Abn logo
Jun 12 2021 @ 00:10AM

రియల్‌ మోసం

పట్నాల శ్రీనివాసరావు

బోర్టు తిప్పేసిన ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌

రూ.6కోట్ల వరకు అడ్వాన్సులు వసూలు

వందమంది వరకు బాధితులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నగరానికి చెందిన ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నుంచి రూ.6 కోట్ల వరకు అడ్వాన్సులు వసూలు చేసి పరారైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గడిచిన ఏడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. గురునానక్‌ కాలనీలోని మహానాడులో కార్యాలయాన్ని తెరిచారు. దీంతోపాటు హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచ్‌ను తెరిచారు. ఈ కంపెనీకి విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామానికి చెందిన ఉప్పు మనోజ్‌కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. యద్దనపూడికి చెందిన బలగం రవితేజ డైరెక్టరుగా ఉన్నారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాలను విక్రయించడానికి విజయవాడలోని మొత్తం 20 మంది యువతీ యువకులను ఏజెంట్లుగా నియమించుకుంది. విక్రయించిన ప్లాట్లలో వారికి రెండు శాతం కమీషన్‌ ఇస్తామని నమ్మించారు. పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌, రవితేజ కలిసి ఈ ఏజెంట్లకు విజయవాడకు సమీపాన ఉన్న గన్నవరం, ముస్తాబాద, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. ఈ స్థలాలను చూసిన ఏజెంట్లు బుకింగ్స్‌ తీసుకొచ్చారు. కొంతమంది ఏజెంట్లు ముందుగా పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు ఇచ్చారు. ఖాళీ చెక్కులను హామీగా ఇచ్చారు. ఆఫర్లు ప్రకటించారు. దీంతో కొంతమంది కస్టమర్లు అడ్వాన్సులు చెల్లించారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, వైజాగ్‌కు చెందినవారు 100 మంది లక్షలాది రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. 

మార్చి నుంచి ఏమార్చి..

ఏజెంట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టారు. శ్రీనివాసరావు, మనోజ్‌, రవితేజపై ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో మార్చి నుంచి రాకపోకలను తగ్గించారు.  మొత్తంగా 100 మంది కస్టమర్ల నుంచి రూ.6కోట్ల వరకు వసూలు చేశారని సమాచారం. మే రెండో తేదీ నుంచి ఈ ముగ్గురు ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశారు. దీనిపై ఏజెంట్లు 24వ తేదీన పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కార్యాలయంలోనూ సీసీసీలో ఫిర్యాదు చేశారు. 

మనోజ్‌కుమార్‌


రవితేజ