‘రియల్‌’ ఢమాల్‌

ABN , First Publish Date - 2021-02-28T08:15:53+05:30 IST

రాష్ట్ర విభజన అనంతరం సొంత రాష్ట్రం అన్న మమకారంతో పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిర్మాణదారులూ ఏపీలోని నగరాలకు తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రి, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి ఇలా పలు నగరాలకు

‘రియల్‌’ ఢమాల్‌

మళ్లీ హైదరాబాద్‌ బాట.. నగరాలు, పట్టణాల్లో తగ్గిన డిమాండ్‌

సొంత రాష్ట్రం అని వచ్చినవారూ వెనక్కి

ఉద్యోగులూ...రిటైరయ్యాక వెళ్లిపోదామనే నిర్ణయం

రాజధాని అంశం, అభివృద్ధి లేమితో తీవ్ర నిరాశ

పైసాపైసా కూడబెట్టి కొన్న మధ్యతరగతిదీ అదేదారి

రియల్‌ ఎస్టేట్‌పై ఆధారపడిన అన్ని రంగాలూ కుదేలు


ఆయన ఒక ప్రైవేటు ఉద్యోగి. విజయవాడలో పనిచేస్తున్నారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు. రిటైర్‌ అయ్యాక ఇక్కడే తన సొంత రాష్ట్రంలో సెటిలవుదామనుకున్నారు. రాజధాని అమరావతికి దగ్గర్లో ఉండేలా భవిష్యత్తు ప్రణాళికలూ వేసుకొన్నారు. కానీ, ఇప్పుడాయన ఇక్కడ ఉండటం అనవసరం అనే భావనకు వచ్చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాదిన్నరలోనే పారిశ్రామిక వాతావరణం చెదిరిపోవడం, రాజధాని పనులు స్తంభించడంతో ఈ ఉద్యోగిలాగే చాలామంది పునరాలోచనలో పడుతున్నారు. ఒకనాడు ఏపీకి ప్రేమతో రావాలనుకొన్నవారంతా, ఇక్కడి ప్లాట్లు, ఫ్లాట్లపై పైసా పెట్టడానికే జంకుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర విభజన అనంతరం సొంత రాష్ట్రం అన్న మమకారంతో పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిర్మాణదారులూ ఏపీలోని నగరాలకు తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రి, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి ఇలా పలు నగరాలకు వచ్చారు. ఈ మధ్యకాలంలో వారికి హైదరాబాద్‌లోని తమ భాగస్వాముల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ‘ఇంకా అక్కడ ఏం చేస్తారు? ఏం వ్యాపారం నడుస్తోంది. హైదరాబాద్‌ వచ్చేయండి. ఇక్కడ చేసుకుందాం’ అంటున్నారు. ఇప్పటికే ఏపీలో పరిస్థితితో విసిగిపోయిన వారు ‘ఉన్నవరకు ఏదో పూర్తిచేసుకుని అటే వచ్చేస్తాం’ అని చెప్తున్నారు. సొంత రాష్ట్రం అని మమకారంతో వచ్చినోళ్లు ఇప్పుడు నిర్వేదంతో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనివార్యంగా మళ్లీ హైదరాబాద్‌ వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు వాపోతున్నాయి.


విధానాల్లో తప్పులు...రాజకీయ ఎత్తులు..

విధానపరమైన నిర్ణయాల్లో వైసీపీ ప్రభుత్వ తప్పులు...అదే సమయంలో రాజకీయ ఎత్తుగడలతో తీసుకున్న నిర్ణయాలు వికటించి వ్యాపారస్థులపై తీవ్ర ప్రభావం చూపాయి. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఈ తప్పులు-ఎత్తులు మరింత ప్రభావం చూపాయి. వీటిలో ఇసుక విధానం ఒకటి. అంతకుముందు ఉచితంగా ఉన్న ఇసుకను ఇంకా బాగా అందించేస్తామంటూ నూతన విధానం తెచ్చారు. దీంతో ఇసుక ధరలు మూడింతలయ్యాయి. అంతకుముందు రూ.6వేలకు దొరికే లారీ ఇసుక ఇప్పుడు రూ.20 వేలైంది. బ్లాక్‌లో లారీ ఇసుక రూ.40వేలకు కొన్న సందర్భాలూ కోకొల్లలు. ఇక రాజకీయ ఎత్తుల్లో భాగంగా అమరావతి రాజధానిని మార్చి మూడు రాజధానులని ప్రకటించారు. అమరావతిని నీరుకార్చడానికి తప్ప... ఒక్క హైకోర్టుతో కర్నూలుకు ఒరిగేదేమీ లేదన్న విమర్శలూ వచ్చాయి. 


