Rayachoty లో ఒక్కసారిగా మారిపోయిన సీన్..

ABN , First Publish Date - 2022-02-20T05:48:12+05:30 IST

అన్నమయ్య జిల్లా ఏర్పాటు నోటిఫికేషన్‌ జారీతో రాయచోటి ప్రాంతంలో..

Rayachoty లో ఒక్కసారిగా మారిపోయిన సీన్..

  • రియల్‌ భూమ్‌.. ఢామ్‌..
  • కొత్త జిల్లాకేంద్రం ఎఫెక్ట్‌


అన్నమయ్య జిల్లా ఏర్పాటు నోటిఫికేషన్‌ జారీతో రాయచోటి ప్రాంతంలో రియల్‌ భూమ్‌ రెక్కలు తొడిగితే.. రాజంపేట ప్రాంతంలో కుప్పకూలింది. జిల్లా కేంద్రంగా రాయచోటి ప్రకటనతో ఆ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. పలువురు రాజకీయ నేతలు కూడా రియల్‌ అవతారం ఎత్తడంతో ఇక్కడ భూముల ధరలు రెండుమూడు రెట్లు పెరిగిపోయాయి. జనవరి ఆరంభంలో ఎకరం రూ.2-3 కోట్లు పలికే భూమి తాజాగా రూ.5-6 కోట్లు పోతోంది. రాజంపేటలో ఇందుకు భిన్నపరిస్థితులు ఉన్నాయి. సీఎం ఇచ్చిన హామీ మేరకు రాజంపేట జిల్లాకేంద్రం అవుతుందని చాలామంది ఇక్కడ అధిక ధరలకు భూములు పెద్దఎత్తున కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూములను అడిగేవారు లేకపోవడంతో వీరంతా లబోదిబోమంటున్నారు. సీఎం తమను నమ్మించి నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రం.. ఇటు రాయచోటిలో అటు రాజంపేటలో భూముల ధరలపై చూపుతున్న ప్రభావంపై ప్రత్యేక కథనం..


రాయచోటిలో..

భూముల ధరలకు రెక్కలు

రింగ్‌ రోడ్డు కూడలిలో ఎకరం రూ.5-6 కోట్లు పైమాటే

రోడ్డు పక్క పొలాలకు భారీ డిమాండ్‌

జనవరి నెల రేట్లతో పోలిస్తే.. మూడింతలు పెరుగుదల

వాలిపోయిన కడప, ప్రొద్దుటూరు, తిరుపతి, కదిరి రియల్టర్లు

(కడప-ఆంధ్రజ్యోతి): రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా రియల్‌ భూమ్‌ పరుగులు పెడుతోంది. స్థానికంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఓ పక్క క్రయవిక్రయాలు చేస్తుంటే.. మరో వైపు కడప, వేంపల్లి, ప్రొద్దుటూరు, తిరుపతి, అనంతపురం జిల్లా కదిరి తదితర ప్రాంతాలకు చెందిన రియల్టర్లు రాయచోటిలో వాలిపోయారు. ఫలితంగా ఒక్కసారిగా భూముల ధరలు తారాజువ్వలా దూసుకుపోతున్నాయి. సామాన్యులు, చిరుద్యోగులు, అరకొర జీతంతో కాలం వెల్లదీసే ప్రైవేటు ఉద్యోగులు పక్కా ఇంటి కోసం రెండు మూలు సెంట్ల స్థలం కొనలేని స్థాయిలో భూముల ధరలు ఉన్నాయి. నోటిఫికేషన్‌ రాక మునుపు ధరలతో పోలిస్తే.. మూడింతలు పెరిగినట్లు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వివరించారు. 


రింగ్‌రోడ్డు కూడళ్లలో చుక్కల్లో భూ ధరలు

రాయచోటి పట్టణానికి 1-2 కి.మీల దూరంలో 17 కి.మీల పొడవుతో రింగ్‌రోడ్డు ఉంది. రాయచోటి నుంచి కడప, మదనపల్లె, రాజంపేట, చిత్తూరు, లక్కిరెడ్డిపల్లె వెళ్లే రోడ్డు కూడళ్లల్లో జనవరి ప్రారంభంలో ఎకరా రూ.2-3 కోట్లు పలికితే.. తాజాగా రూ.5-6 కోట్లకు పైగా చేరింది. మంచి ధర వచ్చిందని కొందరు రైతులు భూములు అమ్మకానికి పెడితే.. ఇంకా ధర పెరిగే అవకాశం ఉందనే ఆశతో కొందరు అమ్మడానికి ఆసక్తి చూపడం లేదు. రెవెన్యూ రికార్డుల సర్వే నంబర్ల ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల జిరాక్స్‌ కాపీలు చేతపట్టుకొని కార్లల్లో రియల్టర్లు వాలిపోతున్నారు. రింగ్‌ రోడ్డు పొడవునా రోడ్డుకు ఇరువైపుల కార్లు, ఖద్దరు చొక్కాలతో వచ్చే కొనుగోలుదారులు, భూములు చూపించే మధ్యవర్తులే దర్శనం ఇస్తున్నారు. రింగ్‌రోడ్డుకు ఇటు పట్టణం వరకు.. అటు 2-3 కి.మీల దూరం వరకు డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే స్థలాలు రెండు మూడు చేతులు మారినట్లు తెలుస్తోంది. భూమి కొనుగోలు తరువాత రిజిస్ట్రేషన్‌కు 3 నెలల నుంచి ఏడాది గడువు ఇస్తుండడంతో అగ్రిమెంట్లు, టోకన్‌ అడ్వాన్స్‌తోనే క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.


