రియల్‌ మోసాలు

ABN , First Publish Date - 2022-05-20T06:44:36+05:30 IST

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓ ప్లాట్‌ కొనుగోలు చేసి అందులో సొంత ఇళ్లు నిర్మించుకోవాలని సామన్య, మధ్య తరగతి ప్రజల అమాయకత్వాన్ని కొందరు రియల్‌ వ్యాపారులు,బ్రోకర్లు ఆసరాగా చేసుకుంటున్నారు.

రియల్‌ మోసాలు
పట్టణ శివారులోని ఓ ప్రాంతంలో వెంచర్‌ కోసం భూమిని చదును చేసిన దృశ్యాలు

- వెంచర్ల మాటున రియల్‌ వ్యాపారుల దందా

- లే-అవుట్‌ లేకుండానే ప్లాట్ల విక్రయాలు

- స్కీమ్‌ల పేరిట ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగడుతున్న బ్రోకర్లు

- ఆకర్షణీయమైన బ్రోచర్లపైనే ప్లాట్లు చూపిస్తుంటారు

- లక్షల్లో డబ్బులు వసూలు చేసి వెంచర్లలో మాత్రం ప్లాట్లు చూపించరు

- కనీస సౌకర్యాలు కరువు.. నష్టపోతున్న కొనుగోలుదారులు

- స్నేహపూరి కాలనీ, అబ్దుల్లాపూర్‌లోని వెంచర్‌లో అక్రమాలు

- ఈ వెంచర్‌లో 500ల మందికి పైగా ప్లాట్లు ఇస్తామంటూ స్కీంలతో రూ.కోట్ల వసూళ్లు

- ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండ ఉన్నట్లు ఆరోపణలు

- అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు


కామారెడ్డి, మే 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓ ప్లాట్‌ కొనుగోలు చేసి అందులో సొంత ఇళ్లు నిర్మించుకోవాలని సామన్య, మధ్య తరగతి ప్రజల అమాయకత్వాన్ని కొందరు రియల్‌ వ్యాపారులు,బ్రోకర్లు ఆసరాగా చేసుకుంటున్నారు. ప్లాట్ల విక్రయాల్లో స్కీంలను పెట్టి  తక్కువ ధరకే ప్లాట్‌ ఇస్తామని నెలనెల వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి వెంచర్‌ చేయకుండానే కేవలం మ్యాప్‌ పైనే ప్లాట్లను చూపిస్తూ నమ్మబలికిస్తూ రూ. కోట్లలో వసూలు చేస్తూ కొందరు రియల్‌ వ్యాపారులు, బ్రోకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా లేఅవుట్‌లు తీసుకోకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండానే అమాయక ప్రజలకు ప్లాట్లను అంటగడుతున్నారు. ఈ రియల్‌ మోసాలు కామారెడ్డి పట్టణ శివారుల్లోని దేవునిపల్లి, ఇల్చిపూర్‌, టెక్రియాల్‌, లింగాపూర్‌ శివారు, స్నేహపురి కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్‌, ప్రభుత్వ అసైన్డ్‌మెంట్‌ భూముల్లో అక్రమ వెంచర్లు చేస్తూ రియల్‌ వ్యాపారులు భూ దందా సాగిస్తున్నారు. కామారెడ్డిలోనే కాకుండా  జిల్లా అంతటా రియల్‌ వ్యాపారుల దందా కొనసాగుతోంది. ప్రధానంగా 44వ జాతీయ రహదారి వెంట ఉన్న మండలాల్లో, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోనూ లే-అవుట్లు లేకుండానే పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ అక్రమ వెంచర్ల ఏర్పాటు సంబంధిత అధికారులకు తెలిసినా మామూలుగానే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు

జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌ వ్యాపారులు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేస్తూ లే అవుట్‌ ప్లాట్లు ఆమాయక ప్రజలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతోంది. జిల్లాలో ముఖ్యంగా కామారెడ్డి మండలంతో పాటు భిక్కనూరు, సదాశివనగర్‌, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పట్టణాల్లోనూ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో 87 వెంచర్లకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు సంబంధిత శాఖాధికారులు పేర్కొంటున్నారు. వెంచర్లు ఏర్పాటు చేయాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. నాలా అనుమతి కోసం సంబంధిత ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత మున్సిపల్‌, గ్రామ పంచాయతీ 10 శాతం భూమి రిజిస్ర్టేషన్‌ చేయించి మరో 40 శాతం భూమిని వెంచర్‌లో రోడ్లు, విద్యుద్ధీకరణ, మురుగు కాలువలు, నీటి ట్యాంకులు, కమ్యూనిటీహాళ్లకు కేటాయించాలి. అనంతరం మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌, గ్రామ పంచాయతీ సిఫార్సులతో డీటీసీపీవో (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆఫీసర్‌) అనుమతితో తిరిగి గ్రామ పంచాయతీల నుంచి ఎన్‌వోసీ పత్రం పొందాలి. ఇందుకు మున్సిపల్‌, గ్రామ పంచాయతీకి లే-అవుట్‌ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రియల్‌ వ్యాపారులు వెంచర్లు చేసే సమయంలో ప్రభుత్వానికి నయా పైసా కట్టకుండా, మున్సిపల్‌, గ్రామ పంచాయతీకి స్థలాన్ని వదలకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు చేసి విక్రయాలు చేస్తున్నారు. 

