రియల్‌ రాజకీయం

ABN , First Publish Date - 2022-08-17T05:30:00+05:30 IST

నరసరావుపేట నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు తర్వాత నుంచి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటారు.

రియల్‌ రాజకీయం
ప్లాట్లు

నేతల స్థిరాస్తి వ్యాపారంలో కుదుపు

అధికార పార్టీ నేత వెంచర్‌పై టీడీపీ నేత ఫిర్యాదు

కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరింపచేయాలని ఒత్తిడి

స్పందించలేదని టీడీపీ వర్గీయుల వెంచర్‌లో రాళ్లు తొలగింపు

టీడీపీ అధిష్ఠానం వద్దకు చేరిన పిటిషన్‌ పంచాయితీ

ఇదీ నరసరావుపేటలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల తీరు


ఎన్నికల సమయంలోనే రాజకీయం.. ఆ తర్వాత వ్యాపారం.. ఇదీ నరసరావుపేటలో అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల తీరు. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇరు పార్టీల నాయకులు కలిసి చేసుకుంటూ ఉంటారు. అయితే వీరి మధ్య ఎందుకో ఇటీవల తేడా వచ్చింది. అంతే ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బ తీసేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. ఫిర్యాదులు.. కోర్టులో పిటిషన్‌.. హద్దు రాళ్లు తొలగింపులు.. నేతలపై ఒత్తిళ్లతో నరసరావుపేటలో రాజకీయం రసకందాయకంలో పడింది. అధికార పార్టీ నాయకులు కోర్టులో పిటిషన్‌ ఉపసంహరింప చేయాలని టీడీపీ నేతలపై ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఈ రియల్‌ పంచాయితీ టీడీపీ అధిష్ఠానం వద్దకు చేరింది. ఈ ఉదంతం అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు కలిసే చేసే స్థిరాస్తి వ్యాపారంపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే నాయకుల స్థిరాస్తి వ్యాపారం ఆధారపడి ఉందని స్థానికంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.  


నరసరావుపేట, ఆగస్టు 17: నరసరావుపేట నియోజకవర్గంలో పోలింగ్‌ రోజు తర్వాత నుంచి రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కొంత కాలంగా స్థిరాస్తి వ్యాపారాన్ని కలిసి చేసుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే అ పార్టీ నేతలు వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ జరుగుతున్న రాజకీయం ఇది. ఈ రీతిలో సాగుతున్న వ్యాపారంలో నేతల మధ్య తేడా వచ్చింది. వినుకొండ రోడ్డులోని అధికార పార్టీ ముఖ్య నాయకులదిగా ప్రచారంలో ఉన్న భారీ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో అసైన్డ్‌ భూమి ఉందని, కాల్వలు, డొంకలను ఆక్రమించారు.. చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.  అయితే  అధికారులు స్పందించక పోవడంతో టీడీపీ నేత ఒకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలో రియల్‌ వ్యాపారం సీన్‌ మారిపోయింది.  ఈ నేపథ్యంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలకు అధికార పార్టీ ముఖ్యులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. సదరు నేతలు పిటిషన్‌ వేసిన నేతతో చర్చలు జరిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవిందబాబు పిటిషన్‌ వేయమంటే తాను వేశాను.. ఆయనతో  మాట్లాడుకోవాలని ఆ నేత వారికి సూచించారు. పిటిషన్‌ ఉసంహరింప చేసే ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. దీంతో వెంచర్‌ వేసిన అధికార పార్టీ ముఖ్య నేతలు పిటిషన్‌ ఉపసంహరణ కోసం పురమాయించిన నేతలకు సంబంధించిన వెంచర్‌లోని రాళ్లను ఇటీవల అధికారుల చేత తొలగించారు. అంతేగాక అక్కడ అనఽధికార లేఅవుట్‌ అని బోర్డు పెట్టించారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతలు వేసిన వెంచర్‌, టీడీపీ వర్గీయుల పిటిషన్‌ వ్యవహారం ఆయా పార్టీల్లో పది రోజులుగా హాట్‌ టాఫిక్‌గా మారింది. కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరింప చేసేందుకు డాక్టర్‌ అరవిందబాబుపై కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన చేతిలో ఏమి లేదని పిటిషన్‌ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లానని నేతలకు అరవిందబాబు సమాధానం ఇచ్చినట్టు ప్రచారం. దీంతో ఇరకాటంలో పడ్డ కొందరు నేతలు అరవిందబాబును పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్టు పలువురు నేతలు తెలిపారు. అరవిందబాబుపై కూడా ఒత్తిడి పెంచినట్లు వారు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అధిష్ఠానం వద్దకు వెళ్లేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నట్టు సమాచారం. పిటిషన్‌ ఉపసంహరించక పోతే తాము స్థిరాస్తి వ్యాపారంలో నష్టపోతామని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్ళాలని సదరు నేతలు నిర్ణయించినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. అధికార పార్టీ ముఖ్య నేతల వెంచర్‌లో అవకతవకలు ఉన్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరిచుకోమని పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తుందో లేదో చూడాలి. పిటిషన్‌ నేపథ్యంలో అరవిందబాబుపై పార్టీ నేతల నుంచి ఒత్తిడి రోజురోజుకు పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. పిటిషన్‌ ఉపసంహరణపైనే ఇరు పార్టీల్లోని స్థిరాస్తి వ్యాపారులు దృష్టి సారించడం గమనార్హం. మొత్తం మీద నరసరావుపేట రాజకీయాన్ని కోర్టులో దాఖలైన పిటిషన్‌ ఏ దరికి చేరుస్తుందో చూడాలి. 

 

Updated Date - 2022-08-17T05:30:00+05:30 IST