ఐటీ నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో కొత్తగా రాజధాని అనడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ ఏమాత్రం పెరగలేదు. పైగా అటు అమరావతి-ఇటు విశాఖపట్నం మధ్య ఊగిసలాడుతూ రెంటికీ చెడ్డ రేవడిలా ఉండిపోయింది. మరోవైపు గుంటూరు, రాజమండ్రి, ఏలూరు తదితర నగరాల్లోనూ, అటు రాయలసీమ ప్రాంతంలోనూ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో పురోగతి లేదు. పాత ప్రాజెక్టులు వదిలించుకున్నవారు కొత్తవి ప్రారంభించడం అనవసరం అనే భావనకు వచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వ్యాపారం కంటే మళ్లీ హైదరాబాద్‌ వెళ్లిపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేశారు. చాలామంది ఈ రెండేళ్లలోనే వెళ్లిపోయారు. మిగిలినవాళ్లు కూడా తట్టాబుట్టా సర్దుకుని ఎప్పుడు వెళ్లిపోదామా? అన్నట్లు ఉన్నారు. కర్ణాటకలో వ్యవసాయ పొలాలు ఎవరైనా కొనుగోలు చేయవచ్చంటూ ఇటీవల చేసిన చట్ట సవరణను గమనించి మరికొందరు ఆ రాష్ట్రానికీ వెళ్లిపోతున్నారు. బెంగళూరు చుట్టుపక్కలతోపాటు,  హసన్‌ లాంటి పట్టణాల సమీపంలోనూ భూములు కొనుగోలు చేస్తున్నారు. జగనే రావాలి అని బలంగా కోరుకున్న ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి...తన కోరిక నెరవేరినా... వ్యాపారం మాత్రం తీవ్రంగా దెబ్బతినడంతో హతాశుడయ్యాడు. విజయవాడ, గుంటూరుల్లో చిన్న చిన్న భవనాలు కట్టిన ఆయన ఆ రెంటినీ అమ్ముకోలేకపోయారు. ఇక్కడుంటే లాభం లేదనుకుని...కుటుంబాన్ని సొంతూరు రాజమండ్రికి పంపేసి...ఆయన హైదరాబాద్‌ వెళ్లి అక్కడ వ్యాపార ప్రయత్నాలు చేసుకుంటున్నారు.


40లక్షల మంది ఉపాధికి దెబ్బ..

పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం, ఇక్కడున్న లక్షలాది భవన నిర్మాణ కూలీలపై పెను ప్రభావం చూపిస్తోంది. ఒకప్పుడు తాపీ మేస్ర్తీ అంటే దర్జాగా పనులు చేసుకునేవాడు. కనీసం 20-30మంది కూలీలకు పని కల్పించేవాడు. ఇప్పుడు నిర్మాణాలు తగ్గిపోవడం, కొత్త వెంచర్లు మందగించడంతో వీరికి ఉపాధి తగ్గిపోయింది. నిర్మాణరంగంపై అనేకరకాల వృత్తులవారు ఆధారపడ్డారు. వడ్రంగి, ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, పెయింటర్లు,  టైల్స్‌, గ్రానైట్‌ వేసేవాళ్లు, రెయిలింగ్‌ చేసేవాళ్లు, పునాదులు తవ్వేవారు, సెంట్రింగ్‌ పనివారు, తలుపులపై డిజైన్లు వేసేవాళ్లు, ఇంటీరియల్‌ డిజైనర్లు, ఇంజనీర్లు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు.. ఇలా నిర్మాణ రంగంపై ఆధారపడిన దాదాపు 40లక్షల మంది ఇప్పుడు సెమీ నిరుద్యోగం అన్న స్థాయికి వచ్చేశారు. నెలలో 15రోజులు పనులుంటే 15 రోజులు పని ఉండని పరిస్థితి. క్రమంగా వీళ్లు కూడా కష్టానష్టాలతో మళ్లీ  హైదరాబాద్‌ వైపు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు భవన నిర్మాణ రంగంపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న  సిమెంటు, ఇనుము, హార్డ్‌వేర్‌, ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌, పెయింట్లు, కలప, టైల్స్‌, గ్లాస్‌, గ్రానైట్‌ తదితర వ్యాపారాలు.. దుకాణాలు మూసుకోవడం, లేకుంటే వ్యాపారాలు కుదించుకోవడం వంటి పరిస్థితికి వచ్చేశారు. 


గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లేవు..

వ్యాపారం, ఉపాధి, ఉద్యోగాలు.. ఇవన్నీ ఒక ఎత్తు కాగా..ప్రతి ఒక్కరికీ సొంత గడ్డ, సొంత రాష్ట్రం అనే ఆత్మాభిమానం ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం చాలామంది ఇలాంటి ఆత్మాభిమానంతోనే ఇక్కడికి తరలివచ్చారు. కానీ, ఇప్పుడు ఇలా గర్వంగా చెప్పుకునే పరిస్థితుల్లేవు. ఆర్థికంగా అండ ఉంటేనే, ఆత్మాభిమానం తోడుగా ఉంటుంది. ఆర్థికంగా దెబ్బతినడం, మళ్లీ పరిస్థితులు మెరుగవుతాయనే నమ్మకం లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


ఉద్యోగులూ...అమ్మేసి వెళ్లిపోదామనే

సాధారణంగా పెట్టుబడులు పెట్టే వర్గంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ ఉద్యోగులు విజయవాడ, గుంటూరుతోపాటు తమ తమ స్వస్థలాల్లో, సమీప నగరాల్లో స్థలాలు కొన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు అమ్మేసి...ఆ డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టారు. కొందరు సొంతూళ్లలో సాగుభూములూ అమ్మేసి రాజధాని అమరావతిలో భూములు కొన్నారు. వారంతా ఇప్పుడు తమ స్థలాలను తిరిగి అమ్మేస్తున్నారు. ఆ డబ్బుతో మళ్లీ హైదరాబాద్‌, బెంగళూరు తదితరచోట్ల వచ్చినంత స్థలం కొనుగోలు చేస్తున్నారు. వీరంతా క్రమంగా ఇక హైదరాబాద్‌ వెళ్లి స్థిరపడిపోదామనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. కొద్దోగొప్పో స్థోమత ఉన్న వీళ్లు రాష్ట్రంలోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటే...వారిపై ఆధారపడి కొంతమందికి ఉపాధి లభించేది. కొన్ని వ్యాపారాలు నడిచేవి. వీరు వెళ్లిపోతే ఆమేరకు ఉపాధి, వ్యాపారాలు దెబ్బతింటాయి. ఒక పెట్టుబడిదారుడు, మధ్యతరగతి మదుపుదారుడు, భవిష్యత్‌కోసం మదుపుచేసినవారు, వారిపై ఆధారపడి ఉపాధి పొందేవారు, వీరందరిపై ఆధారపడి పలు వ్యాపారాలు సాగించేవారు...ఈ గొలుసు ఇప్పుడు నిరాశలో మునిగిపోయింది.


పేద, మధ్యతరగతిపైనా ప్రభావం

రియల్‌ ఎస్టేట్‌ అంటే వ్యాపారులకు సంబంధించిందనే భావనకు కాలం చెల్లింది. పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ తమ స్థాయిల్లో ఎంతోకొంత భూమిని కొనుగోలు చేస్తున్నారు. కష్టార్జితం స్థలంపై పెడితే ఎంతోకొంత పెరుగుతుంది, లేకుంటే పిల్లలకు ఉంటుందనే ఆశతో కొన్నారు. వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ఒక్కరే కొనే ఓపిక లేక ఆరేళ్ల క్రితం ఇద్దరు కలిసి గుంటూరులో గజం రూ.20వేల చొప్పున 200 గజాల స్థలం కొన్నారు. మూడేళ్ల క్రితం ఆ స్థలాన్ని గజం రూ.30వేల చొప్పున అడిగారు. ధర పెరిగింది కదా! అయినా పిల్లల కోసం కొన్నాం ఉంటుందిలే అని అమ్మలేదు. ఇప్పుడు కొన్న ధరకే అమ్ముదామన్నా కొనేవాళ్లు లేరు. అంటే ఆరేళ్ల తర్వాత స్థలంపై వారికి వచ్చిన ప్రతిఫలం సున్నా. కానీ ఈ ఆరేళ్లకాలంలో ద్రవోల్బణం రెట్టింపైంది.

Updated Date - 2021-02-28T08:15:53+05:30 IST