రియల్‌ మాయ

ABN , First Publish Date - 2022-07-01T06:43:58+05:30 IST

నందికొట్కూరు పట్టణంలో, డివిజన్‌లోని మండలాల్లో రియల్‌ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడపడితే అక్కడ అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి.

రియల్‌ మాయ
నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రోడ్డులో అనుమతి లేకుండా వేసిన వెంచర్‌

విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు

ల్యాండ్‌ కన్వర్షన్‌ లేకుండానే ప్లాట్లు వేసి అమ్మేస్తున్న వైనం 

ప్రభుత్వ ఆదాయానికి గండి

చోద్యం చూస్తున్న రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు


నందికొట్కూరు, జూన్‌ 30 : నందికొట్కూరు పట్టణంలో, డివిజన్‌లోని మండలాల్లో రియల్‌ దందా జోరుగా సాగుతోంది. ఎక్కడపడితే అక్కడ అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకోకుండా... మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల ప్రమేయం లేకుండా ఇష్టానుసారంగా ప్లాట్ల దందా కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. సెంటు భూమి రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్ల దందా కొనసాగిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామ మాత్రంగా కొందరి వెంచర్లను టార్గెట్‌ చేసి వారి లేఅవుట్లలోని రాళ్లు తీసేస్తూ రోడ్లను తొలగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట భూముల్లో కూడా అనుమతి లేకుండా లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపడుతూ అధికారులకు వ్యాపారులు భారీగా ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు పట్టణం, మండలాల్లోని గ్రామాల్లో  అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా లేఅవుట్లు వెలుస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి లేఅవుట్లు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు. కొందరు వ్యక్తులు ప్లాట్లు వేసి నిర్మాణాలు ప్రారంభించారు. నందికొట్కూరు పట్టణంలో 26 అక్రమ  వెంచర్లు వేసినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేస్తున్న వెంచర్లతో కలిపి దాదాపు పట్టణంలో 40 అక్రమ వెంచర్లు ఉన్నట్లు తెలిసింది. అలాగే మిడుతూరు, జూపాడుబంగ్లా, నందికొట్కూరు మండలాల్లో కూడా అనుమతుల్లేకుండా వెంచర్లు వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు అక్రమంగా వెలుస్తున్నా  అధికారులు పట్టించుకోవపోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పట్టణంలో అక్రమంగా వెలుస్తున్న లేఅవుట్లను తొలగించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


 బ్లాక్‌ లిస్టులో పెట్టాం 


పట్టణంలో 26 అక్రమ వెంచర్లను గుర్తించాం. వెంచర్లలోని ప్లాట్లు రిజిస్టర్‌ కాకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టాం. కొన్ని వెంచర్లలోని రాళ్లు, రోడ్లు తొలగించాం. మిగతా వాటిని రెండో విడతలో తొలగిస్తాం. అక్రమ వెంచర్లు వేసిన వారు అనుమతుల కోసం మున్సిపాలిటీలో  దరఖాస్తు చేసుకోలేదు.

 

- బాల మద్దయ్య, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, నందికొట్కూరు పట్టణం


ల్యాండ్‌ కన్వర్షన్‌ తప్పనిసరి


వ్యవసాయ భూమిని లేఅవుట్‌ వేసి ప్లాట్లు అమ్ముకునేందుకు ముందుగా  పొలం రిజిస్టరు పత్రాలతో ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. 

రెవెన్యూ అధికారులు సర్వే చేసి సబ్‌ డివిజన్‌ చేసి జిల్లా అధికారులకు రిపోర్టు పంపుతారు. 

లేఅవుట్‌ వేసే భూమిని భూసార పరీక్షలు తప్పక చేయాల్సి ఉంటుంది. ఆ భూమి సాగుకు పనికి రాదు అని తేలితేనే ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకునేందుకు వీలుంటుంది.

లేఅవుట్‌ అప్రూవల్‌ అయితే ఎకరా భూమిలో రోడ్లకు 40శాతం, మున్సిపాలిటీకి 10శాతం భూమి వదిలి ప్లాట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరాలో 50సెంట్ల భూమి రోడ్లు, మున్సిపాలిటీకి పోతే 50 సెంట్లు భూమి మాత్రమే విక్రయించుకోవాలి. భూమి విలువను బట్టి 3శాతం ప్రభుత్వానికి చెల్లించాలి

మున్సిపాలిటీకీ దరఖాస్తు చేసుకుని మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌తో అనుమతి పొందాలి.

Updated Date - 2022-07-01T06:43:58+05:30 IST