రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

అది ప్రభుత్వ భూమి. గతంలో అక్కడ వాగు ఉండేది. అధికారిక రికార్డుల్లో కొంత పుంత రహదారిగానూ నమోదై ఉంది. రైతులు వాగుగా చెప్పుకునే వారు.

రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలం
వాగు ప్రాంతం మీదగా అర్ధరాత్రి వెలిసిన రహదారి

 ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి రహదారి 

 గతంలో అదే ప్రాంతంలో వాగు 

 మాస్టర్‌ ప్లాన్‌లో వంద అడుగుల రహదారి  

 వ్యాపారికి సహకరించిన అధికారులు 

 సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి హద్దులు

 చేతులు మారిన సొమ్ములు  

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

అది ప్రభుత్వ భూమి. గతంలో అక్కడ వాగు ఉండేది. అధికారిక రికార్డుల్లో కొంత పుంత రహదారిగానూ నమోదై ఉంది. రైతులు వాగుగా చెప్పుకునే వారు. అందులో పంట పొలాల నుంచి వచ్చే మురుగు నీరు ప్రవహించేది. ఈ ప్రాంతాన్ని ఆనుకుని వున్న రైతులు క్రమేణా తమ పొలాల్లో కొంత కలిపేసి సాగు చేస్తున్నారు. ఇటీవల ఆక్రమణలో వున్న వాగు మాయమైంది. వందల కొద్దీ లారీల్లో కంకర మట్టిని తెచ్చి పుంతతో పాటు వాగు ప్రాంతాన్ని పూడ్చేశారు. 70 అడుగుల వెడల్పున రహదారి వేసేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ యజమాని ఇందులో ప్రధాన పాత్ర వహించారు. ఈ రహదారి గుండా వెళితే అతనికి ఎనిమిది ఎకరాల వెంచర్‌ ఉంది. ఇప్పటి వరకు ఆ వెంచర్‌ వైపు ఎవరు తొంగి చూడలేదు. స్థలాలు కొనుగోలు చేసేవారు లేరు. వెంచర్‌కు ఒకవైపు మాత్రమే రహదారి ఉంది. తాడేపల్లి గూడెం–నల్లజర్ల రహదారి నుంచి మదర్‌ వన్నిన్‌ ఆసుపత్రి పక్కగా ఆ రహ దారి వెళుతుంది. ఎనిమిది ఎకరాల వెంచర్‌ వరకు వెళ్లి అది ఆగిపోయింది. తాడేపల్లిగూడెం– చిన్నతాడేపల్లి వైపు ప్రధాన రహదారి నుంచి మరో రహదారి వస్తే వెంచర్‌కు రెండు వైపులా మార్గం ఏర్పడుతుంది. కాసుల వర్షం కురుస్తుంది. ధర అమాంతం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ వెంచర్‌ కోసం ఎగబడతారు. తాడేపల్లిగూడెం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పక్కా ప్రణాళిక వేశారు. అధికార పార్టీ నేతల నుంచి అడ్డంకులు లేకుండా మంతనాలు చేశారు. అధికారుల ఆశీస్సులు పొందారు. దీనికోసం రూ.1.50 కోట్లు వెచ్చించారు. చిన తాడేపల్లి రహదారి నుంచి వెంచర్‌ వరకు ఉన్న పుంత–వాగు ప్రాంతంలో అధికారికంగా సర్వే నిర్వహించారు. మునిసిపల్‌ సర్వేయరే హద్దులు గీశారు. పంట పొలాల మీదుగా హద్దులు లేచాయి. ఇంకేముంది రాత్రి వేళ రహదారి వేసేశారు. మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో వంద అడుగుల రహదారి ఉందని ప్రచారం సాగుతోంది. అదే ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలి. అలా కాకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రం తిప్పారు. రాత్రికి రాత్రే వేసిన రహదారికి ఆనుకుని ఉన్న రైతుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. తాము వేసిన వెంచర్‌ కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి  ఇతర  రైతులను బలిచేశారు. అధికారుల ఆశీస్సులు కూడా ఉండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఎదురులేకపోయింది. 

రాత్రికి రాత్రే.. కిలో మీటరు రోడ్డు

దాదాపు కిలో మీటరు పొడువునా అర్ధరాత్రి వేళ రహదారి వెలిసింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.  వాస్త వానికి ప్రభుత్వ భూమిపై ప్రైవేట్‌ వ్యక్తులు ఎటువంటి చర్యలు తీసుకోవ డానికి వీలులేదు. రికార్డుల్లో వాగు ఉన్నట్టయితే ఆ ప్రాంతాన్ని అస్సలు అభివృద్ధి చేయకూడదు. వంద అగుగుల వెడల్పులో రహదారి ఉంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. కానీ ప్రైవేట్‌ వ్యక్తుల దందాతో రహదారి వేయడంపైనే ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సొమ్ములు చేతులు మారడం చర్చనీయాంశమైంది. 


Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST