రియల్‌ ఢమాల్‌.. కోట్లలో నిలిచిపోయిన లావాదేవీలు

ABN , First Publish Date - 2020-08-04T21:35:13+05:30 IST

మూడు రాజధానుల ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూల్చేటట్టు చేసింది. ఇవాళ కాకపోతే రేపైనా అనుకూల ఫలితం వస్తుందని వేచి చూసినా అంచనాలు తల్లకిందులయ్యాయి.

రియల్‌ ఢమాల్‌.. కోట్లలో నిలిచిపోయిన లావాదేవీలు

అడ్వాన్స్‌లు రూపంలో రూ.110 కోట్లు

వెంటాడిన ఇసుక, రాజధాని, కరోనా

రోడ్డున పడ్డ వేలమంది ఏజెంట్‌లు 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూల్చేటట్టు చేసింది. ఇవాళ కాకపోతే రేపైనా అనుకూల ఫలితం వస్తుందని వేచి చూసినా అంచనాలు తల్లకిందులయ్యాయి. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఇళ్ల స్ధలాలు, అపార్ట్‌మెంట్‌ల అమ్మకాలకు బ్రేక్‌ పడింది. ఇసుక, రాజధాని సమస్యలు వెంటాడడం, కరోనాతో పూర్తిగా కుదేలవడంతో పెట్టుబడిదారులు, ఏజెంట్లు గల్లంతయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


‘మూడు’ మార్చేసింది..

గడిచిన ఎన్నికల ముందు ఊరూ వాడా రియల్టర్ల దూకుడుతో వ్యవసాయ భూములు లేఅవుట్‌లుగా మారిపోయాయి. కాస్త జాగాలో నెలల వ్యవధిలోనే బహుళ అంతస్థులు వెలిశాయి. అంతో ఇంతో పోగేసుకున్న నగదు, బ్యాంకర్ల రుణ సదుపాయంతో రియల్‌ ఎస్టేట్‌ చాలా మందికి కాసుల పంట కురిపించింది. అనుభవం ఉన్నా లేకపోయినా కొందరు రియల్టర్‌ అవతారం ఎత్తారు. ఏడాది కాలంగా వరుసగా ఇసుక దెబ్బ ముప్పుతిప్పలు పెట్టింది. నిర్మాణ రంగం ముంద డుగు వేయకుండా ఇసుక అడ్డంపడింది. అధికార పక్ష అనుకూలురకు ఇసుక చేరింది. మిగతా వారికి మట్టి, రాళ్లు మిగిలాయి. ఎన్ని మార్గదర్శకాలు మార్చినా ఇసుక కొరత కోట్ల రూపాయలు పెట్టిన వారిని ముంచేసింది. ఇటీవల నిర్మాణ ధరలు ఒక్కసారిగా రెండింతలయ్యాయి. భూముల ధరలు చుక్కలనంటాయి. సిమెంట్‌, ఐరన్‌ ధరలు భారం కావడంతో ఎంత భారమైనా ఇసుక తెచ్చి అతి కష్టం మీద నిర్మాణాలు పూర్తిచేసి లాభం వచ్చినా రాకపోయినా తెగనమ్ము కున్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేని అనేక మంది 

రియల్టర్లు చేతులెత్తేశారు.


ఇదే తరుణంలో మూడు రాజధానుల ప్రకటన ఏడాది కాలంగా రాజధానికి సమీపాన్ని ఉన్న ఏలూరుతో సహా మిగిలిన ప్రాంతాలపై ప్రభావం చూపింది. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో అమరావతి రాజధానిగా స్పష్టత వస్తుందని పెట్టుబడిదారులు ఎదురుచూశారు. ప్రస్తుత పరిణామాలతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇసుక సమస్యతో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకుతో సహా మిగతా పట్టణాల్లో మూడొంతులు పూర్తయిన అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం నిలిచిపోయింది. వీటిపై రూ.110 కోట్లు పెట్టుబడి ఉన్నట్లు ఒక అంచనా. ఒక్క భీమవరంలోనే రియల్టర్‌ల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. 


కరోనా కమ్మేసింది..

సంక్రాంతికి ముందు, తరువాత రియల్‌ రంగంలో జోష్‌ సాగింది. సొంతింటి కోసం మధ్యతరగతితో పాటు ఇంకొందరి అన్వేషణ. బ్యాంక్‌ రుణాలతో వేతన జీవులంతా అపార్ట్‌మెంట్‌ దారిపట్టారు. డిమాండ్‌కు అనుగుణంగా ఏలూరు, బీమ వరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో ఎకరం భూమి రూ.కోటికి పైగా ధర పలికింది. నలుగురు, ఐదుగురు సిండికేట్‌గా నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టారు. మార్చిలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ ప్రకటనతో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలింది. కమీషన్‌లపై బతికే వందలాది మంది ఏజెంట్లు పిల్ల పాపలతో పస్తులున్నారు. పేరొందిన రియల్‌ కంపెనీలో పని చేసిన వీరంతా  వేతనాలపైనే ఆధారపడ్డ వారే. ఏప్రిల్‌ వరకు కొంతలో కొంత చెల్లించిన జీతాల కాస్తా ఆ తరువాత కంపెనీలు నిలిపివేశాయి. కరోన విజృంభించింది. రోడ్డుపైకి వచ్చే పరి స్థితి లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో సంక్రాంతి పండుగ తరువాత అగ్రిమెంట్‌ చేసుకున్న వారు మాత్రమే గత నెల రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల గడప తొక్కారు.


భవిష్యత్‌ మాటేంటి..?

రియల్టర్లకు వ్యక్తిగత పెట్టుబడి కాకుండా బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు సుమా రు రూ.180 కోట్లు ఉంటాయని అంచనా. ఐదు నెలలుగా నిలిచిపోయిన నిర్మాణా లు, స్తంభించిన లావాదేవీల నడుమ రియల్టర్‌లు గుక్కతిప్పుకోలేక పోతున్నారు. రాజధాని మూడు చోట్ల ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంతో రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం పడింది. కొనుగోళ్లు, అమ్మకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఉదాహరణకు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రూప్‌ హౌస్‌ నిర్మాణం పేరిట కొందరు బహుళ అంతస్ధులు నిర్మిం చారు. చివరి క్షణం వరకు అడ్వాన్స్‌లు తీసుకోకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో అన్ని ప్లాట్‌లను అమ్మేసుకుందామని ఆశ పడిన వారంతా పూర్తిగా ఇరుక్కుపోయారు. రాజధాను ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు రియల్టర్లు ద్వేషం పెంచుకుంటే మరికొందరు నష్టాలు తప్పవని, ఇప్పట్లో కోలుకోలేమని నిరాశతో ఉన్నారు.

Updated Date - 2020-08-04T21:35:13+05:30 IST