రియల్‌ ఢమాల్‌

ABN , First Publish Date - 2022-04-25T05:30:00+05:30 IST

రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోవచ్చని బ్రోకర్ల మాయాజాలంలో పడిన కొనుగోలుదారులు అనేక కలలు కని రూ.లక్షల విలువ చేసే భూములకు.. రూ.కోట్లు పెట్టి కొన్నారు..

రియల్‌ ఢమాల్‌
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వేసిన ప్లాట్లు

బ్రోకర్ల మాయాజాలం....

కుప్పకూలిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

లాభం దేవుడెరుగు.. అసలిస్తే.. చాలంటున్న కొనుగోలుదారులు


ఇదిగో.. ఇక్కడే.. కలెక్టర్‌ కార్యాలయం వస్తుంది.. ఆ పక్కనే.. ఎస్పీ కార్యాలయం. ఆదిగో అక్కడ స్టేడియం.. చాలా ప్రభుత్వ కార్యాలయాలు.. ఒక ఎయిర్‌పోర్టు.. ఇలా ఒకటేమిటి.. ఎన్నెన్నో వస్తాయి.. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి.. ఇక్కడ పెట్టుబడి పెట్టాలని బయట ఊరోళ్లు పెద్ద పెద్ద సూటుకేసుల్లో.. డబ్బులతో దిగుతున్నారు.. మన ఊరివాడివి కాబట్టి.. నీకు చెప్తున్నాం.. మా మాట విను.. అలా కొను.. ఇలా చేతుల మీదే...పెద్ద లాభానికి..  అమ్మించేస్తాం.. మా మాట విని.. ఒకాయన ఒక రోజుకే రూ.50 లక్షలు సంపాదించాడు.. ఇంకోకాయన ఒక రోజుకే రూ.20 లక్షలు సంపాదించాడు.. ఇవీ గత రెండు నెలలుగా రాయచోటిలో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు చేసిన మాటల గారడీ.. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి) :  రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోవచ్చని బ్రోకర్ల మాయాజాలంలో పడిన కొనుగోలుదారులు అనేక కలలు కని రూ.లక్షల విలువ చేసే భూములకు.. రూ.కోట్లు పెట్టి కొన్నారు.. ఇంతలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు. అనుకున్నట్లే.. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం.. ఇంకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి.. పరిపాలన కూడా మొదలైంది. అయితే భూములకు మాత్రం రెక్కలు రాలేదు.. రెక్కల మాట అటుంచి.. కనీసం ఈకలు కూడా రాలేదు.. దీంతో బ్రోకర్ల మాయాజాలానికి బలైన అభాగ్యులు.. తాము కొన్న భూములను ఇప్పుడు కొనే నాథుడు లేక.. మిగిలిన డబ్బు కట్టడానికి చేతుల్లో డబ్బు లేక.. లాభాల మాట దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి చేతికొస్తే.. చాలు అని దీనంగా ఎదురు చూస్తున్నారు. 


ఎక్కడా లేనంత వ్యాపారం..

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంటేనే.. రాయచోటికి పెట్టింది పేరు.. తిరుపతి, మదనపల్లె, పీలేరు, కదిరి, అనంతపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట ప్రాంతాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటారు.. దీంతో ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతుందనే చెప్పవచ్చు. దీనికి తోడు.. సుమారు 17 మండలాలకు రాయచోటి అనువైన ప్రాంతం.. వ్యాపారాలు, కూలి పనులు, చదువు కోసం.. ఇలా బయట ప్రాంతాల నుంచి వచ్చి.. ఇక్కడ స్థిరపడుతుంటారు.. ఈ నేపధ్యంలో.. రాయచోటిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగుతూ ఉంటుంది. దీనినే కొందరు బ్రోకర్లు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. భూములకు ధరలు రాయచోటిలో ఉన్నంతగా.. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా ఉండదంటే.. అతిశయోక్తి కాదేమో.. 


