రియల్‌... కుదేల్‌!

ABN , First Publish Date - 2020-06-07T08:30:01+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తీవ్ర స్తబ్దత నెలకొంది. ఇసుక, సిమెంట్‌ ధరలు పెరిగిపోవడంతో పాటు కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. దీని ప్రభావం రిజిస్ర్టేషన్లపైనా

రియల్‌... కుదేల్‌!

  • రిజిస్ర్టేషన్ల ఆదాయానికి భారీ గండి 
  • మే నెల లక్ష్యంలో వచ్చింది 25 శాతమే
  • లాక్‌డౌన్‌తో కుదేలైన నిర్మాణ రంగం
  • ఇసుక, సిమెంటు ధరల పెంపుతో స్తబ్దత  
  • అమ్మకాల్లేక పీకల్లోతు కష్టాల్లో బిల్డర్లు
  • 40 లక్షల మంది కార్మికులకూ గడ్డుకాలం


అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తీవ్ర స్తబ్దత నెలకొంది. ఇసుక, సిమెంట్‌ ధరలు పెరిగిపోవడంతో పాటు కరోనా వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. దీని ప్రభావం రిజిస్ర్టేషన్లపైనా పడింది. మే నెలలో రిజిస్ర్టేషన్ల ఆదాయ లక్ష్యం రూ.750కోట్లు కాగా వచ్చింది కేవలం రూ.184కోట్లు (దాదాపు 25ు) మాత్రమే. లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వడంతో మే 3వ తేదీ నుంచి రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు తదితర నగరాల్లో మాత్రం 18 నుంచి తెరిచారు. కానీ ఆదాయం మాత్రం ఆశించిన దానిలో నాలుగో వంతు కూడా రాలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌లో రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు తెరవకపోవడంతో ఆ నెలలో ఆదాయం దాదాపు శూన్యం. కరోనా ప్రభావంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నెలకొన్న స్తబ్దతే దీనికి కారణంగా చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.5వేల కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 


లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 23నుంచి మే 3 వరకు కార్యాలయాలు తెరవక రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. కార్యాలయాలు తెరిచాక పెండింగ్‌లో ఉన్నవి, కొత్తవి కలిపి ఆదాయం పెరగాలి. కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, భరోసా లేని వాతావరణంతో కొనుగోళ్లు మందగించాయి. అగ్రిమెంట్లు చేసుకున్నవారు అడ్వాన్సు ఇచ్చినంత మేరకు రిజిస్ర్టేషన్లు చేయించుకుని.. మిగతా స్థలం, భూమిపై ఒప్పందం రద్దు చేసుకుంటున్నారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ ఆదాయాలు తగ్గిపోయాయి. మే నెలలో విశాఖ జిల్లాలో ఆదాయం రూ.26కోట్లు వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది మూడోవంతు మాత్రమే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.17కోట్ల చొప్పున వచ్చింది. గుంటూరు జిల్లాలో 2019 మే నెలతో పోలిస్తే రూ.30కోట్ల ఆదాయం తగ్గింది. విజయనగరం జిల్లాలో రూ.22కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.25కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.20కోట్లు వచ్చాయి. ఇక్కడా గణనీయంగా తగ్గాయి.


పెరిగిన ధరలతో మంటలు 

వాస్తవానికి గతేడాది నుంచీ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో కొన్నాళ్లు నిర్మాణాలు నిలిచిపోవడం, తర్వాత ధరలు భారీగా పెరగడం, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో రియల్‌ వ్యాపారం బాగా దెబ్బతింది. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు ఈ రంగమే వదిలేశారు. ఇప్పుడు కరోనా మరింత దెబ్బతీసింది. ఉద్యోగ కల్పన, ఆర్థికాభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మరోవైపు సిమెంటు ధరలు సైతం విపరీతంగా పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారిందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు వాపోతున్నాయి.


దృష్టి పెట్టకుంటే ఇబ్బందే 

రాష్ట్రంలో లక్షలాది కార్మికులు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో మేస్త్రీలు, ఎలక్ర్టీషియన్లు, ప్లంబర్లు, ఉడ్‌వర్క్‌ నిపుణులు, పెయింటర్లు... సుమారు 20 వృత్తుల వారు 25-30లక్షల మంది ఉన్నారని అంచనా. ఈ రంగం పుంజుకునేలా చర్యలు తీసుకోకుంటే వీరందరిపైనా తీవ్ర ప్రభావం తప్పదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని ఆదుకోకుంటే మొత్తం ఆర్థిక వ్యవస్థే అథోగతి పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-06-07T08:30:01+05:30 IST