీజ్‌ డేట్‌ విషయంలో పక్కా క్లారిటీతో ఉంటారు. ఓ డేట్‌ ఫిక్సయితే, ఆ సమయానికి సినిమా రావాల్సిందే. లేదంటే ఉహించని కష్టనష్టాలు మీద పడతాయి. కానీ. ఈమధ్య కాలంలో అలా జరగడం లేదు. ‘విడుదల వాయిదా’ అనేది సర్వ సాధారణమైన విషయం అయిపోయింది. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలకు. కరోనా వల్ల ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. వాటి కొత్త రిలీజ్‌ డేట్ల విషయంలో చాలా గందరగోళం ఉంది. టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ సినిమా వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.


సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’లు వాయిదా పడ్డాయి. ‘భీమ్లా నాయక్‌’దీ అదే దారి. ఇప్పుడు ఈ సినిమాలు ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. ఈ ప్రభావం మిగిలిన అన్ని సినిమాలపై పడుతోంది. ‘సర్కారువారి పాట’, ‘ఆచార్య’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలూ వీటివల్ల కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ని మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ ప్రకటన మరింత గందరగోళానికి దారి తీసినట్టైంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కి ముందూ వెనుక రావాల్సిన చిత్రాలకు విడుదల తేదీ ఎప్పుడు వేసుకోవాలో తెలియని సందిగ్థం నెలకొంది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మార్చి 18న వస్తే.. ఒకలెక్క. రాకపోతే మరో లెక్క. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కంటే 15 రోజులు ముందే రావాలన్నది ‘రాధే శ్యామ్‌’ వ్యూహం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదలైన రెండు వారాల తరవాత రావాలన్నది ‘ఆచార్య’ ప్లాన్‌. అంటే.. ఈ రెండు చిత్రాల జాతకం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ విడుదల తేదీపై ఆధార పడి ఉందన్నమాట.


‘ఆచార్య’ ఫిబ్రవరి 4న విడుదల కావాల్సివుంది. అయితే ఆ తరవాత తేదీ మార్చారు. ఏప్రిల్‌ 1న తీసుకొస్తామని ప్రకటించారు. అదే రోజున ‘సర్కారువారి పాట’ కూడా రావాల్సివుంది. ‘ఆచార్య’ ప్రకటనతో ‘సర్కారు...’ విడుదల డైలామాలో పడింది. ఇప్పుడు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఏప్రిల్‌ 28న వస్తే.. ‘ఆచార్య’ కూడా వాయిదా పడుతుందని సమాచారం. ఏప్రిల్‌ 28న ‘ఎఫ్‌ 3’ని విడుదల చేస్తామని దిల్‌ రాజు ఇది వరకే ప్రకటించారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వస్తే ఆ సినిమా ముందుకో వెనక్కో వెళ్లాల్సివస్తుంది. ఫిబ్రవరి 25న రావాలనుకున్న ‘భీమ్లా నాయక్‌’కి సైతం లైన్‌ ఇంకా క్లియర్‌ కాలేదు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఇంకా క్లారిటీ రావాల్సివుంది.


‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’ చిత్రాల విడుదల వ్యవహారం అంత ఆషామాషీగా తేలేటట్టు  కనిపించడం లేదు. ఎందుకంటే ఇవి రెండూ పాన్‌ ఇండియా సినిమాలు. దేశ వ్యాప్తంగా ధియేటర్లు అందుబాటులో ఉన్నప్పుడు, అక్కడ పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే వీటిని విడుదల చేయాల్సివుంటుంది. ముఖ్యంగా నార్త్‌ మార్కెట్‌ చాలా కీలకం. ఈ రెండు చిత్రాలూ బాలీవుడ్‌ నుంచి భారీ వసూళ్లని ఆశిస్తున్నాయి. నార్త్‌లో పరిస్థితిని బట్టే.. ఈ రెండు చిత్రాల విడుదల తేదీలు ఆధారపడి ఉంటాయి. ఇది వరకు సినిమాల విడుదల తేదీల విషయంలో ఏమైనా వివాదాలు వస్తే, ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ వాటిని పరిష్కరించేది. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కాకుండా వాటి మధ్య సమన్వయం కుదిర్చేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే సినిమాలు వాయిదాల బాట పడుతున్నాయి. అందువల్ల నిర్మాతలకు పరోక్షంగా చాలా నష్టం వాటిల్లుతోంది. వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు సినిమాల్ని విడుదల చేసేసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో నిర్మాతలపై ఎవరూ ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సంక్రాంతి సమయంలో భీమ్లా నాయక్‌ నిర్మాతలతో మాట్లాడి, ఆ సినిమాని పాన్‌ ఇండియా చిత్రాలైన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’ల కోసం వాయిదా వేయించారు. వాటి కోసం భీమ్లా వెనక్కి వెళ్లింది. కానీ అనుకోని రీతిలో ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్‌లు కూడా వాయిదా పడ్డాయి. పరిస్థితులు అన్నీ అనుకూలించి, మళ్లీ థియేటర్ల దగ్గర పూర్వపు స్ధితి ఎప్పుడొస్తుందా అని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశం వస్తే మాత్రం ఎవ్వరూ ఆగరు. వరుసగా రిలీజ్‌ డేట్లు ప్రకటించుకుంటూ వెళ్తారు. అలాంటి సమయంలో.. రెండు సినిమాల మధ్య క్లాష్‌ వస్తే, గిల్డ్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తమ్మీద విడుదల తేదీల విషయంలో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్‌ల విడుదల విషయంలో ఓ క్లారిటీ వస్తే తప్ప ఈ సమస్య ఓ కొలిక్కిరాదు.





Updated Date - 2022-01-23T07:11:31+05:30 IST