కోట్లు పెట్టి కొన్న వాళ్లు.. లబోదిబో

సుమారు ఒకటన్నర సంవత్సర కాలంగా... రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రస్తావన వినపడుతోంది. కొత్త జిల్లా ఏర్పడితే.. రాయచోటి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉందని పుకార్లు జోరుగా వినపడ్డాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసింది. దీంతో ఒకసారిగా రాయచోటిలో భూములకు రెక్కలు వచ్చాయి. అంతకు ముందు.. ఎకరా రూ.లక్షలు ఉన్నచోట రూ.కోట్లకు చేరుకుంది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, తిరుపతి ఇలా ఎక్కడెక్కడి నుంచో.. బయటి వ్యక్తులు వచ్చారు.. భూములకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. రోజుల వ్యవధిలోనే.. అనేక చేతులు మారిపోయాయి. రూ.లక్షలతో మొదలై.. రూ.కోట్లకు చేరి నిలిచిపోయాయి. రాయచోటి నుంచి ఇటు గువ్వలచెరువు, అటు వేంపల్లె, ఇటు మదనపల్లె, అటు పీలేరు వరకు ఎకరా రూ.కోటి రూపాయలపైనే ధర పలికింది. చివరికి డీకేటీ పట్టాలు కూడా ఎకరా కోటి రూపాయలకు పైనే ధర పలికింది. రాయచోటి పట్టణం, చుట్టుపక్కల ఎకరా ఆరేడు కోట్ల వరకు ధర పలికింది. ఇంతలోనే జిల్లా ఏర్పడి.. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు.. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు కూడా వచ్చాయి. పరిపాలన గత 20 రోజులుగా సాగుతోంది. అయినా ఎక్కడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతున్న ఆనవాళ్లు కనపడటం లేదు. కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల పేరుతో సాగిన భూముల వ్యాపారం స్తబ్దుగా ఉంది. మేము అమ్ముతాం. అంటున్నా.. ఎవరూ కొనేవాళ్లు లేరు.. రాయచోటిలో ఒకసారిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిపోయింది. వాస్తవ ధరకు మించి.. కొన్నారు.. దీంతో కొనేవాళ్లు లేరు.. ఇంక ఎప్పుడు మళ్ళీ ధరలు వస్తాయో? తెలియదు.. నాలుగో వంతు చెల్లించి అగ్రిమెంట్లు రాసుకున్నారు.. ఇప్పుడు మిగిలిన డబ్బు చెల్లించాలి.. వ్యాపారం చూస్తే.. కదలడం లేదు.. ఏం చేయాలో పాలుపోక.. కోట్ల రూపాయలు పెట్టి కొన్నవాళ్లు.. లాభం మాట దేవుడెరుగు.. మా అసలు మాకు ఇస్తే.. చాలు.. ఇంకా ఒకటో.. రెండు లక్షలు పట్టుకుని ఇచ్చినా చాలు.. అంటూ... ఇప్పుడు లబోదిబోమంటున్నారు.


మొదలైన పంచాయితీలు 

చాలా మంది కేవలం టోకన్ల మీద వ్యాపారాలు చేస్తారు.. ఎంతో కొంత లాభం పెట్టుకుని అమ్మేస్తారు. ఇలా చేతులు మారినవి.. ఇప్పుడు మిగిలిన మొత్తం డబ్బు చెల్లించలేక వివాదంలో పడుతున్నాయి. మొదట కొన్న వాళ్ళ నుంచి చేతులు మారి.. చివరగా.. కొన్న వాళ్ల దగ్గర వివాదం అవుతున్నాయి. అదేవిధంగా నాల్గవవంతు మొత్తం చెల్లించి.. అగ్రిమెంట్లు రాసుకున్నారు. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ల విషయంలోనూ... మిగతా మొత్తం చెల్లించలేక.. గడువు తీరి పోవడంతో.. వివాదాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతానికి బయట మధ్యవర్తుల వద్ద పంచాయితీలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో..ఈ  పంచాయితీలు ముదిరి..పోలీసుస్టేషన్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. అడ్డూ అదుపు లేకుండా.. సాగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని అడ్డుకునే వ్యవస్థ లేకపోవడంతోనే.. ఈ సమస్యలు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2022-04-25T05:30:00+05:30 IST