రియల్‌ మాఫియా...?!

ABN , First Publish Date - 2022-05-07T05:42:14+05:30 IST

గుర్రంకొండ పట్టణంలో ఉన్న భూముల ధరలు మరెక్కడ లేవు. జిల్లా కేంద్రంలో కూడా లేని భూముల ధరల గుర్రంకొండలో ఉన్నాయి.

రియల్‌ మాఫియా...?!
గుర్రంకొండలో రియల్‌ వ్యాపారులు వేసిన లే అవుట్‌

కోట్లలో రియల్‌ వ్యాపారం 

లే అవుట్లకు అనుమతి నిల్‌

లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

చోద్యం చూస్తున్న అధికారులు


గుర్రంకొండ, మే 6: గుర్రంకొండ పట్టణంలో ఉన్న భూముల ధరలు మరెక్కడ లేవు. జిల్లా కేంద్రంలో కూడా లేని భూముల ధరల గుర్రంకొండలో ఉన్నాయి. గుర్రంకొండ చుట్టూ ఎక్కువ భాగం భూములు పురావస్తుశాఖ, ఇనాం, డీకేటీ భూములే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో పాత పట్టా భూములు చాలా తక్కువ. ఈ పాత పట్టా భూముల విలువ సెంటు లక్షల రూపాయలు పలుకొతోంది. దీంతో పట్టణం నడిబొడ్డున కుంట స్థలం కావాలంటే రూ.60లక్షల పైమాటే. పట్టణంలో ఉన్న భూములే చేతులు మారుతూ రోజు రోజుకు పెరుగుతూ సామాన్యులు కొనలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో అక్రమ లే అవుట్‌లు ఇష్టానుసారంగా పుట్టుకొస్తున్నాయి. ఈ లే అవుట్‌ల నిర్వాహకులు ఎక్కడా ప్రభుత్వ, పంచాయితీ నిబంధనలను పాటించడం లేదు. ఇదే అదునుగా భావించిన రియల్‌ వ్యాపారులు బ్రోకర్ల సాయంతో అనాధికార లే అవుట్‌లోని ప్లాట్‌లను గ్రామీణ, మధ్య తరగతి ప్రజలకు మాయమాటలు చెప్పి కట్టబెడుతున్నారు. అనుమతులేని లే అవుట్‌లో ప్లాట్‌లను కొన్న ప్రజలు రిజిస్ర్టేషన్‌లు కాకపోవడంతో తలలు పట్టుకొంటున్నారు.


రూ.50 కోట్లలో రియల్‌ వ్యాపారం...?!

గుర్రంకొండలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోట్లలో సాగుతోంది.  పట్టణంలో 20 నుంచి 30 లే అవుట్‌లు ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి వెళ్లే జీవన్‌తోపు రోడ్డు, నబీకాలనీ, పోలేరమ్మ వీధి, మదనపల్లె రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, సుంకరవాండ్లపల్లె రోడ్డు, ఇందిరమ్మకాలనీ మార్గాలలో రియల్‌ వ్యాపారులు లే అవుట్‌లను వేశారు. ఒక్కొక్క లే అవుట్‌ అర్ధ ఏకరం నుంచి 2 ఎకరాల వరకు వేశారు. జాతీయ రహదారి సమీపాన్ని బట్టి ఎకరం స్థలం రూ.3నుంచి 5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేసి లే అవుట్‌లను వేశారు. ఈ లే అవుట్‌లకు ఎటువంటి పంచాయతీ అనుమతులు లేవు. అంతేకాకుండా అనుమతులేని లే అవుట్‌లోని ప్లాట్‌లను రియల్‌ వ్యాపారులు విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్నారు. గుర్రంకొండలో ఏడాదికి రూ.50కోట్ల రియల్‌ వ్యాపారం జరుగుతోంది. ఈవ్యాపారం అంతా అనాధికారంగా జరుగుతూ పంచాయితీ ఆదాయానికి గండి కొడుతున్నారు.


లబోదిబోమంటున్న కొనుగోలుదారులు

రియల్‌ వ్యాపారులు వేసిన లే అవుట్‌లలో ప్లాట్‌లను కొన్న గ్రామీణ, మధ్య తరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. బ్రోకర్ల మాటలు నమ్మి 2 నుంచి 5 కుంటల వరకు ప్లాట్‌లను కొన్నారు. ఇందుకు అడ్వాన్స్‌గా రూ.లక్షలాది రూపాయలను ఇచ్చారు. ప్రభుత్వం రెండు నెలల క్రితం పంచాయతీ అనుమతులు లేని లే అవుట్‌లలో రిజిస్ట్రేషన్‌లను నిలిపేసింది. ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో కొనుగోలుదారులు ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి తీసుకోలేక, పూర్తిగా సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేక నలిగిపోతున్నారు.


అప్పులో కూరకుపోతున్న కొనుగోలుదారులు

రియల్‌ వ్యాపారులు చెప్పిన మాయమాటలను నమ్మి ప్లాట్‌లు కొన్న ప్రజలు అప్పుల్లో చిక్కుకున్నారు. పట్టణంలో ప్లాట్‌ ఉంటే భవిష్యత్‌లో ఇళ్లు నిర్మించుకోవడమో...? లేక ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతోందని చాలా మంది  అప్పు చేసి ప్లాట్‌లను కొన్నారు.   ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడంతో గ్రామీణ, మధ్య తరగతి ప్రజలు అప్పులో కూరుకుపోయారు. 


అధికారుల పర్యవేక్షణ ఎక్కడ... 

గుర్రంకొండలో రియల్‌ వ్యాపారులు ఇష్టానుసారంగా లే అవుట్‌లను వేస్తున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారుల కానీ పట్టించుకోవడం లేదు. దీంతో రియల్‌ వ్యాపారులు అడ్డదిడ్డంగా లే అవుట్‌లను వేసి కోట్లు గడిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో అనాధికార లే అవుట్‌లో ప్లాట్‌లను కొని ప్రజలు తీవ్రంగా నష్ణపోతున్నారు. 


పంచాయతీ అనుమతులు తీసుకోలేదు

గుర్రంకొండలో రియల్‌ వ్యాపారులు వేసిన ఒక్క లే అవుట్‌కు ఎటువంటి పంచాయతీ అనుమతులు తీసుకోలేదు.  అనుమతులు తీసుకోవాలని పలుమార్లు తెలియజేశాం. అనాధికార లే అవుట్‌లను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. 

-ఇబ్రహీం పంచాయతీ ఈవో, ఈవోపీఆర్డీ, గుర్రంకొండ.


Read more