రియల్టర్లుగా రాజకీయ నాయకులు

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మెజార్టీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా మారిపోయారు. రూ.కోటి భూమిపై పెడితే.. అదృష్టం కలిసొస్తే నెలలు తిరగకుండానే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీంతో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లుగా మారిన రాజకీయ నేతలు.. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అడుగు పెట్టడంతో వారి మధ్య పోటీ పెరిగి రియల్‌ భూమ్‌ బాణంలా దూసుకుపోతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడు ఒకరు, ఆయన బంధువులు జిల్లా కేంద్రం ప్రకటనకు ముందు, ఆ తరువాత  రాయచోటి చుట్టూ వివిధ ప్రాంతాల్లో 35 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారనే ప్రచారం జోరుగా ఉంది. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ అధికారి బంధువర్గం కూడా భూములపై వాలిపోయారని అంటున్నారు.


ప్రభుత్వ స్థలాలను గుర్తించి..

రాయచోటి చుట్టుపక్కల కలెక్టరేట్‌, ఎస్పీ ఆఫీసులు సహా జిల్లా కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్లు, కలెక్టరు, ఎస్పీ, జేసీ బంగ్లాల నిర్మాణం కోసం సుమారు 350 ఎకరాలు గుర్తించారు. ఆ భూములు ఎక్కడ గుర్తించారో రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని అక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు.


రాజంపేటలో...

భూముల ధరలు పతనం

జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంతో..

కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

పట్టణం చుట్టూ స్థలాలు కొనేవారు లేక..

లబోదిబోమంటున్న రియల్టర్లు

రాజంపేట, ఫిబ్రవరి 19: రాజంపేటలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిపోయింది. జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించిన వెంటనే రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలైంది. ఆంధ్రా కువైత్‌గా పేరున్న రాజంపేట ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌కు పెట్టింది పేరు. ఇటు రాజంపేట నుంచి నందలూరు వరకు, అటు రాయచోటి రోడ్డులో 10 కి.మీ దూరంలోని పాలెం వరకు, చిట్వేలి రోడ్డులోని నారాయణనెల్లూరు, 10 కి.మీ దూరంలోని నారాయణాద్రి ఇంజనీరింగ్‌ కళాశాల వరకూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగేది. దీనికి తోడు రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తారని ఇటీవల అనేక మంది రియల్టర్లు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో వందల కోట్లు వెచ్చించి వెంచర్లు వేశారు. ఒక్కొక్క వెంచర్‌లో వంద నుంచి 200 ప్లాట్లు వరకు వేశారు. సుమారు వంద మందికి పైబడి రియల్టర్లు ఈ ప్రాంతంలో ఉన్నారు. మధ్యవర్తులు, చిన్నచిన్న వ్యాపారులు సుమారు వెయ్యి మంది ఉన్నారు.


సీఎం హామీని నమ్మి..

రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్‌ కేంద్రాలను జిల్లా కేంద్రాలుగా చేస్తామని హామీ ఇవ్వడంతో వడ్డీలకు డబ్బు తెచ్చి రాజంపేట చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వత్తలూరు రోడ్డులో ఎకరా రూ.20 వేలు కూడా పలకని చోట ఏకంగా సెంటును రూ.2లక్షలకు పైగా కొనుగోలు చేశారు. వ్యవసాయభూముల నుంచి ప్లాట్లుగా మార్చుకొని అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అడా) ద్వారా అనుమతులు తెచ్చుకొని అమ్ముకోవడానికి సిద్ధమయ్యారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించింది. అంతే ఒక్కసారిగా రియల్‌ వ్యాపారం కుప్పకూలిపోయింది. ఇరవై రోజులుగా ప్లాట్ల మొహం చూసేవారే లేరు. కోట్లల్లో అప్పులు చేసి స్థలాలు కొన్నవారు పూర్తిగా నిర్వేదంలో మునిగిపోయారు. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని నమ్ముకున్న బడా వ్యాపారులు, మధ్యవర్తులు చిన్నచిన్న వ్యాపారులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.


తాళ్లపాక పంచాయతీకి భారీ నష్టం

- గౌరీశంకర్‌, సర్పంచ్‌, తాళ్లపాక 

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకకు భారీ నష్టం రానుంది. రాజంపేట నుంచి తాళ్లపాక వరకు పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్ల వల్ల తాళ్లపాక గ్రామ పంచాయతీకి మంచి ఆదాయం వచ్చేది. ఇప్పుడు రాజంపేట జిల్లా కేంద్రం కాకపోవడంతో ఒక్క స్థలం కూడా కొనేవారు లేరు. దీని వల్ల పంచాయతీకి వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం పోగొట్టుకోవాల్సి వచ్చింది.


జిల్లా కేంద్ర చేయకపోవడం వల్లే..

- అల్లం సుబ్రహ్మణ్యం, రియల్టర్‌, రాజంపేట 

రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడం వల్లే ఇక్కడ రియలెస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింది. ప్రస్తుతం రాజంపేట చుట్టూ సుమారు 20 వెంచర్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. జిల్లా అవుతుందనే కోట్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు. తీరా రాజంపేట జిల్లా కేంద్రం కాకపోవడంతో స్థలాలు అడిగేవారే లేరు. రెండు వారాలుగా స్థలాల వ్యాపారం పడిపోయింది. దీనివల్ల రియల్టర్లు వందల కోట్లు నష్టపోనున్నారు. 

Updated Date - 2022-02-20T05:48:12+05:30 IST