స్కీంల పేరిట ప్లాట్ల విక్రయాలు

కామారెడ్డి పట్టణ శివారులో గత 5 సంవత్సరాల నుంచి పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. పట్టణ శివారుల్లోనే కాకుండా 44వ జాతీయరహదారిపై కామారెడ్డి మండలం, భిక్కనూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్లలో ప్లాట్లను విక్రయించేందుకు రియల్‌ వ్యాపారులు, బ్రోకర్లు స్కీంలు పెట్టి అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. ఓ వెంచర్‌లో 150 గజాల ప్లాట్‌ను అమ్మాలంటే మొదట్లో రూ.2లక్షలు కడితే చాలు నెలనెల వాయిదా పద్ధతిలో మిగితావి చెల్లించేందుకు స్కీంలో చేరాలంటూ అమాయక ప్రజలను నమ్మిస్తున్నారు. వెంచర్‌ చేయకముందే అందమైన బ్రోచర్లతో మ్యాప్‌ను చూపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలా స్కీంలు, మ్యాప్‌లపైనే ప్లాట్లను రియల్‌ వ్యాపారులు అమాయకులకు అంటగడుతూ రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. రియల్‌ వ్యాపారులకు ఈ స్కీంలలో కొందరిని బ్రోకర్లుగా నియమించుకుని వారి చేత ప్లాట్లను విక్రయించేలా చేస్తున్నారు.

ఇల్చిపూర్‌, స్నేహపూరి కాలనీ, అబ్దుల్లాపూర్‌లోని వెంచర్లలో అక్రమాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో పట్టణం మరింత విస్తరించింది. శివారు కాలనీల్లోని వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. దీంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్‌ వ్యాపారులు ఈ ప్రాంతాల్లో జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించి కొందరు రియల్‌ వ్యాపారులు రాజకీయ నాయకులతో కలిసి వెంచర్లమాటున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ శివారుల్లోని ఇల్చిపూర్‌, స్నేహపురికాలనీ, అబ్దుల్లాపూర్‌లో ఇటీవల కొందరు వందల ఎకరాల్లో పట్టా, అసైన్‌మెంట్‌ భూముల్లో వెంచర్లు చేస్తున్నారు. అయితే మున్సిపల్‌, పంచాయతీశాఖల నుంచి ఎలాంటి లే అవుట్‌ అనుమతి తీసుకోకుండానే భూమిని చదును చేశారు. ఆ వెంచర్‌లో రహదారులు, డ్రైనేజీ, నీటి వసతి కల్పించకుండానే ప్లాట్లుగా ఏర్పాటు చేయకుండానే అమాయక ప్రజలకు కేవలం మ్యాప్‌పైనే స్కీంల పేరిట ప్లాట్లను అంటగట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వెంచర్లలో సుమారు 500 మందికి పైగా స్కీంలలో చేర్చుకుని లక్షల్లో వసూలు చేసి ఇప్పటి వరకు ప్లాట్లు చూపించడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. బ్రోకర్ల చేతిలో తాము మోసపోయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. 

నేతల అండదండలు

కామారెడ్డి పట్టణ శివారుల్లో కొన్ని వెంచర్లలో జరుగుతున్న రియల్‌ మోసాల్లో స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకుల అండదండలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇల్చిపూర్‌, స్నేహపూరి కాలనీ, అబ్దుల్లాపూర్‌లో వెలసిన అక్రమ వెంచర్లలో రియల్‌ వ్యాపారులతో పాటు కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేతల అండదండలతోనే ఎలాంటి అనుమతులు లేకుండా పట్టా, అసైన్‌మెంట్‌ భూముల్లో వెంచర్లను ఏర్పాటుచేస్తూ అమాయక ప్రజలకు అంటగడుతున్నారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. బ్రోకర్లు, రియల్‌ వ్యాపారుల చేత మోసపోయామని వారిని నిలదీస్తే నేతల చేత బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


నమ్మించి మోసం చేశారు

- పోశవ్వ, కుప్రియల్‌, సదాశివనగర్‌

 2014 సంవత్సరంలో తమకు నమ్మకస్తుడైన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మాటనమ్మి కామారెడ్డి పట్టణ శివారులో గల ఇల్చిపూర్‌ వద్ద సర్వే నెంబర్‌ 120లో 200 గజాల ప్లాట్‌ను రూ.6లక్షల 30వేలకు కొనుగోలు చేశాను .సదరు ఆర్‌ఎంపీ వైద్యుడు అంతానేను చూసుకుంటానని నమ్మించడంతో ప్లాట్‌ కొనుగోలు చేస్తే తీరా ఆ ప్లాట్‌ అసైన్డ్‌ భూమి అని అధికారులు తీసుకున్నారు. ఇదేంటని ప్రశ్నించి నాయకులు, అధికారుల వద్దకు వెళ్లినా ఎలాంటి న్యాయం జరగడం లేదు. తనను మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నా డబ్బులు నాకు వచ్చేలా చూడాలి.

Updated Date - 2022-05-20T06:44:36+05:30 IST