ఏది అసలు.. ఏది నకిలీ అనేది గుర్తుపట్టలేనంతగా పత్రాలు సృష్టించి..

ABN , First Publish Date - 2021-05-13T13:23:45+05:30 IST

ఏది అసలు.. ఏది నకిలీ అనేది గుర్తుపట్టలేనంతగా పత్రాలు సృష్టించి

ఏది అసలు.. ఏది నకిలీ అనేది గుర్తుపట్టలేనంతగా పత్రాలు సృష్టించి..

  • రియల్‌ ముఠా ఆటకట్టు
  • నకిలీ పత్రాలు సృష్టించి.. 
  • కోట్లవిలువైన ప్లాటు అమ్మకానికి యత్నం 
  • 8 మందిని అరెస్టు చేసిన.. 
  • సైబరాబాద్‌ పోలీసులు పరారీలో మరో నలుగురు

హైదరాబాద్‌ సిటీ : ఏది అసలు.. ఏది నకిలీ అనేది గుర్తుపట్టలేనంతగా పత్రాలు సృష్టించి రూ. కోట్ల విలువైన ప్లాట్లను విక్రయానికి పెట్టిన ప్రొఫెషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ కేటుగాళ్ల ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. మొత్తం 13 మంది ముఠాలో 8మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


యూసఫ్‌గూడకు చెందిన ఐటీ ఉద్యోగి అర్ని రాఘవేంద్ర ప్రసాద్‌ తెల్లాపూర్‌లో 2007లో 430.56 గజాల స్థలం కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వర్క్‌ బిజీలో పడి.. ప్లాట్‌ చూడటానికి వెళ్లలేదు. ఈ క్రమంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించే ముఠా రాఘవేంద్ర ప్లాట్‌పై కన్నేసింది. అనుకున్నదే తడవుగా ముఠాలోని ప్రధాన నిందితుడు అమీర్‌పేటకు చెందిన ముఖేష్‌ అగర్వాల్‌ తన అనుచరులు, వారి పరిచయస్తులైన మరో 12మందితో ముఠాగా ఏర్పడ్డారు. వారిలో సికింద్రాబాద్‌కు చెందిన వాజి ఉజ్జమాన్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌, బంజారాహిల్స్‌కు చెందిన వగ్మారి నగేష్‌ అలియాస్‌ టోని, కూకట్‌పల్లిలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా వాసి కింజారపు దిల్లేశ్వరరావు, నర్సాపూర్‌కు చెందిన ఎల్లారెడ్డిగారి సంజీవరెడ్డి, సికింద్రాబాద్‌కు చెందిన ఎండీ దావూద్‌ షరీఫ్‌, అబ్ధుల్‌ ఓమర్‌, దాండియా శివకుమార్‌, మౌలాలికి చెందిన షేక్‌ మన్సూర్‌, బండ్లగూడకు చెందిన సయ్యద్‌ ఫెరోజ్‌, కడప జిల్లాకు చెందిన దంతమ్‌ రాజేష్‌ కుమార్‌, సంగారెడ్డికి చెందిన ఎండీపాషా ఉన్నారు. 


ఈ ముఠాలో టీస్టాల్‌ నడిపేవారు, పెయింటింగ్‌ పనిచేసిన వారు, కూలీ పనులు చేసిన వారున్నారు. వారంతా ఆ పనులు మానేసి రియల్‌ ఎస్టేట్‌లోకి దిగడం గమనార్హం. 2007 నుంచి ప్లాట్‌ ఖాళీగా ఉండటం, ఎవరూ ఎలాంటి కన్‌స్ట్రక్షన్‌ చేయకుండా ఉండటంతో ఆ ప్లాట్‌పై ముఖేష్‌ ముఠా కన్నేసింది. సంగారెడ్డి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో నయానో బయానో సీసీకాపీలు, రాఘవేంద్ర ప్రసాద్‌ సేల్‌డీడ్‌ కాపీలు తెచ్చారు. వాటి ఆధారంగా ఎవ రూ గుర్తించలేని విధంగా కొత్తసేల్‌డీడ్‌ తయారు చేశారు. అందులో రాఘవేంద్రకు బదులు శివ అనే వ్యక్తిని పెట్టి అతనే రాఘవేంద్ర ప్రసాద్‌గా చూపించారు. అతని ఆధార్‌, పాన్‌, ఓటర్‌ఐడీలు నకిలీవి సృష్టించి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ముఠాలోని దిల్లేశ్వరరావు పేరుతో జీపీఏ చేయించారు. ఆ తర్వాత ఆ ప్లాట్‌ను అమ్మకానికి పెట్టగా ముగ్దుల్‌ అనే వ్యక్తి కొనేందుకు ముందుకొచ్చాడు. గజం రూ.52వేల చొప్పున  రూ. లక్ష అడ్వాన్స్‌ చెల్లించాడు. ఆ తర్వాత అదే ప్లాట్‌ను సంపత్‌రెడ్డి అనే వ్యక్తికి గజం రూ. 67వేలకు అమ్మడానికి నిర్ణయించి అడ్వాన్స్‌గా రూ.6లక్షలు తీసుకొని అగ్రిమెంట్‌ చేశారు. అప్పటి నుంచి సంపత్‌రెడ్డికి ఆ ప్లాట్‌పై అనుమానం వచ్చింది.


ఇదిలాఉండగా.. ఇటీవల తన ప్లాట్‌ చూసుకోవడానికి వెళ్లిన రాఘవేంద్ర ప్రసాద్‌కు ఎవరో ఇతర వ్యక్తులు ఈ ప్లాట్‌ను అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని విషయం ఆరా తీశాడు. దాంతో జీపీఏ బండారం బయటకువచ్చింది. ఆర్‌సీ పురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలమేరకు కేసు ఈవోడబ్ల్యూ (ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌)కు అప్పగించారు. దాంతో డీసీపీలు విజయ్‌కుమార్‌, కవిత పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ డీఎల్‌ రెడ్డి, శ్రీనాథ్‌లు, ఆర్‌సీపురం ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌కమార్‌లు తమ బృందంతో రంగంలోకి దిగి రియల్‌ ఎస్టేట్‌ కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి మోసపూరితంగా చేయించిన జీపీఏ, ఫోర్జరీ సేల్‌డీడ్‌, సేల్‌డీడ్‌ సీసీ, నకిలీ ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ కార్డులు, మొబైల్‌ ఫోన్‌లు-8, ఒక కారు, రౌండ్‌ సీల్స్‌, ఇంక్‌ బాటిల్స్‌, స్టాంప్‌ప్యాడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఈవోడబ్ల్యూ సిబ్బందిని సీపీ అభినందించారు.

Updated Date - 2021-05-13T13:23:45+05:30 IST